ఐటీ ఉద్యోగులకు షాక్ : ప్రమోషన్లు కావాలంటే ఆఫీసులకు రండి..

ఐటీ ఉద్యోగులకు షాక్ : ప్రమోషన్లు కావాలంటే ఆఫీసులకు రండి..

మీకు ప్రమోషన్ కావాలా.. ఇంక్రిమెంట్లు కావాలా.. అన్నీ ఇస్తాం.. ముందు మీరు వర్క్ టూ ఆఫీస్ విధానం పాటించండి.. అదేనండీ ఆఫీసులకు వచ్చి పని చేయటం.. వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పని చేస్తాం అంటే ఇవన్నీ ఇవ్వటం కుదరదు.. ఉద్యోగులకు అల్టిమేటం ఇచ్చింది అమెజాన్. వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే అనే నిబంధన తర్వాత.. చాలా మంది ఉద్యోగులు మానేయటం.. హెల్త్, ఇతర కారణాలతో వర్క్ ఫ్రం హోంకు డిమాండ్ చేయటంతో యాజమాన్యం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. మీరు ఇంట్లో ఉండి చేసి.. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కోరటంలో అర్థం లేదు.. ముందు ఆఫీసులకు వచ్చి పని చేయటం.. ఆ తర్వాత ఆలోచిస్తాం అని చెప్పేసింది. అంటే వర్క్ ఫ్రం హోంలో పని చేస్తే ఇవన్నీ కష్టమని చెప్పటం ఇప్పుడు ఐటీ రంగంలో సంచలనంగా మారింది. 

ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో మొదలైన వర్క్ ఫ్రం హోం విధానానికి అన్ని ఐటీ, కార్పొరేట్ కంపెనీలు ముగింపు పలుకుతున్నాయి. ఇప్పటికే అమెజాన్ లో వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలనే ఆర్డర్స్ ఉన్నాయి. అయినా చాలా మంది రావటం లేదని.. దీన్ని సీరియస్ గా తీసుకోవటం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చింది. 

వర్క్ ఫ్రం హోంలోనూ టార్గెట్స్ రీచ్ అవుతున్నా.. కొత్త ప్రాజెక్టుల విషయంలో నాణ్యత లోపిస్తుందని.. ఉద్యోగుల మధ్య చర్చలు, సమావేశాలు లేకపోవటం వల్ల ఐడియాల సంఖ్య తగ్గిపోతుందని అమెజాన్ కంపెనీ ప్రతినిధి బ్రాడ్ గ్లాసర్ వెల్లడించారు. కంపెనీ కొత్త పాలసీ తీసుకొచ్చింది. విధిగా మూడు రోజులు ఆఫీసులకు రావాలి అని.. ఐదు రోజులు వచ్చినా ఇబ్బంది లేదు.. అలా కాకుండా వర్క్ ఫ్రం హోం కావాలంటే మాత్రం ఉద్యోగులదే తుది నిర్ణయం అని వెల్డించారు. మిగతా కార్పొరేట్ కంపెనీలు సైతం ఇదే విధానంలోకి వస్తున్నాయని.. రాబోయే రోజుల్లో వర్క్ ఫ్రం హోం విధానం ఉండకపోవచ్చని వెల్లడించారు. గతంలో కంటే మెరుగ్గా ఆఫీసుల్లో సౌకర్యాలు కల్పించటం జరిగిందని.. మరింత వర్క్ కల్చర్ డెవలప్ చేయటానికి ప్రయత్నిస్తామని వెల్లడించారాయన.