అంబేద్కర్ అందరివాడు.. హైదరాబాద్ అంతటా ర్యాలీలు,నివాళులతో అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ అందరివాడు.. హైదరాబాద్ అంతటా ర్యాలీలు,నివాళులతో అంబేద్కర్ జయంతి వేడుకలు

హైదరాబాద్​ సిటీ నెట్ వర్క్, వెలుగు: భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​జయంతిని సోమవారం గ్రేటర్ ​వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాజకీయ ​పార్టీలు, కుల, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ ర్యాలీలు తీశారు. అన్నదానాలు చేశారు. అంబేద్కర్​ అందరివాడు అని, కొన్నివర్గాలకే పరిమితం చేయొద్దని నినాదాలు చేశారు. తార్నాక డివిజన్ చింతలబస్తీలోని అంబేద్కర్​విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్, మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, బీజేపీ నాయకులతో కలిసి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. వికారాబాద్​లోని అంబేద్కర్​ విగ్రహానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి నివాళులర్పించారు.

లింగోజిగూడ నుంచి ఎల్బీనగర్​అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ ఊరేగింపు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్, రోడ్డు డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు. ఎల్బీనగర్ కు చెందిన చిత్రకారుడు నాగార్జునపు రాము నోట్లో మార్కర్​తో అంబేద్కర్​ చిత్రాన్ని గీసి నివాళి అర్పించారు. వాటర్​బోర్డు హెడ్డాఫీసులో ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్, జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో కమిషనర్ ఇలంబరితి, ప్రేమ్​ నగర్​లో మేయర్ విజయలక్ష్మి నివాళులర్పించారు. ఎస్సీ కార్పొరేషన్ ​మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో సూటు బూటుతో బషీర్​బాగ్ ​నుంచి ట్యాంక్​బండ్​వరకు జై భీమ్ ర్యాలీ నిర్వహించారు.

గిరిజన శక్తి ఆధ్వర్యంలో లంబాడీ సంప్రదాయ వస్త్రధారణతో బషీర్ బాగ్ జగ్జీవన్ రామ్​విగ్రహం నుంచి ట్యాంక్​బండ్​విగ్రహం వరకు అంబేద్కర్​ ఫొటోను ఊరేగించారు. బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో అంబేద్కర్​జయంతిని ఘనంగా నిర్వహించారు. అరుణోదయ ఆఫీసులో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో విమలక్క, పీడీఎస్ యూ(విజృంభణ) రాష్ట్ర కార్యదర్శి అల్లూరి విజయ్ పాల్గొన్నారు.  గోల్కొండ పీఎస్​లో బ్లడ్ ​డొనేషన్ ​క్యాంప్​ నిర్వహించారు.