హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లేవారికి లైన్​క్లియర్​

హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లేవారికి లైన్​క్లియర్​
  •  సిటీ నుంచి వరంగల్ వెళ్లేవారికి లైన్​క్లియర్​
  • ఉప్పల్ నుంచి ఎంజీబీఎస్​కు ఫ్రీగా పోవచ్చు  
  • రూ. 445 కోట్ల ఖర్చు ..
  • 1.625  కిలోమీటర్ల పొడవు 
  •  సర్వీస్​ రోడ్డు, గ్రీనరీ పనులు పెండింగ్​

అంబర్ పేట, వెలుగు: గోల్నాక నుంచి ఛే నంబర్ జంక్షన్ మీదుగా ముఖ్రం హోటల్ వరకు నిర్మించిన ఫ్లై ఓవర్ ను మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ప్రారంభించనున్నారు. నగరంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన మొట్టమొదటి ఫ్లైఓవర్ ఇదే. నాలుగేళ్లుగా కొనసాగుతున్న పనులు పూర్తయి వాహనాలకు అనుమతి ఇస్తుండడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సుమారు రూ.445 కోట్లతో 1.625 కిలోమీటర్ల పొడవు, నాలుగు లేన్లతో  నేషనల్ హైవే అథారిటీ ఈ  ఫ్లైఓవర్ నిర్మించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినప్పటికీ భూ సేకరణకు టూ బై థర్డ్ ​నిధులను రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. మొత్తంగా రూ.180 కోట్లు భూ సేకరణ కోసం ఖర్చు కాగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్లు ఇచ్చింది. ఈ ఫ్లైఓవర్​కు 2018లో శంకుస్థాపన చేయగా, 2021లో పనులు మొదలుపెట్టారు. 2023 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా పలు కారణాలతో  ప్రస్తుతం అందుబాటులోకి రాబోతోంది. 

వీరికి ఇక ట్రాఫిక్​కష్టాలుండవ్​

ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఉప్పల్ నుంచి ఎంజీబీఎస్​వెళ్లేవారికి, సిటీ నుంచి వరంగల్ హైవే వైపు వెళ్లే బస్సులు, వాహనదారులకు ప్రయాణ సమయం తగ్గనున్నది. అంబర్ పేట మీదుగా అటు ఇటు రాకపోకలు కొనసాగించే వారికి  ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ముఖ్యంగా ఛే నంబర్​ శ్రీరమణ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్స్ లేకుండా ప్రయాణించవచ్చు.

చాదర్​ ఘాట్ నుంచి సిగ్నల్ తగలకుండా రామాంతాపూర్, ఉప్పల్​, హబ్సిగూడ స్ర్టీట్ నెంబర్ 8 వరకు చేరుకోవచ్చు. ముందుగా ప్రధాని మోదీ లేదా కేంద్రమంత్రి గడ్కరీ ఈ ఫ్లైఓవర్ ప్రారంభిస్తారని అనుకున్నా అది సాధ్యపడలేదు. ట్రాఫిక్​ ఇబ్బందులు ఎక్కువగా ఉన్న క్రమంలో  ఫ్లై ఓవర్​ను వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. మిగిలిన బ్యూటిఫికేషన్, సర్వీస్​ రోడ్డు పనులు పూర్తయ్యాక మళ్లీ గ్రాండ్​గాఓపెన్ ​చేస్తారని తెలుస్తోంది.  


పరిశీలించిన కేంద్రమంత్రి  

ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం కేంద్ర పర్యాటక, బొగ్గుగనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఫ్లై ఓవర్​పైకి ఎక్కిన ఆయన కొంతదూరం నడిచి పరిశీలించారు.  కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చాదర్ ఘాట్ నుంచి వరంగల్ వెళ్లే రహదారి వెడల్పు చేశారని, కానీ, అంబర్ పేట ఛే నంబర్​వద్ద రెండు వైపులా శ్మశాన వాటిక ఉండడంతో వైండింగ్ సాధ్యం కాలేదన్నారు.

తాను ఎంపీ అయ్యాక ప్రధాని మోదీతో మాట్లాడగా, ఆయన స్పందించి ఫ్లై ఓవర్​ నిర్మాణాన్ని మంజూరు చేశారన్నారు. భూసేకరణ విషయంలో ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్​ప్రభుత్వం సహకరించలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం ఫ్లైఓవర్ కింద సర్వీస్​రోడ్డు వేయడంతో పాటు, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ డెవలప్​ చేయాలని కోరారు. ఆరు చోట్ల భూసేకరణ చేయాల్సి ఉందని, ఆ పని కంప్లీట్​చేసి హైవే అథారిటీకి అప్పగించాలన్నారు.