ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా ఏపీ రాజధాని అమరావతి

ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా ఏపీ రాజధాని అమరావతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో ప్రజ్వరిల్లే తొలి నగరంగా చరిత్ర సృష్టించనుంది. అమరావతి టౌన్ ప్లానర్స్ ఈ దిశగా అడుగులేస్తున్నారు. అమరావతిని రాజధాని నగరంగా నిర్మిస్తూనే.. మరోపక్క పూర్తి పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి నగర విద్యుత్ అవసరాల నిమిత్తం.. 2 వేల 7 వందల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని వినియోగించుకునే ప్రణాళికతో ముందుకెళ్లాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ విద్యుత్ అవసరాలకు.. సోలార్ పవర్, విండ్ పవర్, హైడ్రో పవర్ వినియోగించుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. 

ఈ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీకి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలలోనే శంకుస్థాపన చేస్తారని సమాచారం. 65 వేల కోట్లతో 217 స్క్వేర్ కిలోమీటర్లతో 8 వేల 3 వందల 52 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. 2050 నాటికి అమరావతికి 2వేల 7 వందల మెగావాట్ల (2.7 గిగావాట్ల) విద్యుత్ అవసరమవుతుందని అంచనా వేసిన అధికారులు, కనీసం ఇందులో 30 శాతం పునరుత్పాదక శక్తి (సోలార్, విండ్, హైడ్రో పవర్) నుంచే ఉత్పత్తి అవుతుందని అధికారులు చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. అమరావతిలో ప్రభుత్వం నిర్మించే హౌసింగ్ ప్రాజెక్టుల్లో రూఫ్ టాప్ సోలార్ పవర్ సిస్టమ్స్ తప్పనిసరి చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. అమరావతిలో నిర్మించబోయే గవర్నమెంట్ కాంప్లెక్స్, ప్రభుత్వ కార్యాలయాలు గ్రీన్ బిల్డింగ్ స్టాండర్డ్స్కు తగిన విధంగా ఉంటాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి మెట్రో, ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఈ పునరుత్పాదక విద్యుత్ శక్తితోనే నడిపించాలన్నది ఏపీ ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్. ఇప్పటికే అమరావతి టౌన్ ప్లానింగ్ అధికారులు అమరావతి పరిధిలో 415 కkW రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ను 16 అంగన్ వాడీ సెంటర్లు, 14 ఈ-హెల్త్ సెంటర్లు, 13 పబ్లిక్ స్కూల్స్లో ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగం 57 శాతానికి పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నయ విద్యుత్ ఉత్పాదక వనరులపై ఆధారపడి అమరావతిని నిర్మించాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం–చెన్నై, హైదరాబాద్–బెంగళూర్ ఇండస్ట్రియల్ కారిడార్లకు నిధులు మంజూరు చేస్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.