- రాష్ట్రంలో పెట్టుబడులు 1,78,950 కోట్లు
- ఉద్యోగ అవకాశాలు 49,500 మందికి
- డేటా, ఏఐ హబ్‌గా హైదరాబాద్-రూ. 60 వేల కోట్లతో అమెజాన్ డేటా సెంటర్లు
- టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ పెట్టుబడి రూ.15వేల కోట్లు
- రూ. 4,500 కోట్లతో బ్లాక్‌స్టోన్ లూమినా ముందుకు..
- సోలార్ సెల్స్ తయారీ యూనిట్‌కు అక్షత్ గ్రీన్ టెక్ ఓకే
- ఏఐ సెంటర్ కోసం ఉర్సా క్లస్టర్స్ రూ. 5 వేల కోట్లు
- మరింత విస్తరణకు ముందుకొచ్చిన ఇన్ఫోసిస్, విప్రో
- వెల్లడించిన అధికారులు.. నేడు రాష్ట్రానికి సీఎం రాక
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు అగ్రశ్రేణి కంపెనీలు ముందుకు వచ్చాయి. దావోస్ వేదికగా 20 దేశీయ, విదేశీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఓకే చెప్పాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలోని ‘తెలంగాణ రైజింగ్ టీమ్’ మూడు రోజులు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంది. వీరి సమక్షంలో డేటా, ఎనర్జీ, ఏఐ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఇందులో అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి.
తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని ప్రకటించాయి. మూడు రోజుల పర్యటనలో రూ. 1,78,950 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 49,500 మందికి ఉద్యోగాలు వస్తాయని అధికారులు వెల్లడించారు. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాగా.. అప్పటితో పోలిస్తే ఈసారి నాలుగు రెట్లకు మించి పెట్టుబడులకు కంపెనీలు అంగీకారం తెలిపాయని పేర్కొన్నారు.
ఆకట్టుకున్న ఫ్యూచర్ సిటీ, స్కిల్ వర్సిటీ
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం ఈ నెల 20 నుంచి 23 వరకు దావోస్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు. కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్‌లో ఉన్న అనుకూలతలను, రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ.. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుందని అధికారులు తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణకు ప్రకటించిన రోడ్‌మ్యాప్, రాష్ట్రప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలు కూడా పెట్టుబడులకు దోహదపడ్డాయని పేర్కొన్నారు.
పెట్టుబడులకు గమ్యస్థానం : సీఎం
పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతోపాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ పారిశ్రామికవేత్తలను దృష్టిని ఆకర్షించిందని ఆయన పేర్కొన్నారు.
దావోస్‌లో అతిపెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని అమెజాన్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో రూ. 60 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ కంపెనీ అంగీకరించింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు. దాదాపు రూ. 60 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళికలతో హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్లను విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ అభ్యర్థించగా.. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
భవిష్యత్‌లో ఆర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి. తెలంగాణలో తమ క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించింది. ఒక బిలియన్ పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు సెంటర్లను గతంలోనే అభివృద్ధి చేసింది. ఈ మూడు కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి.
తెలంగాణ రైజింగ్ విజన్ తో ప్రజా ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయని సీఎం రేవంత్ అన్నారు. ఈ ఒప్పందంతో దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా హైదరాబాద్ తిరుగులేని గుర్తింపు సాధిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
సంగారెడ్డిలో సుహానా ఎక్స్‌లెన్స్ సెంటర్
తెలంగాణలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సంగారెడ్డిలో ప్రస్తుతమున్న సుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. దావోస్ సదస్సులో సుహానా డైరెక్టర్ ఆనంద్ చోర్డియా మంత్రి డి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. రాబోయే రెండు మూడేండ్లలో ఈ సెంటర్ ద్వారా 25 వేల నుంచి 30 వేల మంది రైతులకు శిక్షణనిస్తారు. సుగంధ ద్రవ్యాల నాణ్యత, వ్యవసాయ పద్ధతులను ఆధునికరించే నైపుణ్యాలు అందిస్తారు.
సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించటంతో పాటు రైతుల జీవనోపాధి పెంచేలా మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తారు. దేశంలోని అతిపెద్ద మిరప ప్రాసెసింగ్ యూనిట్లలో ఒకటైన సంగారెడ్డిని ఈ సెంటర్ ఏర్పాటుకు కీలకంగా ఎంచుకుంది. ప్రభుత్వ సహకారంతో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామని సుహానా మసాలా ప్రతినిధులు పేర్కొన్నారు.
బ్లాక్ స్టోన్ @ రూ.4,500 కోట్లు
పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ లూమినా హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. 150 మెగావాట్ల డేటా సెంటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో బ్లాక్‌స్టోన్ లూమినా (బ్లాక్‌స్టోన్ డేటా సెంటర్ విభాగం)తో పాటు జేసీకే ఇన్ఫ్రా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 4,500 కోట్ల వరకు బ్లాక్ స్టోన్ కంపెనీ పెట్టుబడి పెట్టనుంది.
ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ భద్రతా ప్రొటోకాల్ అవసరాలకు సంబంధించి ఏఐ ఆధారిత సేవలను ఈ డేటా సెంటర్ అందిస్తుంది. బ్లాక్‌స్టోన్ లూమినా ప్రపంచంలోని ప్రముఖ క్లౌడ్ మౌలిక సదుపాయాల ప్రొవైడర్లలో కీలకంగా ఉంది.
టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ @ రూ.15,000 కోట్లు
రూ. 15,000 కోట్ల పెట్టుబడులతో 300 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధి చేసేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ అంగీకరించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఆధారిత అప్లికేషన్లు, క్లౌడ్ సేవలు, డేటా ప్రాసెసింగ్‌కు ఈ డేటా సెంటర్ ఉపయోగపడుతుంది.
టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ తో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం హైదరాబాద్ స్థాయిని మరింత పెంచుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రెసిడెంట్ సచిత్ అహుజా మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు, దార్శనిక నాయకత్వం తమను ఆకట్టుకుందని చెప్పారు.
విప్రో క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్
విప్రో కంపెనీ హైదరాబాద్‌లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు ప్రకటించారు. దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు.. విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తో సమావేశమయ్యారు. అనంతరం ఈ కీలక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం వృద్ధిలో విప్రో కీలక భాగస్వామి. ఇప్పటికే గోపనపల్లిలో ఆ కంపెనీ క్యాంపస్ ఉండగా.. ఇప్పుడు అక్కడ మరో సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
విప్రో క్యాంపస్ విస్తరణతో రాష్ట్రంలో సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందనుంది. కొత్త ఐటీ సెంటర్ రాబోయే రెండు మూడేండ్లలో పూర్తవుతుంది. విప్రో విస్తరణ ప్రణాళికను సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు,వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, అవకాశాలు సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తమకు ఉత్సాహంగా ఉందని ఈ సందర్భంగా విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అన్నారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. ఆయన శుక్రవారం రాష్ట్రానికి చేరుకోనున్నారు.
హైదరాబాద్‌లో ఎక్లాట్ హెల్త్ కొత్త ఆఫీస్
ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ రాష్ట్రంలో మరో ఆఫీసు ఏర్పాటు చేయనుంది. దాదాపు 800 మంది ఉద్యోగులకు సదుపాయం ఉండేలా దీన్ని నెలకొల్పనుంది. దావోస్ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఎక్లాట్ కంపెనీ సీఈవో కార్తీక్ పోల్సానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరించనున్నట్లు కంపెనీ సీఈవో ప్రకటించారు. విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో అత్యాధునిక 800- సీట్ల సౌకర్యాన్ని ఎక్లాట్ ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్ 2025 నాటికి ఇది పని చేయటం ప్రారంభిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఎక్లాట్ సీఈవో కార్తీక్ పోల్సాని అన్నారు. హెల్త్‌కేర్ రంగంలో అమెరికాలోనే అతిపెద్ద యునైటెడ్ వ్యవస్థ ఉన్న ఈ కంపెనీ తమ వినియోగదారులకు మరింత సమర్థవంతమైన సేవలను అందించేందుకు అదనంగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. వాషింగ్టన్లో ప్రధాన కార్యాలయమున్న ఎక్లాట్ హెల్త్ సంస్థ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికి పైగా నిపుణులను నియమించింది. అమెరికాలోనే 450 మంది ఉద్యోగులున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న రెండు ఆఫీసుల్లో 2 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు.
సోలార్ సెల్స్ తయారీ యూనిట్ @ రూ.7000 కోట్లు
అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్‌లో 6.9 గిగావాట్ల సోలార్ సెల్స్ అండ్ 6.9 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుపై కంపెనీ రూ. 7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దాదాపు 2,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, స్థానికంగా మరింత మందికి ఉపాధి దొరుకుతుందని ఆఫీసర్లు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల సమక్షంలో అక్షత్ గ్రీన్‌టెక్ (మైత్రా గ్రూప్)తో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సమావేశానికి కంపెనీ తరఫున డైరెక్టర్ గిరీష్ గెల్లి ప్రాతినిధ్యం వహించారు.
ఉర్సా క్లస్టర్స్ ఏఐ డేటా సెంటర్
అమెరికాకు చెందిన కంపెనీ ఉర్సా క్లస్టర్స్ రాష్ట్రంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను స్థాపించనుంది. దీనికి సంబంధించి దావోస్ లో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుంది. కంపెనీ సీవోవో సతీష్ అబ్బూరి, సీఆర్వో ఎరిక్ వార్నర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. హైదరాబాద్ లో 100 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని కంపెనీ సీఈవో పెందుర్తి అన్నారు. ఇందులో హైబ్రిడ్ ఏఐ చిప్‌లను ఉపయోగిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై దాదాపు రూ. 5,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఉర్సాతో భాగస్వామ్యం పంచుకోవటంతో అత్యాధునిక సాంకేతికత రంగంలో రాష్ట్రం మరో ముందడుగు వేస్తున్నదని అన్నారు.
ఇన్ఫోసిస్ భారీ విస్తరణ
ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లో తమ ఐటీ క్యాంపస్ ను విస్తరించనుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఇన్పోసిస్ ప్రణాళికను సిద్ధం చేసింది. అందుకు తగ్గట్టు అక్కడున్న సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దావోస్ సదస్సులో ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ సంఘ్రాజ్కా.. మంత్రిశ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు . ఈ ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్‌లో ఇన్ఫోసిస్ సంస్థ రూ. 750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపడుతుంది. వచ్చే రెండు మూడేండ్ల లో ఈ నిర్మాణం పూర్తవుతుంది.
బ్లాక్‌స్టోన్ లూమినా సంస్థ హైదరాబాద్‌లో 150 మెగావాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. రూ.4,500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ భద్రతా ప్రొటోకాల్ సంబంధించి ఏఐ ఆధారిత సేవలను ఈ డేటా సెంటర్ అందిస్తుంది.
300 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధి చేసేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ అంగీకరించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ పెట్టుబడి రూ. 15,000 కోట్లు. ఆర్టిఫిషియల్ ఆధారిత అప్లికేషన్లు, క్లౌడ్ సేవలు, డేటా ప్రాసెసింగ్‌కు ఈ డేటా సెంటర్ ఉపయోగపడుతుంది.
ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లో తమ ఐటీ క్యాంపస్‌ను విస్తరించనుంది. పోచారంలో ఉన్న క్యాంపస్ లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.