బెంగళూరు నుంచి సిటీకి డ్రగ్స్ .. అమీర్​పేటలో నలుగురి అరెస్ట్

హైదరాబాద్​ సిటీ/ పంజాగుట్ట, వెలుగు: బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సిటీలో అమ్ముతున్న నలుగురిని అమీర్​పేట ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6.65 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 2.27 గ్రాముల ఓజీ గంజాయి, 8.57 గ్రాముల హాష్​ ఆయిల్, ఒక బైక్ ​స్వాధీనం చేసుకున్నారు. కేరళకు చెందిన సంజయ్, శ్రీజిత్, ఆదర్శ్ కలిసి​అమీర్​పేటలోని కార్ఫ్1 గ్లోబల్ ​సొల్యూషన్ కంపెనీలో పనిచేస్తూ.. సత్యం థియేటర్ ​రోడ్డులోని ఓ హాస్టల్లో ఉంటున్నారు. వీరికి న్యూ బోయినపల్లికి చెందిన అజయ్​తో పరిచయం ఏర్పడింది. 

అప్పటికే వీరంతా డ్రగ్స్​కు బానిసలు కావడంతో ఈజీమనీ కోసం డ్రగ్స్​అమ్మాలని ప్లాన్ చేశారు. బెంగళూరు నుంచి శ్రీజిత్, ఆదర్శ్, సంజయ్​ సిటీకి డ్రగ్స్ తెస్తుండగా, అజయ్​ వీటిని అమ్ముతున్నాడు. విశ్వసనీయ సమాచారంతో అమీర్​పేటలో మంగళవారం వీరిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వీరిని అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ పటేల్ బానోత్ తెలిపారు.