ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో శనివారం ‘మేలుకొన్న జ్ఞాపకాలు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తురగా ఫౌండేషన్ సాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఈ సభ జరిగింది. ప్రముఖ రచయిత పోతరాజు శ్రీరామారావు రచించిన కథానికలు, వ్యాసాలు, ఆకాశవాణి ప్రసంగాల సంకలనాన్ని ఆయన కుటుంబ సభ్యులు ‘మేలుకొన్న జ్ఞాపకాలు’ అనే శీర్షికన ప్రచురించారు.
ఆ పుస్తకాన్ని చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకటస్వామి, వినోద్, ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డాక్టర్ వంగపల్లి విశ్వనాథం ఆవిష్కరించి మాట్లాడారు. మానవ సంబంధాలు, కుటుంబ విలువలను ఈ పుస్తకంలో చక్కగా వివరించారని చెప్పారు. తండ్రి కథలను సంకలనంగా ప్రచురించడం అనేది పితృ రుణం తీర్చుకోవడం వంటిదన్నారు. సమాజంలో పుస్తక పఠనంపై ఆసక్తి సన్నగిల్లుతోందని భావిస్తున్న తరుణంలో ఇటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం గొప్ప విషయమన్నారు. మానవ సంబంధాల్లోని విలువలను భవిష్యత్ తరాలకు అందించడం ఎంతో అవసరమని చెప్పారు. కార్యక్రమంలో రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.