
More Retail IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో గడచిన రెండు నెలలుగా కొనసాగుతున్న క్షీణత, అస్థిరత వంటి కారణాల దృష్ట్యా అనేక కంపెనీలు తాత్కాలికంగా తమ ఐపీవో ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లటాన్ని వాయిదా వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రిటైల్ పెట్టుబడిదారులు కొత్తగా వచ్చే ఐపీవోల జాబితా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీవో లిస్టింగ్స్ ద్వారా గెయిన్స్ పొందాలని వారు భావిస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అమెజాన్ సపోర్టుతో నడుస్తున్న మోర్ రిటైల్ స్టోర్ల గురించే. దేశీయ కిరాణా వ్యాపారంలో కంపెనీ మంచి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీ ఈ క్రమంలో తన స్టోర్ల సంఖ్య ను భారీగా పెంచేందుకు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవో లిస్టింగ్ కోసం వస్తోందని కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడైంది. ప్రజలు ఎక్కువగా సూపర్ మార్కెట్లు, ఆన్ లైన్ కొనుగోళ్లకు మెుగ్గుచూపుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మోర్ రిటైల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 775 స్టోర్లను నిర్వహిస్తోంది. గత ఏడాదితో పోల్చితే 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల అమ్మకాలు 50 వేల కోట్ల రూపాయలుగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల పనితీరు, మార్కెట్ సైకిల్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రానున్న ఏడాది మార్కెట్లోకి రాబోతున్నట్లు ఎండీ, వినోద్ నంబియార్ వెల్లడించారు. కంపెనీ తన స్టోర్లను రిటైల్ విక్రయాలకు వినియోగించటంతో పాటు అమెజాన్ ఫ్రెష్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లుగా ఏకకాలంలో పనిచేయనున్నాయని ఆయన వెల్లడించారు.
వాస్తవానికి దేశంలో తమ కిరాణా సరుకుల డెలివరీ వ్యాపారాన్ని విస్తరించటానికి ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తో జతకట్టినట్లు మోర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రానున్న 18 నెలల కాలంలో దేశంలోని 160 నగరాల్లో కొత్తగా 500 స్టోర్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. అలాగే రానున్న కాలంలో బిగ్ బాస్కెట్ మాదిరిగా స్లాటెడ్ డెలివరీ సేవలను అందించటానికి మోర్ సిద్ధమౌతోంది. నగరాల్లోని ప్రజల అలవాట్లలో మార్పులకు అనుగుణంగా వస్తున్న క్విక్ కామర్స్ వ్యాపారాల నుంచి పోటీని తట్టుకునేందుకు ఈ ప్రణాళిక దోహదపడుతుందని కంపెనీ వెల్లడించింది. గత సంవత్సరం వచ్చిన ఈ-గ్రోసరీ ఆర్డర్లలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ క్విక్ డెలివరీ మోడల్ వాటా కలిగి ఉంది.