
రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ లో గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహం వేలును ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. గ్రామంలోని బస్టాండ్ వద్ద వారం రోజుల క్రితమే దళితులు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసి దళిత సంఘాల నాయకులు అధిక సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దౌల్తాబాద్ రోడ్డుపై నాలుగు గంటల పాటు రాస్తారోకో చేశారు.
దీంతో రామాయంపేట, గజ్వేల్ రూట్లో ట్రాఫిక్ నిలిచి పోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రామాయంపేట సీఐ వెంకటేశ్, ఎస్ఐ రంజిత్ అక్కడికి చేరుకుని అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వారికి నచ్చచెప్పి ఆందోళన విరవింప చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రవి, కిషన్ తదితరులు ఉన్నారు.