దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 9 గవర్నర్ రాష్ట్రాలు (పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, బొంబాయి. మద్రాస్, బిహార్, సెంట్రల్ ప్రావిన్స్, ఐదు చీఫ్ కమిషనర్ల రాష్ట్రాలు ఢిల్లీ, అజ్మీర్, మార్వార్, పంత్ పిప్లోడా, కూర్గు, లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రం అండమాన్ నికోబార్, సంస్థానాలు ఉండేవి. రాజ్యాంగంలో అమలులోకి వచ్చిన గవర్నర్ రాష్ట్రాలు, చీఫ్ కమిషనర్ల రాష్ట్రాలు, లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రం, సంస్థానాలను నాలుగు గ్రూపులుగా విభజించారు. పార్ట్– లో అస్సాం, బిహార్, బొంబాయి, మధ్యప్రదేశ్, మద్రాస్, ఒరిస్సా, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్స్, పశ్చిమబెంగాల్, పార్ట్–బిలో హైదరాబాద్, జమ్ముకశ్మీర్, మధ్య భారత్, మైసూర్, పెప్సూ, రాజస్థాన్, సౌరాష్ట్ర, తిరువాన్కూర్ కొచ్చిన్, వింధ్యప్రదేశ్, పార్ట్–సిలో అజ్మీర్, భోపాల్, బిలాస్పూర్, కూచ్‌బిహార్, కూర్గు, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కచ్, మణిపూర్, త్రిపుర, పార్ట్–డిల అండమాన్ నికోబార్ దీవులు ఉండేవి. స్వాతంత్ర్యానికి పూర్వమే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్ ఉండేది.
జేవీపీ కమిటీ
1948 డిసెంబర్ లో జైపూర్‌లో పట్టాభి సీతారామయ్య అధ్యక్షతన జరిగిన జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య(జేవీపీ) కమిటీని వేశారు. 1949లో జేవీపీ కమిటీ నివేదికను సమర్పిస్తూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును మరికొన్నాళ్లు వాయిదా వేయాలని పేర్కొంది. మద్రాస్‌ను వదులుకుంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చని పేర్కొంది. 1950లో మద్రాస్ ముఖ్యమంత్రి కుమారస్వామి రాజా నాయకత్వంలో పార్టిషన్/ విభజన కమిటీ ఏర్పాటైంది. మద్రాస్‌కు సంబంధించి విభేదాలు రావడంతో ఈ కమిటీ రద్దయింది. దీంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. అదే సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ అధికమైంది. 1958 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకై 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరణించాడు. దీంతో ఆంధ్రలో హింస చెలరేగింది. డిసెంబర్ 19న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జవహర్ లాల్ నెహ్రూ పార్లమెంట్లో ప్రకటించాడు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక, పరిపాలనాపరమైన సమస్యలను పరిష్కరించడానికి కైలాస్నాథ్ వాంఛూ కమిటీ ఏర్పడింది.
ఫజల్ అలీ కమిషన్
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్ తీవ్రమైంది. ఇలా ఒక్కొక్క రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, ఒకేసారి మొత్తం రాష్ట్రాలను పునర్విభజించాలని నిర్ణయించి 1953 డిసెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం సయ్యద్ ఫజల్ అలీ నాయకత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో హెచ్ఎన్ కుంజ్రు, కేఎం ఫణిక్కర్ సభ్యులు. 1954 జూన్, జులైలో రాష్ట్ర పునర్విభజన కమిషన్ హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డిలు ప్రత్యేక తెలంగాణ ఉండాలనే విజ్ఞప్తులను సమర్పించారు. బూర్గుల రామకృష్ణారావు, రామానందతీర్థ, మీర్ మొహమ్మద్ అలీఖాన్ మొదలైనవారు విశాలాంధ్రకు మద్దతుగా విజ్ఞప్తులు సమర్పించారు. 1955 సెప్టెంబర్ 30న ఫజల్ అలీ తన నివేదికను కేంద్రానికి సమర్పించాడు. రాష్ట్ర పునర్విభజన కమిషన్ దేశంలో ఉన్న ఎ బి సి డి గ్రూపులను రద్దు చేయాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. కానీ, విశాలాంధ్ర విషయానికి వచ్చేసరికి ఫజల్ అలీ కమిషన్ మొదట విశాలాంధ్ర ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, లాభాలను పేర్కొని తర్వాత నష్టాలను వివరించి తన అభిప్రాయాన్ని తెలియజేసింది.
