వక్ఫ్​ బోర్డు సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం: ముఖేష్​ అంబానీ ముంబైలోని అంటిలియా ప్యాలెస్​ ఖాళీ చేయాలా?

వక్ఫ్​ బోర్డు సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం: ముఖేష్​ అంబానీ  ముంబైలోని అంటిలియా ప్యాలెస్​ ఖాళీ చేయాలా?

ముఖేష్ అంబానీ పేరు వినగానే భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఇలా గుర్తు పట్టేస్తారు.ఆయ‌న నివాసమైన అంటిలియా ప్రపంచంలోని ఖరీదైన వ్యక్తిగత నివాసాల్లో ఒకటిగా పేరుగాంచింది.అయితే, తాజాగా ఈ విలాసవంతమైన భవనం మళ్లీ వార్తల్లోకి రావడానికి కారణం మాత్రం భిన్నంగా కనిపిస్తోంది.ఇటీవల పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చలు జరగడం, పాత అంశాలను తిరిగి తెరపైకి తీసుకువచ్చింది. వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025 కు  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఆమోదాన్ని  తెలిపారు.  

బిలియనీర్, ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భారతదేశంలోనే అతిపెద్ద ధనవంతుడు.  ఆయన నివాసమైన అంటీలియా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.  ముంబై.. మౌంట్​ ప్యాలెస్​ భవంతిని 15 వేల కోట్లతో నిర్మించారు.   అయితే ఆ భవంతి నిర్మించిన స్థలం వక్ఫ్​ బోర్డు నుంచి కొనుగోలు చేయడంతో ఆయన ఇప్పుడు ఆ భవంతినిఖాళీ చేయాలా లేదా అనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.  

పార్లమెంట్​లో వక్ఫ్​ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో  ఇప్పుడు .. ముఖేష్​ అంబానీకి చెందిన అంటీలియా విషయం తెరపైకి వచ్చింది. ముంబైలోని పెరేడ్ రోడ్ ప్రాంతంలో ఉన్న 'అంటిలియా' వక్ఫ్ బోర్డు భూమిలో నిర్మించబడిందని కొందరు ఆరోపిస్తున్నారు. 2002లో ముఖేష్ అంబానీ వక్ఫ్ బోర్డు నుంచి దాదాపు రూ.21 కోట్లకు ... నాలుగున్నర లక్షల చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు.

గతంలో కూడా ఈ విషయంలో వివాదం జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీలో సమర్పించిన నివేదిక ప్రకారం, వక్ఫ్ బోర్డు ఆస్తిని ప్రైవేట్ ఉపయోగం కోసం విక్రయించడానికి వీలులేదు. ఈ కేసు చాలా కాలంగా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఒక భూమిపై వక్ఫ్ దావా వేసిన కేసు ఇది ఒక్కటే కాదు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. 1950లో భారతదేశంలో వక్ఫ్ బోర్డు వద్ద కేవలం 52వేల ఎకరాల భూమి మాత్రమే ఉండేది. అది 2025 నాటికి 9.4 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలుస్తోంది.

మహారాష్ట్ర అసెంబ్లీలో సమర్పించబడిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) ప్రకారం.. ఈ భూమి  1986లో కరీం భాయ్ ఇబ్రహీంకు  .. విద్యా సంస్థతో పాటు  అనాథాశ్రమాన్ని స్థాపించడానికి వక్ఫ్ బోర్డుకు విరాళంగా ఇచ్చారు.  తరువాత దానిని  వక్ఫ్​బోర్డు అంబానీకి విక్రయించింది.

ప్రస్తుతం  ముఖేష్ అంబానీ, నీతా అంబానీ  కుటుంబం 27 అంతస్తుల అత్యాధునిక భవనం ఆంటిలియాలో నివసిస్తున్నారు ఈ అందమైన ప్రైవేట్ నివాసాన్ని చికాగోకు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ పెర్కిన్స్ మరియు విల్ రూపొందించగా...  దీని నిర్మాణాన్ని ఆస్ట్రేలియన్ కంపెనీ లైటన్ హోల్డింగ్స్ నిర్వహించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాలలో ఒకటి. అయితే ఇప్పుడు వక్ఫ్​ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ముఖేష్​ అంబానీ అంటీలియా భవనాన్ని ఖాళీ చేస్తారా.. లేదా అనే విషయం చర్చ కొనసాగుతుంది.  మరి ప్రపంచ కుబేరుని విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి..