అంబేద్కర్ సేవలు మరువలేనివి.. చిన జీయర్​స్వామి వెల్లడి

అంబేద్కర్ సేవలు మరువలేనివి.. చిన జీయర్​స్వామి వెల్లడి
  • ముచ్చింతల్​ ఆశ్రమంలో108 దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు  
  • నెక్లెస్​రోడ్​లో ఘనంగాసమతా యాత్ర
  • పాల్గొన్న అద్దంకి దయాకర్​

శంషాబాద్/ముషీరాబాద్​, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని త్రిదండి చిన జీయర్ స్వామి ఆశ్రమంలో రామానుజాచార్య,108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు స్వర్ణ రామానుజాచార్యులకు ఆర్ద్ర నక్షత్రం ఉత్సవారంభ స్నపనం నిర్వహించారు. 11 గంటలకు నెక్లెస్ రోడ్ లోని డాక్టర్ బీఆర్​అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో సమతా యాత్ర ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా  పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సభలో చిన జీయర్​మాట్లాడారు. సమ సమాజ నిర్మాణం కోసం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. అంబేద్కర్ ఏర్పాటు చేసిన పత్రిక ద్వారా సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేశారని చెప్పారు. సమతా మూర్తి,108 దివ్య దేశాల మూడో బ్రహ్మోత్సవాల సందర్భంగా సమతా యాత్ర ఏర్పాటు చేశామని, అసమానతలను తొలగించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. చిన జీయర్ స్వామి చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు వారధిగా పని చేస్తానని వెల్లడించారు.అనంతరం శాస్ట్రోత్తకంగా విశ్వక్సేన ఆరాధన అంకురారోహణ నిర్వహించారు. 

యాగశాల దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. అహోబిలం స్వామి దేవనాథ స్వామితో పాటు మై హోమ్ గ్రూప్ చైర్మన్  జూపల్లి రామేశ్వరరావు దంపతులు, రిటైర్డ్ ఐఏఎస్ ​ఎం. జగదీశ్వర్, వికాస్ తరంగిణి మాజీ అధ్యక్షుడు రమేశ్​గుప్తా తదితరులు పాల్గొన్నారు.