ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్‌కే) కెప్టెన్ ఎవరు? గత రెండేళ్లుగా వార్తల్లో నిలుస్తున్న ప్రశ్న ఇది. ప్రస్తుతం టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ.. అతని వారసుడు ఎవరన్నదే అంతుపట్టని విషయం. ఇన్నాళ్లు ఆ విషయం బహిర్గతం కానప్పటికీ.. ఇప్పుడు ఆ బాధ్యతలు చేపట్టే ఆటగాడు ఎవరో బట్టబయలైంది. ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఈ విషయాన్ని బయటపెట్టారు.
వాస్తవానికి ధోని ఈ ఏడాదే తప్పుకోవాల్సింది. అయితే తదుపరి కెప్టెన్ ఎవరన్న విషయం ఓ కొలిక్కి రాకపోవడంతో అతను తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు అది పూర్తవ్వడంతో ధోని ఏ క్షణమైనా తప్పుకోవచ్చన్న వార్తలొస్తున్నాయి. ఒకవేళ అలాంటి ప్రకటన లేకపోతే వచ్చే సీజన్(ఐపీఎల్ 2024) ఆరంభంలో ధోని.. ఆ బాధ్యతలు మరొకరికి అప్పగించవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.
జడేజాకు మరో అవకాశం లేదు
2022 ఐపీఎల్ సీజన్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించినప్పటికీ.. అది సఫలం కాలేదు. జట్టును విజయవతంగా నడిపించటంలో అతను విఫలమయ్యారు. వరుస ఓటములు భరించలేక టోర్నీ మధ్యలోనే అతను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. అయితే అతనికి మరో అవకాశం లేదని చెప్తున్నారు.. విశ్లేషకులు. పోనీ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నియమించాలన్నా.. ఐపీఎల్ 2023 సీజన్‌లో పేలవ ఆట తీరు ఆ అవకాశాలను దెబ్బకొట్టింది.
సిఎస్‌కే తదుపరి నాయకుడు రుతురాజ్
సిఎస్‌కే తదుపరి కెప్టెన్ ఎవరో కాలమే నిర్ణయిస్తుందన్న రాయుడు.. కాబోయే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్న విషయాన్ని దాచలేకపోయారు. ఈ యువ క్రికెటర్ పై ప్రశంసలు కురిపించిన రాయుడు.. ధోనీలా రుతురాజ్ చాలా ప్రశాంతంగా ఉంటాడని, అతనిలో నాయకత్వ లక్షణాలు దాగున్నాయని తెలిపాడు. ఎంఎస్ ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ల సహకారంతో అతను సిఎస్‌కేకు ఎక్కువ కాలం సేవలందించగలడని చెప్పుకొచ్చారు.
Ambati Rayudu on Future CSK Captain Ruturaj Gaikwad ?? pic.twitter.com/mXsixNt5m4
— Chakri Dhoni (@ChakriDhoni17) July 21, 2023
కాగా, ఆసియన్ గేమ్స్ లో భారత పురుషుల జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‍గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. మొత్తం 15 మంది ఆటగాళ్లను ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసింది. ఈ టోర్నీలో భారత జట్టు ప్రదర్శనపైనే రుతురాజ్ కెప్టెన్సీ ఆధారపడి ఉంది. ఒకవేళ టీమిండియా స్వర్ణం సాధిస్తే.. సిఎస్‌కే తదుపరి కెప్టెన్ ఎవరన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లే.