
- ఫ్లైఓవర్ కింద పనులు స్పీడప్
అంబర్ పేట, వెలుగు: అంబర్‌పేట కొత్త ఫ్లైఓవర్‌ను అధికారులు ప్రారంభించారు. ఎలాంటి హడావిడి లేకుండా మహాశివరాత్రి రోజు బుధవారం ఉదయం నుంచే బారికేడ్లను తొలగించి వాహనాలను ఫ్లై ఓవర్ మీదకు రెండువైపులా అనుమతించారు.
దీంతో చాదర్‌ఘాట్, నింబోలి అడ్డ, గోల్నాక, అంబర్‌పేట, రామంతాపూర్, ఉప్పల్, వరంగల్ వెళ్లే బస్సులు, ఇతర వాహనాలు ఫ్లైఓవర్ పై పరుగులు తీశాయి. ఫలితంగా అంబర్‌పేట ఫ్లైఓవర్ కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న వాహనదారులు సంతోషపడ్డారు. తమ ట్రాఫిక్ కష్టాలు తీరాయని ఆనందం వ్యక్తం చేశారు.
ఫ్లైఓవర్ కింద స్పీడ్ అందుకున్న పనులు
మొన్నటివరకు అంబర్‌పేట మార్గంలో విపరీతమైన రద్దీ కారణంగా ఫ్లైఓవర్ కింద నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. తాజాగా ఫ్లైఓవర్ ఓపెన్ కావడం, రద్దీ తగ్గడంతో ఈ నిర్మాణ పనులు స్పీడ్ అందుకున్నాయి.
దెబ్బతిన్న రోడ్లను సరిచేస్తూ ఫ్లైఓవర్ పిల్లర్స్ కింద గ్రీనరీ కోసం డివైడర్స్ పనులు మొదలు పెట్టారు. త్వరలోనే గ్రీనరీ తో పాటు బ్యూటిఫికేషన్ పూర్తి చేసిన అనంతరం మ్యాచువల్ గా వీటిని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలుస్తోంది.