
ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ధరలను తగ్గించడంతో పాటు వినియోగాదారులను ఆకర్షించడమే లక్ష్యంగా కొనుగోళ్లపై విధించే వివిధ ట్యాక్స్‌లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే.. రూ.300 కంటే తక్కువ ధర ఉన్న వస్తువులపై రిఫెరల్ ఫీజులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. 2025, ఏప్రిల్ 7వ తేదీ నుంచి తగ్గింపు అమల్లోకి వస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే షిప్పింగ్ ఫీజులు కూడా తగ్గిస్తామని వినియోగాదారులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నిర్ణయాల వల్ల ఎంతో మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతోందని అమెజాన్ పేర్కొంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే ఆన్‌లైన్ వ్యాపారులు ప్రతి అమ్మకంపై కంపెనీలకు కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈ కమీషన్‌ను తిరిగి కస్టమర్లపై వేస్తారు. దీంతో ఆన్‌లైన్ వినియోగదారులకు కొనుగోలు మరింత భారంగా మారుతోంది. దీని వల్ల నష్టం జరుగుతోందని.. ఆన్ లైన్లో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి కనబర్చడం లేదని గ్రహించి పలు ట్యాక్సులను రద్దు చేయాలని నిర్ణయించింది అమెజాన్.
ఇందులో భాగంగానే రూ.300 కంటే తక్కువ ధర ఉన్న వస్తువులపై రిఫెరల్ ఫీజులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రిఫెరల్ ఫీజులను తొలగించడంతో పాటు, అమెజాన్ షిప్పింగ్, బరువు నిర్వహణ ఛార్జీలను కూడా తగ్గించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. గతంలో రూ. 77గా ఉన్న ప్రామాణిక షిప్పింగ్ ఫీజు ఇప్పుడు రూ. 65 కానుంది. ఈ సవరించిన విధానాలు వ్యాపారులకు లాభాల మార్జిన్‌లను మెరుగుపరచడం ద్వారా అమెజాన్ విక్రేత నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతో పాటు కస్టమర్లకు ఆన్‌లైన్ షాపింగ్‌ను మరింత పొదుపుగా మారుస్తోందని సంస్థ ప్రతినిధులు భావిస్తోన్నారు.
అమెజాన్ ఇండియా సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్ డైరెక్టర్ అమిత్ నందా దీనిపై మాట్లాడుతూ.. రూ. 300 వరకు ధర ఉన్న వస్తువులు మధ్య తరగతి ప్రజల రోజువారీ కొనుగోళ్లలో కీలకంగా ఉంటాయి. వీటిపై ట్యాక్సులు తగ్గిస్తే మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తోందన్నారు. జోమాటో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ కారణంగా అమెజాన్ ఈ ట్యాక్స్ తగ్గింపులు చేపట్టినట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.