శాన్ఫ్రాన్సిస్కో : ఆర్థిక మాంద్యం భయాలు, ఖర్చులు తగ్గించుకోవాలనే సాకుతో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆ ప్రక్రియ ప్రారంభించింది. కార్పొరేట్, టెక్నాలజీ విభాగాల్లో దాదాపు10 వేల మంది ఉద్యోగులను తీసేయాలని నిర్ణయించిన కంపెనీ తొలుత అమెరికాలోని ఉద్యోగుల్ని సాగనంపేందుకు రెడీ అయింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని టీమ్‌లు, ప్రోగ్రామ్స్‌లను తొలగించాలని, మరికొందరి సేవలను తగ్గించుకోవాలని నిర్ణయించామని హార్డ్‌వేర్ చీఫ్ డేవ్ లింప్ ఉద్యోగులకు రాసిన మెమోలో స్పష్టం చేశారు. ఉద్యోగాలు కోల్పోయే వారు కొత్త జాబ్ వెతుక్కునేందుకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు.
ఇదిలా ఉంటే తొలి దశలో కాలిఫోర్నియాలోని వివిధ సెంటర్లలో సేవలందిస్తున్న 260 మంది డాటా సైంటిస్టులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఇతర కార్పొరేట్ వర్కర్లను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. జనవరి 17 నుంచి ఉద్యోగాల కోత ప్రభావం ఉంటుందని వెల్లడించింది. స్థానిక చట్టాల ప్రకారం కంపెనీ ఎంప్లాయిస్ ను తొలగించడానికి 60 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అమెజాన్‌లో 10 లక్షల 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఖర్చుల నియంత్రణలో భాగంగా అమెజాన్ దశలవారీగా తన ఉద్యోగుల్లో 3శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది.
కోవిడ్ సమయంలో భారీ లాభాలార్జించిన అమెజాన్ కు ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. కోవిడ్ కారణంగా ఆన్ లైన్ షాపింగ్ కు మొగ్గుచూపిన కస్టమర్లు ఇప్పుడు ఆఫ్ లైన్ కు మొగ్గుచూపుతున్నారు. ఇది కాస్తా కంపెనీ ఆదాయంపై ప్రభావం చూపింది. దీంతో అమెజాన్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు కొత్త ప్రాజెక్టుల్ని వాయిదా వేస్తోంది.
ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో సోషల్ మీడియా, టెక్నాలజీ, ఈ- కామర్స్ దిగ్గజాలు ఉద్యోగాల కోతలకు దిగుతున్నాయి. ట్విట్టర్, మెటా (ఫేస్‌బుక్), మైక్రోసాఫ్ట్, అమెజాన్ తదితర కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించే ప్రక్రియ చేపట్టాయి. ట్విట్టర్ గతవారమే తన హెడ్ కౌంట్‌ను సగానికి తగ్గించగా, ఆ తర్వాత మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా అమెజాన్ కూడా ఈ కంపెనీల సరసన చేరింది.