అమీన్ పూర్ ఘటనలో మరో ట్విస్ట్.. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపింది

అమీన్ పూర్ ఘటనలో మరో ట్విస్ట్.. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపింది

అమీన్ పూర్ లో కన్నతల్లి ముగ్గురు పిల్లలను చంపిన కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. కన్నతల్లి రజిత పెరుగన్నంలో విషం కలపడం వల్లే ముగ్గురు పిల్లలు చనిపోయారని అనుకున్నారు  అంతా.  కానీ పోలీసులు విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. తన  భర్త వయసు తనకన్నా చాలా ఎక్కువ అని..అలాగే  వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని  రజిత తన ముగ్గురు పిల్లలను ఊపిరాడకుండా చేసి  చంపిందని పోలీసులు తేల్చారు. 

సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వివరాల ప్రకారం..రజిత అలియాస్ లావణ్యకు ఇంటర్మీడియట్  సెకండియర్  చదువుతున్న సమయం (2013)లో తనకన్నా వయస్సులో 20 సంవత్సరాలు పెద్ద వాడైన అవురిచింతల చెన్నయ్యతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సాయి కృష్ణ(12 ,) మధుప్రియ(10 ),  గౌతమ్( 8) పిల్లలు ఉన్నారు.  వీరి స్వస్థలం మెధక్ పల్లి గ్రామం, తలకొండపల్లి మండల్, రంగారెడ్డి జిల్లా. గత 3-సంవత్సరాల క్రితం అమీన్ పూర్  గ్రామం, బీరంగూఢ, రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు.  చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా, రజిత @ లావణ్య ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 

ఆరు నెలల క్రితం రజిత అలియాస్ లావణ్య 10వ తరగతి క్లాస్మేట్స్ అందరూ కలిసి గెట్ టూ గెదర్   పార్టీ జరుపుకుందామని ప్లాన్ చేసుకుంటున్న సమయంలో తన 10వ తరగతి క్లాస్ మేట్ అయిన శివతో స్నేహం  ఏర్పడింది. ఈ స్నేహం కాస్త రోజు చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్ వరకు వెళ్లింది.  చాలా సార్లు శారీరకంగా కూడా కలిశారు.  రజిత అలియాస్ లావణ్యకు చెన్నయ్యకు ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల మొదటి నుంచే  రజితకు చెన్నయ్య అంటే  ఇష్టం ఉండేధి కాదు. తరచూ గొడవలు పడేవారు.  శివ కలిసినప్పటి నుండి రజిత జీవితం ఆనందంగా ఉందని.. శివకు పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకుంది.  తనను పెళ్లి చేసుకోవాలని శివను ఆడిగింది. అయితే  రజితకు పెళ్లి కాకపోయి ఉంటే, పిల్లలు లేకుండా ఒంటరీగా తనతో వస్తా అంటే ఖచ్ఛితంతా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. 

దీంతో ఎలాగైనా  శివను పెళ్లి చేసుకోవాలంటే పిల్లల అడ్డు తొలగించుకోవాల్సిందే అని నిర్ణయించుకున్న రజిత మార్చి 27, 2025 సాయంత్రం 6: గంటలకు పిల్లలను చంపేస్తాను అని శివకు చెప్పగా ఆ పనిని త్వరగా పూర్తి చేయమని చెప్పాడు. దీంతో   అదే రోజు రాత్రి తన భర్త భోజనం చేసి రాత్రి 10 గంటలకు  ట్యాంకర్ తీసుకొని చందానగర్ వెళ్ళగా అదే మంచి సమయం అని భావించిన రజిత  మొదటగా పెద్ద కొడుకు సాయికృష్ణ ను, కూతురు మధుప్రియ ఆ తర్వాత చిన్న కొడుకుని గౌతమ్ ను ఇలా ముగ్గురిని ఒకరి తరువాత ఒకరిని ముక్కు, మూతిపై టవల్ వేసి, చేతితో గట్టిగా అధిమి పట్టుకొని,  ఊపిరాడకుండా చేసి  చంపివేసింది. ఏ-1 రజిత అలియాస్ లావణ్య, ఏ-2  సూరు శివ కుమార్ నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నామని రిమాండుకు తరలిస్తామని తెలిపారు.