కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి: జెరిపోతుల పరశురామ్

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి: జెరిపోతుల పరశురామ్
  • సాధన సమితి జాతీయ అధ్యక్షుడు  జెరిపోతుల పరశురామ్
  • ఈనెల 26న ఢిల్లీలో వందల మంది కళాకారులతో ధూంధాం

బషీర్​బాగ్, వెలుగు: కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత  బీఆర్ అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెరిపోతుల పరశురామ్ డిమాండ్​చేశారు. ఈ నెల 26న ఢిల్లీలో వందలాది కళాకారులతో ధూంధాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, బహుజన యుద్ధనౌకఏపూరి సోమన్న, సీఏపీఎస్ఎస్ జాతీయ సలహాదారులు ఆళ్ల రామకృష్ణతో కలిసి చలో ఢిల్లీ పోస్టర్ ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. 1935 ఏప్రిల్1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటులో అంబేద్కర్ కృషి ఎంతో ఉందన్నారు. ఆయన ఫొటోను కరెన్సీ నోట్ల మీద ముద్రించాలని పార్లమెంట్ లో  కొట్లాడతానని ఆయన  హామీ ఇచ్చారు.  ఏపూరి సోమన్న మాట్లాడుతూ.. అంబేద్కర్ త్యాగాలను, చరిత్రను కనుమరుగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించినప్పుడే రాజ్యాంగాన్ని  గౌరవించినట్టు అవుతుందన్నారు. పార్లమెంటులో సభ్యులంతా ఈ అంశంపై మాట్లాడాలని కోరుతూ మార్చి 26న ఢిల్లీపై దండోరా, వందలాది కళాకారులతో ధూంధాం నిర్వహిస్తున్నామని చెప్పారు. కవులు, కళాకారులు, అంబేద్కర్ వాదులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.