- బీఆర్ఎస్ నేతల తీరుతో పేద రోగులకు తప్పని తిప్పలు
- సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకోవాలంటున్న ఆఫీసర్లు
గద్వాల, వెలుగు: పేద రోగులకు సాయం చేయాలనే ఉద్దేశంతో రూ.24 లక్షలతో అంబులెన్స్ కొని జిల్లా కేంద్రంలోని దవాఖానకు ఇస్తే రెండేళ్లుగా దానిని వాడకుండా పక్కకు పెట్టారు. ఎందుకు అంబులెన్స్ ను వినియోగించడం లేదని అడిగితే ఆఫీసర్లు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. దీంతో చేసేది లేక అంబులెన్స్ ను డొనేషన్‌గా ఇచ్చిన దాత ఇతరులకు అమ్మేశాడు. బీఆర్ఎస్ లో వర్గ విభేదాల కారణంగానే అంబులెన్స్ వాడలేదని, దాతకు పేరు వస్తుందనే ఉద్దేశంతో పక్కన పెట్టారనే ఆరోపణలున్నాయి. రాజకీయ కారణంతో అంబులెన్స్ ను వాడకుండా వదిలేయడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేదలకు మేలు చేసే విషయంలో రాజకీయాలు చేయడమేమిటనే విమర్శలున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో అంబులెన్స్ లేక రోగుల బంధువులు ఇబ్బందులు పడుతున్నారు.
డోనర్ ఇచ్చిన అంబులెన్స్ వాడి ఉంటే పేదలకు ఉపయోగకరంగా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గద్వాలకు చెందిన బండ్ల రాజశేఖర్ రెడ్డి తన పేరెంట్స్ జ్ఞాపకార్థం రూ.24 లక్షలతో 2021 ఆగస్టు 15న హాస్పిటల్ కు అంబులెన్స్ డొనేట్ చేశారు. అప్పటి నుంచి అంబులెన్స్ ను వాడలేదు. ఒక్క కిలోమీటర్ కూడా తిప్పకుండా పక్కన పడేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను అడిగినప్పుడల్లా ఏదో కారణం చెబుతూ కాలయాపన చేస్తూ వచ్చారు. చివరికి ఎవరైనా డొనేషన్ చేయాలంటే సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెబుతున్నారని డోనర్ తెలిపారు. చేసేది లేక అంబులెన్స్‌ను అమ్మేసినట్లు డోనర్ తెలిపారు.
రాజకీయ కారణమా?
అంబులెన్స్ వినియోగానికి రాజకీయాలే అడ్డంకిగా మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. బండ్ల రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎక్కడ అతడికి పేరు వస్తుందోననే ఉద్దేశంతో బీఆర్ఎస్ లోని మరో వర్గం అంబులెన్స్ వాడకుండా అడ్డుకున్నారనే విమర్శలున్నాయి. మల్దకల్ మండలం సద్దనోనిపల్లి విలేజ్ లో కల్యాణమండపం నిర్మిస్తే దాన్ని ఓపెనింగ్ కు ప్రజాప్రతినిధులను పిలిస్తే రాలేదని, ఏడాది ఎదురు చూసి వారే ఓపెన్ చేసుకున్నారనే విషయాన్ని బీఆర్ఎస్ లీడర్లే గుర్తు చేసుకుంటున్నారు.