టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్(Suhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్(Ambajipeta Marriage Band). దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శివాని నగరం హీరోయిన్ గా నటిస్తుండగా.. ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు(ఫిబ్రవరి 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? కలర్ ఫోటో తరువాత సుహాస్ ఆడియన్స్ ను ఏమేరకు మెప్పించాడు? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
అంబాజీపేట గ్రామం. ఆ ఊళ్ళో మల్లి ( సుహాస్) అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో పని చేస్తూ ఉంటాడు. అతనికి అక్క పద్మ (శరణ్య ప్రదీప్) ఉంటుంది. ఇదే గ్రామంలో కోటీశ్వరుడైన వెంకట్ అప్పులు ఇస్తూ అందరిని కంట్రోల్ లో పెట్టుకుంటాడు. మల్లి, వెంకట్ చెల్లులు లక్ష్మీతో( శివానీ నాగారం) ప్రేమలో పడతాడు. ఒకరోజు వెంకట్ కు తన చెల్లి మల్లితో ప్రేమలో ఉందని తెలుస్తుంది. దాంతో మల్లి అక్క పద్మని దారుణంగా అవమానిస్తాడు. అది తెలిసిన మల్లి ఆవేశంతో రగిలిపోతాడు. ఆతరువాత అంబాజీపేట గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ కథ 2007 నేపథ్యంలో సాగుతుంది. కథ, కథనాలు చాలా సహజంగా ఉన్నాయి. అప్పటి పరిస్థితులను, ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు. ముందు కాస్త ల్యాగ్ అనిపించినా.. ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతాయి.
ఇక సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ కంటెంట్ తో నింపేశాడు. మరీ ముఖ్యంగా శరణ్య ప్రదీప్ పాత్ర నేపధ్యంలో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఖచ్చితంగా ఈ పాత్ర ఆమె కెరీర్ లో గుర్తుండిపోవడం ఖాయం. ఇక క్లైమాక్స్ కూడా రొటీన్ గా కాకండా కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు.
నటీనటులు:
సుహాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంబాజీపేటలో మరోసారి తన అద్భుతమైన నటనను కనబరిచాడు. ఫస్ట్ ఆఫ్ లో ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ లో అదరగొట్టిన సుహాస్.. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ పడించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక నటి శరణ్య ప్రదీప్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమెకు ఈ రేంజ్ క్యారెక్టర్ దొరకడం ఇదే ఫస్ట్ టైం. దొరికిందే అదునుగా అద్భుతమైన నటనతో చెలరేగిపోయారు శరణ్య. హీరోయిన్ శివాని నాగారం తన క్యూట్ నటనతో ఆకట్టుకున్నారు. మిగతా నటులు కూడా తమ పాత్ర మేరకు మెప్పించారు.
సాంకేతిక నిపునులు:
అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాకు ప్రధాన బలం అంటే మ్యూజిక్ అనే చెప్పాలి. మూడ్ కి తగ్గట్టుగా వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. ఆ తరువాత చెప్పుకోవాల్సింది కెమెరా అండ్ ఆర్ట్ వర్క్ గురించి. నేటివిటీకి తగ్గట్టుగా నేచురల్ గా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇక దర్శకుడు దుష్యంత్ కటికనేని తాను ఎంచుకున్న కథను ఎలాంటి హంగులు లేకుండా చాలా సహజంగా, నిజాయితీగా తెరకెక్కించాడు.
ఇక అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది.