రాజధాని రైతులకు షాక్ - ఆగిపోయిన అమరావతి ఉద్యమం

జగన్ సర్కార్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు పిలుపిచ్చిన ఉద్యమానికి బ్రేక్ పడింది. 1560 రోజులుగా సుదీర్ఘంగా సాగుతున్న ఈ ఉద్యమం ఆపేస్తు జేఏసీ నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది జేఏసీ. రాజధాని ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది.

గత 1560రోజులుగా ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనప్పటికి, రాజధాని కోసం ఉద్యమించిన ప్రతి ఒక్కరి స్ఫూర్తిని గుర్తు చేసుకున్న జేఏసీ పోలీసుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపింది.రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈసీ ఆదేశాలతో, పోలీసుల సూచనలతో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నామని జేఏసీ నేతలు తెలిపారు. అయితే, ఈ విరామ సమయంలో కరోనా లాక్ డౌన్ సమయంలో లాగా ఇళ్ల నుండే తమ నిరసన కొనసాగించాలని కోరింది . తదుపరి కార్యాచరణను త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది జేఏసీ.