చిరంజీవి రాజకీయాలపై అంబటి సంచలన కామెంట్స్

చిరంజీవి రాజకీయాలపై అంబటి సంచలన కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రజారాజ్యమే.. ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందిందని లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు చేసిన వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇచ్చారు. సోమవారం (ఫిబ్రవరి 10) అంబటి మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి అసలు రాజకీయాలకు పనికిరారని హాట్ కామెంట్స్ చేశారు. చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‎లో విలీనం చేసినట్లే.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో కలుపుతారా అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేన అయ్యిందన్న చిరంజీవి మాటల వెనక అర్థమేంటని నిలదీశారు. జనసేనను కూడా బీజేపీలో విలీనం చేస్తారో ఒక పవన్ కల్యాణ్ చెక్ చేసుకోవాలని సూచించారు. 

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి మెగాస్టార్‎గా పేరు పొందిన చిరంజీవి.. 2008లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2008లో ప్రజా రాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాలు మొదలుపెట్టిన చిరు.. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బరిలోకి దిగారు. చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసి 18 స్థానాల్లో విజయం సాధించింది. చిరు తిరుపతి, పాలుకొల్లు రెండు స్థానాల నుంచి బరిలోకి దిగి.. తిరుపతిలో విజయం సాధించి.. పాలకొల్లులో ఓటమి పాలయ్యారు.

 అనంతరం జరిగిన పరిణామాలతో 2014లో ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‎లో విలీనం చేశాడు. కాంగ్రెస్ చిరంజీవికి కేంద్రమంత్రి పదవి కట్టబెట్టింది. ఆ తర్వాత చిరు పూర్తిగా రాజకీయాలకు దూరమై.. మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం పాలిటిక్స్‎కు దూరంగా ఉంటున్న మెగాస్టార్.. తాజాగా జరిగిన విశ్వక్ సేన్ లైలా మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో బహిరంగంగా జై జనసేన అన్నారు. చిరంజీవి నోట జనసేన పేరు రావడంతో ఆయన మళ్లీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారా అన్న చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి రాజకీయాలపై అంబటి రాంబాబు పై విధంగా వ్యాఖ్యానించారు.