- కాంగ్రెస్ పాలనలో జిన్నా రాజ్యాంగం అమలు
- ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత మోదీ
- రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగవుతున్నదని విమర్శ
హైదరాబాద్, వెలుగు: ఆర్టికల్370 రద్దు తర్వాత కాశ్మీర్లో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అక్కడ జిన్నా రాజ్యాంగం అమలయ్యేదని అన్నారు. ఆర్టికల్370ని రద్దు చేసి కాశ్మీర్ పౌరులకు అన్ని హక్కులు కల్పించినట్టు చెప్పారు. శనివారం బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ సీనియర్ నేత అద్వానీ హిమాచల్ ప్రదేశ్‌లో ఇచ్చిన హామీ ప్రకారం.. మోదీ హయాంలో అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయిందన్నారు.
ముస్లిం మహిళలకు సోదరుడిగా మోదీ అన్ని హక్కులు కల్పించారని గుర్తు చేశారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన ద్వారా ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలనే లక్ష్యానికి అనుగుణంగా.. మోదీ నేతృత్వంలో పేద మహిళలకు ఇండ్లు, వంట గ్యాస్ కనెక్షన్లు, బ్యాంకు అకౌంట్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ కార్డుల జారీలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ కనుమరుగవుతున్నదని ఎద్దేవా చేశారు.
ఎవరికి ఎవరు ‘బీ’ టీమో ప్రజలకు తెలుసు
రాష్ట్రంలో ఎవరికి ఎవరు ‘బీ’ టీం అనేది ప్రజలకు తెలుసునని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ పార్టీలోకి ఎమ్మెల్యేలను పంపించి బీఆర్ఎస్ ఆదుకున్నదని, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఎమ్మెల్యేలను పంపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. శనివారం బీజేపీ స్టేట్ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఒకప్పుడు కాంగ్రెస్ వ్యక్తి అని, కాంగ్రెస్‌తో కలిసి అధికారం పంచుకున్న వ్యక్తి అని గుర్తు చేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తానన్నారని, అప్పుడు చెట్టపట్టాల్ వేసుకుని తిరిగింది వాళ్లేనని తెలిపారు. తామెప్పుడూ బీఆర్ఎస్తో కలిసి తిరగలేదని అన్నారు. రాహుల్‌గాంధీకి చేతగాక పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా అబద్ధాలు చెప్పారని, దీనిపై దమ్ము, ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాజ్యాంగ వ్యవస్థల మీద కాంగ్రెస్ కుట్రపూరితంగా దాడి చేస్తున్నదని విమర్శించారు. జగ్జీవన్‌రామ్‌ను ప్రధాని కాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. తమ పార్టీ బీసీని ప్రధానిగా చేసిందని చెప్పారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు.