
- గ్రేటర్ లో దయనీయంగా అంబేద్కర్ నగర్ వాసుల పరిస్థితి
- పక్కా ఇండ్లు కట్టిస్తామని గుడిసెలు ఖాళీ చేయించిన అప్పటి సర్కార్
- దశాబ్ధం దాటినా దక్కని ఇండ్లు
- కాలమేదైనా తీవ్ర ఇబ్బందులు
- తమ బాధలు తీర్చాలని బాధితుల వేడుకోలు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో గుడిసెవాసులకు కష్టాలు మొదలై దశాబ్ధం దాటింది. డబుల్‌బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామన్న అప్పటి పాలకుల మాటలు నమ్మి దాదాపు 250 కుటుంబాలు గుడిసెలు ఖాళీ చేయగా, ఇప్పటికీ గృహయోగం కలగలేదు. వారి కోసం కట్టిన ఇండ్లు పడావు పడుతున్నా, వాళ్లు ప్రైవేటు స్థలంలో వేసుకున్న గుడిసెల్లోనే బతుకీడ్చాల్సిన దుస్థితి దాపురించింది. నిత్యం లీడర్లు, ఆఫీసర్లు వారి గుడిసెల ముందు నుంచే వెళ్తున్నా, కనికరించే వారు లేక ఎండలకు ఎండుతూ, వానలకు తడుస్తూ, చలికి వణుకుతూ కాలం ఎల్లదీస్తున్నామని ఆవేదన చెందుతున్నారు.
గుడిసెలు ఖాళీ చేసి పదేండ్లు..
2015 జనవరిలో అప్పటి సీఎం కేసీఆర్ మొట్టమొదటిసారి వరంగల్ నగరంలో పర్యటించారు. వివిధ స్లమ్ ఏరియాలను కలియ తిరిగి, ఇక్కడున్న గుడిసెవాసులందరికీ ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు. అప్పటికప్పుడు 3,957 ఇండ్లు కూడా మంజూరు చేశారు. ఆ వెంటనే స్థానిక నాయకులు హనుమకొండ బాలసముద్రంలోని అంబేద్కర్ నగర్, జితేంద్రసింగ్ నగర్ లో ఉంటున్న దాదాపు 250 గుడిసెలు ఖాళీ చేయించి డబుల్బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
దీంతో వారి మాటలు నమ్మిన గుడిసెవాసులు వెంటనే గుడిసెలు ఖాళీ చేసి, జాగలు వారికి అప్పగించారు. అనంతరం కొందరు ఇతర ప్రాంతాల్లో కిరాయికి వెళ్లగా, మిగతా వాళ్లంతా పక్కనే ఉన్న ప్రైవేటు స్థలంలో గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ఇండ్లు ఖాళీ చేసి పదేండ్లు అవుతుండగా, అప్పటి నుంచి డబుల్బెడ్రూం ఇండ్లకోసం ఎదురుచూస్తున్నారు.
దశాబ్ధకాలంగా పడిగాపులు..
అంబేద్కర్ నగర్ వద్ద 13 బ్లాకుల్లో 594 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారు. 2018లోనే పూర్తి కాగా, అందులో కొన్నిండ్లను గత పాలకులు అమ్ముకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏండ్లు గడుస్తున్నా ఇండ్లు ఇవ్వకపోవడంతో అంబేద్కర్ నగర్, జితేంద్రసింగ్ నగర్ వాసులు ఎన్నోసార్లు ఆందోళనలకు దిగారు. అప్పటి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదు. 2022 ఏప్రిల్ 20న వరంగల్ పర్యటనకు వచ్చిన అప్పటి మంత్రి కేటీఆర్ ఆరుగురు గుడిసెవాసులకు ఇండ్లు కేటాయిస్తూ ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారు. కానీ, వారిని ఇండ్లలోనికి మాత్రం పోనివ్వలేదు.
ఏడాదంతా తిప్పలే..
డబుల్ బెడ్రూం ఇండ్లు అందకపోవడంతో గుడిసె వాసులు ఆ పక్కనే ఉన్న ప్రైవేటు స్థలంలో పరదాలతో గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. పదేండ్ల నుంచి ఎండకు, వాన, చలికి ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతుండగా, మున్సిపల్ ఆఫీసర్లు ట్యాంకర్లు పంపిస్తే తప్ప కనీస అవసరాలకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. వానకాలంలో గుడిసెల్లో బురద, దోమల మధ్య బతకాల్సిన దుస్థితి. చలికాలం వచ్చిందంటే కనీస రక్షణ లేక గుడిసెల్లో వణుకుతూ బతకాల్సి వస్తోందని గుడిసె వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ బాధలు తీర్చాలని అక్కడి ప్రజలు వేడుకుంటున్నారు.
కాలానికోతీరు ఇబ్బందులు..
డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామంటే గుడిసెలు ఖాళీ చేసి జాగలు ఇచ్చినం. ఇంతవరకూ ఇండ్లు ఇయ్యలే. కాలానికోతీరు ఇబ్బందులు పడాల్సి వస్తాంది. ఇకనైనా ప్రభుత్వం పట్టించుకుని మా బాధలు తీర్చాలె.
- మంద సంపత్, అంబేద్కర్ నగర్
ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు..
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తమంటే నమ్మి 50–-60 ఏండ్ల నుంచి ఉంటున్న జాగలను ఖాళీ చేసినం. కట్టిన ఇండ్లను కూడా పేదలకు ఇవ్వడానికి ఆ ప్రభుత్వానికి మనసొప్పలేదు. సమస్యను ప్రస్తుత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినం. స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపి ఇండ్లు కేటాయించాలి. - ఎర్ర చంద్రమౌళి, అంబేద్కర్ నగర్