ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఎన్నికలకు రెండు వారాల సమయం కూడా లేకపోవటంతో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడటంతో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం హోరెత్తుతోంది. ఈ క్రమంలో వైసీపీని వీడి జనసేనకు మద్దతు పలికిన క్రికెటర్ అంబటి రాయుడు సీఎం జగన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అవనిగడ్డలో జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అంబటి రాయుడు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ కు మళ్ళీ ఓటేస్తే రాష్ట్రం పాతాళానికే అని అన్నారు. వైసీపీలో ఉంటే ప్రజాసేవ చేయలేమని, ఆ పార్టీలో బానిసత్వం తప్ప , ఏ ఉండదని తెలుసుకున్నానని అన్నారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా జగన్ కాళ్ళ కింద చెప్పులా ఉండాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాయుడు. జగన్ క్రీడారంగాన్ని సైతం నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో సమర్థవంతుడైన నాయకుడ్ని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు అంబటి రాయుడు.