
సిద్దిపేట రూరల్, వెలుగు: దేశంలో ప్రతి ఒక్కరికీ వర్తించేలా ఉమ్మడి చట్టాలు ఉండాల్సిందేనని ఉమ్మడి పౌర స్మృతితోనే అందరికీ సమన్యాయం లభిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. యూనిఫామ్ సివిల్ కోడ్ కు మద్దతుగా సోమవారం హైస్కూల్ నుంచి విక్టరీ టాకీస్, గాంధీ సుభాష్ రోడ్డు మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. ఆయన మాట్లాడుతూ భారతీయులందరూ ఒకటేనని అందరికీ ఒకే చట్టం ఉండాలన్నారు. సామాజిక పురోగతికి అభ్యుదయానికి మత చట్టాలను సంస్కరించడం తప్పనిసరని అంబేద్కర్ కూడా స్పష్టం చేశారని తెలిపారు. ర్యాలీలో జన్ సమాధన్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ రావు, వంగ రామచంద్రా రెడ్డి, పత్రి శ్రీనివాస్, ఉపేందర్ రావు, ఉడుత మల్లేశం, వేణు గోపాల్, శివకుమార్, భోగి శ్రీనివాస్, నర్సింహారెడ్డి, నరేష్, అరుణ, సుగుణ, వెంకట్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
హామీల అమలులో కేసీఆర్ విఫలం..
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో సీఎం పూర్తిగా విఫలమయ్యారని వెంటనే అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్ధిపేట కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బీజేపీ సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి గంగాడి మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విద్యాసాగర్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అంబటి బాలేశ్ గౌడ్ పాల్గొన్నారు.