T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు

T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు

భారత టీ20 ప్రపంచ కప్ జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కకపోవడాన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. నిలకడగా రాణిస్తూ.. విధ్వంసకర ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూని పక్కన పెట్టడం ఏంటని.. మాజీలు, క్రీడా ప్రముఖులు, అభిమానులు ప్రతిఒక్కరూ సెలెక్టర్ల నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్, ఇటీవల రాజకీయ అరంగ్రేటం చేసి మరలా వెనక్కి తగ్గిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. రింకూకు మద్దతుగా నిలిచాడు. భారత సెలెక్టర్లు క్వాంటిటీపై పెట్టిన శ్రద్ధ  క్వాలిటీపై చూపలేదని పరోక్షంగా విమర్శించాడు. 

గతేడాది అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగ్రేటం చేసిన రింకూ సింగ్.. ఇప్పటివరకూ 15 టీ20లు ఆడాడు. 89 సగటు, 176 స్ట్రైక్‌ రేటుతో 356 పరుగులు సాధించాడు. పైగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకూ 82 బంతులు ఆడి 150 స్ట్రైక్‌ రేటుతో 123 పరుగులు చేశాడు. ఇవేవీ సెలెక్టర్లకు కనిపించలేదు. భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేదన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నారు. పూర్తిగా విఫలమవుతున్న హార్దిక్‌, అర్ష్‌దీప్‌, సిరాజ్ వంటి వారి విషయంలో మాత్రం అందుకు విభిన్నం. ఈ విషయాన్నీ హైలెట్ చేస్తూ రాయుడు.. సెలెక్టర్ల తీరును ఎండగట్టాడు. 

రింకూను తప్పించడం క్రికెట్ సెన్స్‌పై గణాంకాలను స్పష్టంగా సూచిస్తుందని తెలిపిన రాయుడు.. అతని లోటు భారత జట్టుకు అతి పెద్ద నష్టమని వివరించాడు. అతను చివరి 4 ఓవర్లలో క్రీజులోకి వచ్చిన విలువైన పరుగులు రాబట్టగల సమర్థుడని కొనియాడాడు. సెలక్టర్లు.. క్వాంటిటీ కంటే క్వాలిటీ కావాలనే విషయాన్ని విస్మరించారని తెలిపాడు.. తెలుగు క్రికెటర్ చేసిన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒకప్పుడు రాయుడు విషయంలోనూ సెలెక్టర్లు ఇలానే వ్యవహరిస్తే అతను రిటైర్మెంట్ ప్రకటించడం కొసమెరుపు.   

భీకర ఫామ్‌లో శివం దూబే 

శివం దూబే రాణించడం రింకూను తప్పించడానికి ప్రధాన కారణం అయినప్పటికీ.. జట్టులో లెఫ్ట్‌హ్యాండర్ల సంఖ్య పెరగడం మరో  కారణం కావచ్చు. రోహిత్‌, విరాట్, సూర్య మినహాయిస్తే.. యశస్వి, దూబె, పంత్‌, రింకూ లెఫ్ట్‌హ్యాండర్లైపోతారు. దీంతో జట్టు కూర్పు కోసం కూడా అతడిని పక్కన పెట్టి ఉండొచ్చనేది మరో వాదన.