
- అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఇయ్యాల్నే
- మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభించనున్న కేసీఆర్
- ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్
- 2016లో భూమి పూజ.. ఏడేండ్ల తర్వాత పూర్తి
శంకుస్థాపన :
ఏప్రిల్ 14 , 2016
ఎత్తు : 125 అడుగులు, బేస్‌మెంట్ ఎత్తు
50 అడుగులు
వాడిన స్టీల్: 360 టన్నులు, కాంస్యం: 114 టన్నులు
ఖర్చు : రూ.146 .50 కోట్లు
విస్తీర్ణం : 1.35 ఎకరాలు
(ప్రధాన బిల్డింగ్,
అనుబంధ బ్లాక్స్)
ప్రశ్నించడం మానేస్తే..బానిసత్వానికి అలవాటు పడుతున్నట్లే.
అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. ప్రతిపౌరుడి నైతికాభివృద్ధే దేశాభివృద్ధి.
నోరులేని మేకల్ని బలిస్తారు. కానీ, సింహాలను బలి ఇవ్వరు. సింహాల్లా బతకండి.
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ సమీపంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
ఇప్పటికే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. విగ్రహావిష్కరణ తర్వాత అక్కడే సభ ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 300 మంది చొప్పున సభకు తరలించేందుకు కలెక్టర్లు ఏర్పాట్లు చేశారు. బౌద్ధ భిక్షువులు 25 మందిని పిలిపించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రార్థనలు చేయనున్నారు. హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించేలా ప్లాన్ చేశారు. క్రేన్ సాయంతో అంబేద్కర్విగ్రహానికి గజమాల వేయనున్నారు. విగ్రహం కింద ఏర్పాటు చేసిన మ్యూజియంలో అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతిబింబించే ఫొటోలు, ఆయన రాసిన పుస్తకాలు ఉంచనున్నారు. కాగా, విగ్రహ రూపశిల్పి పద్మభూషణ్ గ్రహీత రామ్ వాంజీ సుతార్ రూపొందించారు.
దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం..
2016లో అంబేద్కర్125వ జయంతి ఉత్సవాల సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 2016 ఏప్రిల్ 14న ఎన్టీఆర్ పార్క్ పక్కన 11.7 ఎకరాల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి భూమి పూజ చేశారు. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా, దాదాపు ఏడేండ్ల టైమ్పట్టింది. 50 అడుగుల ఎత్తులో పార్లమెంట్ ఆకృతిలో నిర్మించిన పీఠంపై 125 అడుగుల ఎత్తైన భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్విగ్రహమని అధికారులు చెబుతున్నారు.
ఉక్కు, కాంస్యం మిశ్రమంతో విగ్రహాన్ని రూపొందించారు. ఢిల్లీలో విడి భాగాలను తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. పార్లమెంట్- ఆకృతిలో నిర్మించిన బేస్‌మెంట్‌కు ఆగ్రా, నోయిడా, జైపూర్ తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన ఎరుపు, గోధుమ రంగు రాళ్లను వాడారు. విగ్రహం పటిష్టంగా ఉండేందుకు లోపలి వైపు స్టీల్ వాడారు. కాలుష్యంతో విగ్రహం షైనింగ్ తగ్గకుండా, తుపాన్లను తట్టుకునే విధంగా రూపొందించారు.