పంజాబ్ లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉంటున్నారు. రాష్ట్రంలో ని 13 లోక్‌సభ నియోజక వర్గాలకు కేండిడేట్ల ఎంపికలోనూ ఆయనే మాటే చెల్లుబాటు అయ్యేలా చూసుకున్నారు. వాళ్ల ప్రచార బాధ్యతల్నికూడా తన భుజంమీద వేసుకుంటున్నారు. ఏడుసీట్లను తన మద్దతు దార్లకు, నామినేట్ చేసినవారికే ఇప్పించుకోవడంలో అమరీందర్ సక్సెస్ అయ్యారు. మిషన్-13 అజెండా ను సక్సెస్ చేసేలా పక్కా ప్లాన్ తోనే ఆయన ముందుకు వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రిలాక్స్ గా ఉంటారని, సీఎంకు ఎవరికీ అందుబాటులో ఉండరన్న విమర్శలకు తన దూకుడుతో అమరీందర్ సింగ్ సమాధానం చెబుతున్నారు. మే 19న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తురుపుముక్కగా మారారు. పార్టీని గెలుపు దిశగా నడిపించడంలో, కేండిడేట్ల తరపున ప్రచారం జరపడంలో , సోషల్ మీడియాను పవర్ ఫుల్ గా వాడుకోవడంలో ముందుంటున్నారు.
తనవారికే సీట్లు!
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వద్దనుకున్నా కేంద్రమాజీ మంత్రి మనీశ్ తివారీకి టికెట్ ఇప్పించుకోవడంలో సీఎం విజయం సాధించారని చెబుతారు. రెండుసార్లు జరిపిన మీటింగ్స్ లో మనీశ్ తివారీకి టికెట్ ఇవ్వకూడదని రాహల్ నిర్ణయించు కున్నట్టు వార్తలొచ్చాయి. అయితే బలవంతంగా కాంగ్రెస్ చీఫ్ ను ఒప్పించి మరీ ఆయనకు ముఖ్యమంత్రి టికెట్ ఇప్పించారని పార్టీవర్గాలు చెప్పాయి. దీంతో మనీశ్‌కు ఆనందపూర్ సాహిబ్ సీటు దక్కింది. అంతేకాదు భార్య ,కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్ కు పాటియాలా సీటు ఇప్పించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, తన సహాయకుడు కేవల్ సింగ్ ధిల్లాన్ (సంగ్రూర్ ), మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ సాధిక్ (ఫరీద్ కోట్), సిట్టింగ్ ఎమ్మెల్యేరాజ్ కుమార్ (హోషియార్ పూర్ ), మాజీ ఎమ్మెల్యే జస్బీర్ సింగ్ దింపా (ఖాదూర్ సాహెబ్) , అమర్ సింగ్ (ఫతేగఢ్ సాహిబ్) లకు సీట్లు రావడానికి కూడా అమరీందర్ కష్టపడ్డట్టు చెబుతారు.
పార్టీలో అసమ్మతి!
అమరీందర్ సిఫార్సు చేసిన అభ్యర్థుల్ని హైకమాండ్ ఎంపిక చేయడంపై పార్టీలో అసమ్మతి గళం వినిపించిందన్న వార్తలొచ్చాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో కులపరమైన బేలన్స్ ను తప్పేలా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకున్నారని అసమ్మతి నేతలు విమర్శిస్తున్నారు. అయితే తాను నామినేట్ చేసిన కేండిడేట్లకు సపోర్ట్ చేయాలని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు అమరీందర్ స్పష్టం చేశారు. తన మద్దతుదార్లను గెలిపించుకోడానికి ఆయన చాలామంది రెబల్స్‌ను స్వయంగా కలిసి, పార్టీ కోసం పనిచేయాలని కూడాకోరారు. మాజీ ఎంపీ, రెబెల్ మొహిందర్ సింగ్‌ను ఇంటిదగ్గర కలిసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని నచ్చచెప్పడం విశేషం. అంతేకాదు, పార్టీ అభ్యర్థుల్ని గెలిపించకుంటే ఆయా నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల్ని బర్తరఫ్ చేస్తామని కూడా అమరీందర్ హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ ఎలెక్షన్ లో వాళ్లకు టికెట్లు కూడా ఇవ్వబోమని తేల్చిచెప్పేశారు. ఇవన్నీచూస్తుంటే కాంగ్రెస్ గెలుపుకోసం ఆయన ఎంతగా ఆరాటపడుతున్నారో తెలుస్తోందని సీఎం సన్నిహితులు చెబుతున్నారు. తనవాళ్లు ఏడుగురికి సీట్లు ఇప్పించుకున్నారన్న ఆరోపణల్ని మాత్రం కొట్టిపారేస్తున్నారు. 13 మంది అభ్యర్థుల గెలుపే తనముందున్న టార్గెట్ అని స్పష్టం చేస్తున్నారు.