టీమిండియా మాజీ అంబటి రాయుడు తన కెరీర్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్రికెట్ కెరీర్ నాశనం కావడానికి కారణమై వారి వివరాలను వెల్లడించాడు.
వారిద్దరే కారణం..
తన క్రికెట్ కెరీర్ లో చిన్నప్పటి నుంచే పాలిటిక్స్ తనతో ఆడుకున్నాయని రాయుడు వెల్లడించాడు. తాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఆడుతున్నప్పుడే రాజకీయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పాడు. HCA మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ కొడుకు అర్జున్ యాదవ్ తనను మానసికంగా హింసించాడని తెలిపాడు. తనకంటే బాగా ఆడుతున్నానని కక్ష గట్టి తనను టీమిండియాకు ఎంపిక కాకుండా చూశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అండర్ - 19, ఇండియా - ఏ తరఫున నిలకడగా రాణించిన రాయుడు....ఆంధ్రా నుంచి హైదరాబాద్ కు మారాడు. కానీ ఇక్కడ రాజకీయాల కారణంగా తిరిగి ఆంధ్రాకే ఆడాడు. 2005-06 రంజీ సీజన్‌లో రాయుడు- అర్జున్ యాదవ్ లు మైదానంలోనే గొడవకు దిగడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
తాగొచ్చి బండబూతులు తిట్టారు..
తనకు 17 ఏండ్ల వయసున్న సమయంలో టీమిండియాకు ఆడాలని ఎన్నో కలలు కన్నానని..అర్జున్ యాదవ్ కూడా భారత జట్టుకు ఆడాలనుకున్నాడని అంబటిరాయుడు తెలిపాడు. తాను 2003-04లో ఇండియా ఏ కు ఆడిన సమయంలో మెరుగైన ప్రదర్శన చేశానన్నాడు. అయితే 2004లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ మారిందని..అందులో శివలాల్ యాదవ్ సన్నిహితులు చేరారన్నాడు. దీంతో తనను ఎంపిక చేయలేదన్నాడు. నాలుగేళ్ల పాటు అసలు జట్టులో చోటే దక్కలేదన్నాడు. ఓ రోజు శివలాల్ యాదవ్ సోదరుడు మద్యం సేవించి ఇంటికి వచ్చి బండ బూతులు తిట్టాడన్నాడు.
శివలాల్ యాదవ్ భారత్ తరఫున 1979 నుంచి 1987 వరకూ 35 టెస్టులు, 7 వన్డేలు ఆడాడు. ఆట నుంచి తప్పుకున్నాక ఆయన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అయ్యాడు. 2014లో ఆయన బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
చాలా బాధేసింది..
2019 వరల్డ్ కప్ కోసం ఎంపిక కాకపోవడం తనను బాధకు గురిచేసిందని అంబటి రాయుడు అన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ కోసం సంసిద్ధం కావాలని బీసీసీఐ నుంచి ఆదేశాలను అందుకున్నానని..అయితే టీంకు మాత్రం ఎంపిక కాలేదన్నాడు. అప్పటి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. తనను కాదని విజయ్ శంకర్ ను ఎంపిక చేశాడన్నాడు. అయితే తనను తప్పించినప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు రహానే లేదా అలాంటి ఆటగాళ్లను తీసుకుంటే తాను బాధపడకపోయే వాడినని..కానీ ఏమాత్రం జ్ఞానం లేకుండా ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేయడంతో ఆగ్రహానికి గురయ్యాయని చెప్పుకొచ్చాడు. ఆంధ్ర తరఫున ఆడే సమయంలో ఎమ్మెస్కేతో తనకు విభేదాలు ఉన్నాయని తెలిపాడు. 2019 వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి తనను ఎందుకు తప్పించారో ఎమ్మెస్కే ప్రసాద్‌నే అడగాలన్నాడు.
HCAకు క్యాన్సర్ సోకింది..
హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ కు క్యాన్సర్ సోకిందని..ఇప్పుడు నాలుగో దశకు చేరుకుందని అంబటి రాయుడు ఘాటు విమర్శలు చేశాడు. తన చిన్నతనంలోనే హెచ్సీఏకు క్యాన్సర్ సోకిందని..దానిని కాపాడటం ఎవరివల్లా కాదన్నాడు. హెచ్‌సీఏ పరిస్థితి చూసి బాధపడటం తప్ప చేసేదేమీ లేదన్నాడు. బీసీసీఐ జోక్యం చేసుకుని బాగు చేస్తే తప్ప హెచ్‌సీఏ బాగుపడదన్నాడు.
పొలిటికల్ ఇన్నింగ్స్..
అంతర్జాతీయ క్రికెట్ తో పాటు..ఇటీవలే ఐపీఎల్- నుంచి కూడా తప్పుకున్న అంబటి రాయుడు....త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార వైసీపీ తరపున పోటీ చేయబోతున్నట్లు సమాచారం. రాయుడు రెండు సార్లు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో రాయుడు గుంటూరు లోని అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగొచ్చని తెలుస్తోంది.