ఆపద సమయంలో అంబులెన్స్ లేక అవస్థలు పడుతున్న రోగులు

  • ఎమర్జెన్సీ అయితే ప్రైవేట్ అంబులెన్స్​లే దిక్కు
  • ఇష్ట మొచ్చినట్లు చార్జి  వసూలు చేస్తున్న ప్రైవేట్​ డ్రైవర్లు 

‘కొన్ని రోజుల కింద  భిక్కనూరు మండలంలో  హైవేపై  యాక్సిడెంట్ ​జరిగింది.  గాయపడ్డ ఇద్దరిని ట్రీట్మెంట్​ కోసం జిల్లా హాస్పిటల్​కు తరలించారు. వారికి ఫస్ట్​ ఎయిడ్ ​చేసి పరిస్థితి సీరియస్​గా ఉండడంతో  హైదరాబాద్​ తరలించాల్సి వచ్చింది. హాస్పిటల్​లో అంబులెన్స్​ లేకపోవడంతో ప్రైవేట్​అంబులెన్స్​లో తీసుకెళ్తే  రూ.6 వేలకు పైగా చార్జీ  చేశారు.’ 

‘కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి  హెల్త్​ ప్రాబ్లమ్​తో జిల్లా హాస్పిటల్​ వచ్చారు. పరిస్థితి సీరియస్​గా ఉండడంతో హైదరాబాద్​ తీసుకెళ్లాల్సి వచ్చింది. హాస్పిటల్​కు చెందిన  పాత అంబులెన్స్​లో తీసుకెళ్తే డీజిల్​ ఖర్చే  రూ. 4 వేల వరకు అయ్యింది.  పాత వెహికల్​ కావడంతో  స్లోగా వెళ్లడంతో పేషెంట్ ​​చాలా ఇబ్బంది పడ్డారు.’

కామారెడ్డి, వెలుగు: జిల్లా హాస్పిటల్​లో అంబులెన్స్ సర్వీస్ ​ సమస్యగా  మారింది. ఆస్పత్రిలో ఉన్న రెండు అంబులెన్స్​లలో ట్రామా కేర్​ అంబులెన్స్​ ఎప్పుడో మూలకు పడగా.. మరో అంబులెన్స్ ఫిట్​నెస్​  లేక  అందులో పేషెంట్లను తరలించడం  కష్టంగా మారింది. యాక్సిడెంట్లు, ఇతరత్రా  ఎమర్జెన్సీ పరిస్థితుల్లో జిల్లా హాస్పిటల్​కు వచ్చిన పేషెంట్లను మెరుగైన ట్రీట్​మెంట్​ కోసం  హైదరాబాద్​, నిజామాబాద్​ తరలించాల్సి వస్తే అంబులెన్స్ లు అందుబాటులో లేక పేషెంట్ల బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. 

కొత్త అంబులెన్స్​ లేక..

జిల్లా హాస్పిటల్​కు జిల్లా వాసులతో పాటు డెలివరీల కోసం  మెదక్​, సిరిసిల్ల జిల్లాలకు చెందిన గర్భిణులు కూడా వస్తారు. సిజేరియన్లు చేసే  టైమ్​లో  ఏదైనా సమస్య వస్తే హైదరాబాద్​కు తరలించడానికి ఆధునిక ఎక్విప్​మెంట్స్​గల అంబులెన్స్​ లేకపోవడం కూడా  సమస్యగా మారుతోంది.  జిల్లా మీదుగా 2  హైవేలు వెళ్తుండడంతో,  రోజూ ఏదో చోట యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. గ్రామాల్లో సూసైడ్​అటెంప్ట్​ చేసిని వారిని కూడా ట్రీట్​మెంట్ ​కోసం ముందుగా జిల్లా ఆస్పత్రికే తీసుకొస్తారు.  హార్ట్ స్ట్రోక్​ ఇతర ఎమర్జెన్సీ కేసులు  కూడా ఎక్కువగానే వస్తాయి. ఈ టైమ్​లో  అంబులెన్స్​ అందుబాటులో లేక జిల్లా ప్రజలు  ఇబ్బంది పడుతున్నారు. 

దశాబ్ధాల కిందటి అంబులెన్స్​..

జిల్లా హాస్పిటల్​లో ఉన్న అంబులెన్స్​ దశాబ్ధాల కింద తెచ్చినది కావడంతో ఎక్కువ స్పీడ్​వెళ్లలేక పోతోంది. ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్​ను  అందులో తరలించాలంటే ఎక్కువ టైమ్​పడుతోంది. అంబులెన్స్​లో డీజిల్ కూడా  పేషెంట్ల బంధువులే పోయించాల్సి వస్తోంది. కాలం చెల్లిన అంబులెన్స్​కు డీజిల్​వినియోగం కూడా ఎక్కువవుతోంది. దీంతో  ప్రభుత్వ అంబులెన్సే అయినా..​ ప్రైవేట్​కంటే ఎక్కువగా ఖర్చవుతోందని పేషెంట్లు వాపోతున్నారు. 

ట్రామా అంబులెన్స్​ అంతే..

హైవేలపై యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎమర్జెన్సీ కోసం  కామారెడ్డి హాస్పిటల్​కు ట్రామా సెంటర్​ ఏర్పాటు చేసి  గతంలో అంబులెన్స్​ ఇచ్చారు.   రూ.60 లక్షల ఎక్విప్​మెంట్​తో ఈ అంబులెన్స్​ ఉండేది. 10 ఏండ్ల  కింద హాస్పిటల్​లో నిలిచిన ఉంచిన ఈ అంబులెన్స్​పై  పేషెంట్​సంబంధీకులు దాడి చేయడంతో ధ్వంసమైంది. తర్వాత రిపేర్​ చేయించినప్పటికీ వినియోగించలేదు.  అప్పటి నుంచి అంబులెన్స్​ పూర్తిగా మూలన పడేశారు. 

హాస్పిటల్​ అంబులెన్స్​లో పంపుతున్నాం 

పేషెంట్​ను  హైదరాబాద్​కు తరలించాల్సి వస్తే  హాస్పిటల్​అంబులెన్స్​లో పంపుతున్నాం.పేషెంట్లు ఆర్థిక భారంతో ఇబ్బంది పడకుండా చూస్తున్నాం. పాత అంబులెన్స్​ కావడంతో స్లోగా వెళ్తోందని, పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. 
-  శ్రీనివాస్​, ఆర్ఎంవో


ప్రైవేట్ అంబులెన్స్​లే  దిక్కు

హాస్పిటల్​లో ఉన్న రెండు అంబులెన్స్​లు ఎమర్జెన్సీ టైమ్​లో  పని చేసే స్థితిలో లేకపోవడంతో ప్రైవేట్​అంబులెన్స్​లపై  ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న ప్రైవేట్ ​వాళ్లు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్​కు పేషెంట్​ను తీసుకెళ్లేందుకు రూ.6 వేల నుంచి రూ.6,500 వరకు, నిజామాబాద్​కు  రూ.3,500 నుంచి రూ.4వేల వరకు తీసుకుంటున్నారు. యాక్సిడెంట్​ కేసులు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. హాస్పిటల్​లో రోజూ ఇద్దరి నుంచి నలుగురి వరకు అంబులెన్స్​లో ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు  స్పందించి ఆస్పత్రికి అంబులెన్స్​సర్వీస్​లు ఏర్పాటు చేయాలని  జిల్లా వాసులు కోరుతున్నారు.