ప్రయోజనాలు
మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని నగరాన్ని నిర్ణయించడం ఒక గడ్డు సమస్యగా తయారైంది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపితే ఇదివరకే అభివృద్ధి చెందిన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని కాక తప్పదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సమగ్ర రాష్ట్రంలో కృష్ణా, గోదావరి వంటి జీవనదుల జలాలను సమగ్రంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో విరివిగా ఉన్న బొగ్గు నిల్వలు, ఇతర ఖనిజ సంపద ఆంధ్ర ప్రాంత అవసరాలకు ఆంధ్ర ప్రాంతంలో విరివిగా ఉత్పత్తి అయ్యే ఆహారధాన్యాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొరతను తీర్చడానికి ఉపయోగించుకోవచ్చు.
నష్టాలు
తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో విలీనమైతే అధిక సంఖ్యలో ఉన్న ఆంధ్రప్రాంతం వారే ఉమ్మడి రాష్ట్రంలో లభించే అన్ని లాభాలను హస్తగతం చేసుకుని తెలంగాణను వలస ప్రాంతంగా మార్చివేసే ప్రమాదం ఉంటుంది. విశాలాంధ్ర ఏర్పడితే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆర్థిక స్థిరత్వం ఈ ప్రాంతపు అభివృద్ధికి బదులు ఆంధ్ర ప్రాంతపు అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కోవడానికి ఉపయోగించే ప్రమాదం ఉంటుంది. భవిష్యత్తులో కృష్ణా, గోదావరి జలాల వినియోగానికి పథకాలను చేపట్టినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తన న్యాయమైన వాటాను కోల్పోయే ప్రమాదం ఉంది.
అభిప్రాయం
తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచడమే మంచిదని పేర్కొంది. 1961లో జరిగే సాధారణ ఎన్నికల తర్వాత ఒకవేళ హైదరాబాద్ రాష్ట్ర శాసన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది అంగీకరిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాంతం విలీనం గురించి ఆలోచించవచ్చని, అది జరగని పక్షంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగాల్సి ఉంటుందని ఫజల్ అలీ కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది.
థార్ కమిషన్
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలనకు ఎస్.కె.థార్ కమిషన్ ఏర్పాటైంది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంతో ఆంధ్రాలోని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు ఆంధ్రా–తెలంగాణలతో విశాలాంధ్ర ఏర్పాటుకు ఉద్యమం చేపట్టారు. ఎస్కే థార్ కమిషన్ తన నివేదికలో కేవలం పరిపాలన ఆధారంగా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ నివేదికతో ఆంధ్ర నాయకులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనయ్యారు.
అంబేద్కర్ అభిప్రాయం
ఎస్ఆర్సీ, చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై 1955 డిసెంబర్ లో బి.ఆర్.అంబేద్కర్ ‘థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్’ అనే పుస్తకం రచించి తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మొదట్లో పెద్ద రాష్ట్రాల ఏర్పాటుకే ఆసక్తి వ్యక్తం చేసి అంబేద్కర్ ఆ తర్వాత కాలంలో దేశంలో నెలకొన్న పరిస్థితులను గమనించి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మొగ్గు చూపాడు. థాట్స్ ఆఫ్ లాజిస్టిక్ స్టేట్స్ పుస్తకంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. చిన్న రాష్ట్రాల వల్ల పలు ప్రాంతాలకు, వారి భావోద్వేగాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండటం మంచిదే. కానీ ఇలాంటి రాష్ట్రాల ఏర్పాటు వల్ల ఒక ప్రాంతం వారికి నష్టం జరుగుతుంది అనుకుంటే ఒక భాషకు చెందిన వారితో రెండు, మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయవచ్చు. ఒక భాష– ఒక రాష్ట్రంగా అంటే ఒక భాషవారితో కేవలం ఒక రాష్ట్రం మాత్రమే ఉండటం. ఒక రాష్ట్రం – ఒక భాష అంటే ఒక భాష వారితో ఎన్ని రాష్ట్రాలైనా ఉండవచ్చు. దీని అర్థం ఒకే భాష మాట్లాడేవారితో పలు రాష్ట్రాలు ఏర్పడవచ్చు. అంబేద్కర్ ఒక రాష్ట్రం–ఒక భాష అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చాడు.