అరుగుదలకు తమలపాకు

అరుగుదలకు తమలపాకు

వేసవిలో శరీరం డీహైడ్రేషన్​కు గురవుతుంది. కాబట్టి ఎక్కువగా నీళ్లు ఉండే పదార్థాలు తినాలి. ఇప్పటికే చాలామంది ఇండ్లలో పప్పుచారు, మిరియాల రసం, టొమాటో రసం, సాంబార్... లాంటి లిక్విడ్ రెసిపీలు మొదలుపెట్టి ఉంటారు. అయితే, వీటితోపాటు తమలపాకు రసం కూడా చేరిస్తే... ఆరోగ్యానికి చాలా మంచిదట.

తమలపాకు రసాన్ని వెతలై రసం అని కూడా అంటారు. ఇది దక్షిణాది భారతీయుల సంప్రదాయ వంటకం. తాజా తమలపాకులు, నెయ్యి, సుగంధ ద్రవ్యాలతో ఎంతో రుచికరంగా చేస్తారు. ఈ రసాన్ని అన్నంలో తింటే బాగుంటుంది. దీనివల్ల జీర్ణక్రియ బాగుంటుంది. మరి ఇంతకీ దీన్నెలా తయారుచేయాలంటారా?

కావాల్సినవి : 

తమలపాకులు – నాలుగు, 
టొమాటోలు – రెండు, 
చింతపండు రసం – పావు కప్పు, 
వెల్లుల్లి – ఆరు, 
జీలకర్ర – ముప్పావు టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – ఒకటి, 
ఎండుమిర్చి – రెండు, 
కరివేపాకు – కొద్దిగా, 
ఇంగువ – ఒక టీస్పూన్​, 
ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, 
మెంతులు – అర టీస్పూన్​, 
ఉప్పు--‌‌– సరిపడా, నెయ్యి– ఒక టేబుల్ స్పూన్.

తయారీ: 

మిక్సీజార్​లో తమలపాకులు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి పౌడర్​లా గ్రైండ్ చేయాలి. తర్వాత టొమాటోలను గుజ్జులా మిక్సీ పట్టాలి. ఒక పాన్​లో నెయ్యి వేడి చేసి, మెంతులు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేగించాలి. అందులో చింతపండు రసం, ఉప్పు వేసి కాగబెట్టాలి. రెడీ చేసి పెట్టిన తమలపాకుల పొడిని అందులో వేసి కలపాలి. కాసేపు కాగబెడితే, తమలపాకుల రసం రెడీ. 

ఉపయోగాలు

తమలపాకుల్లో విటమిన్ – సి, థయమిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్, కెరొటిన్, కాల్షియం  పుష్కలంగా ఉంటాయి. తమలపాకులు కొన్ని రకాల అనారోగ్యాలను నయం చేస్తాయని ఆయుర్వేదం చెప్తోంది. దగ్గు, ఆస్తమా, తలనొప్పి, అనొరెగ్జియా, ఆర్థరైటిస్​లకు మంచి మందు. అంతేకాకుండా నొప్పి నుంచి ఉపశమనాన్నిస్తుంది. అలాగే వాపును తగ్గించడంలో పనిచేస్తుంది. తమల పాకు రసం తాగితే అరుగుదల సమస్య ఉండదంటున్నారు ఆయుర్వేద ఎక్స్​పర్ట్స్​.