ల్యాండ్ చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన అంబర్‌పేట సీఐ సుధాకర్ కు హయత్ నగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భూమి ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన కేసులో అరెస్ట్ అయిన సీఐ సుధాకర్ ను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
పోలీసులు, బాధితులు తెలపిన వివరాల ప్రకారం.. ల్యాండ్ వ్యవహారంలో విజయంత్ కుమార్ అనే వ్యక్తిని మోసగించారనే ఆరోపణల నేపథ్యంలో అంబర్‌పేట సీఐ సుధాకర్ ను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి... హయత్ నగర్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కొన్ని రోజుల క్రితం వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో సీఐ సుధాకర్ తో పాటు ఆర్ఐ రాజేష్ పై కూడా కేసు నమోదైంది. తమకు భూమి ఇస్తానని ఆర్ఐ రాజేష్ రూ.50లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదులో బాధితుడు విజయంత్ కుమార్ పేర్కొన్నారు. అయితే.. డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా.. ల్యాండ్ ఇప్పించకపోవడంతో బాధితులు వనస్థలిపురం పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
పలు ఆరోపణలతో సస్పెండ్ అయిన ఆర్ఐ రాజేష్ తాను ఎమ్మార్వో అంటూ నకిలీ ఐడీకార్డు సృష్టించి.. త్వరలో ప్రమోషన్స్ ద్వారా ఆర్డీఓ అవుతానంటూ బాధితులను నమ్మించాడు. ఆ తర్వాత అతడు తీసుకున్న డబ్బులను సీఐ సుధాకర్‌కు ఇచ్చినట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కందుకూరు మండలంలోని ఓ గ్రామంలో వ్యవసాయ భూమి విక్రయిస్తామని డబ్బులు తీసుకున్నప్పటికీ నెలలు గడుస్తున్నా భూమి రిజిస్ట్రేషన్ చేయలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించాడు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేశారు.