అమెరికాకి ఈ ఏడాది కీలకం. వచ్చే ఏడాది నవంబర్‌లో జరిగే ఎలక్షన్స్‌కి పార్టీల తరఫున క్యాండిడేట్ల ఎంపిక ప్రాసెస్ ఇప్పుడు మొదలయ్యింది. పోయిన నెల 18 నుంచే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పోటీ చేయడానికి లాంఛనంగా ప్రచారం కూడా ఆరంభించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టడానికి ఈ నాలుగేళ్లలో చేసిన కృషి ఫలిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం డిఫెన్స్ నిధుల్ని వాడుకోవడానికి సుప్రీం కోర్టు ఓకే చెప్పింది. అక్రమ వలసల నిరోధానికి తాను చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిపక్ష డెమొక్రాట్లు ఇంతకాలం అడ్డం కొట్టారని ట్రంప్ చెప్పుకునే ఛాన్స్ దక్కింది.
డొనాల్డ్ ట్రంప్ అధికారానికొచ్చిన క్షణం నుంచీ కంటున్న కలకు సుప్రీం కోర్టు ఓకే చెప్పింది. మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టుకోవడానికి డిఫెన్స్ నిధుల్ని వాడుకోవడానికి ట్రంప్ ప్రభుత్వానికి అనుమతి లభించింది. ఆ వెంటనే… ‘కోర్టు తీర్పు మా ప్రభుత్వ విజయం’ అంటూ ప్రెసిడెంట్ ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి ట్రంప్ సర్కార్ కు లైన్ క్లియర్ అయినట్లే.
అమెరికాకి మెక్సికోకి దాదాపు 1,954 మైళ్ల (3,145 కి.మీ.) సరిహద్దు ఉంది. ఇది పట్టణాలు, ఎడారులు, పర్వత ప్రాంతాల గుండా పోతోంది. ఇండో–పాక్ బోర్డర్ నిడివి (3,323 కి.మీ) కంటే కొద్దిగా తక్కువ. ఇన్ని కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న సరిహద్దుల్లో గోడ కట్టడం అంటే చిన్న విషయం కాదు. దాదాపుగా 67 బిలియన్ డాలర్లు (రూపాయల్లో సుమారు 4 లక్షల 70 వేల కోట్లు) అవసరం అవుతాయి. 2018–2019 ఫైనాన్షియల్ ఇయర్ లో ఐదున్నర బిలియన్ డాలర్ల సొమ్ము కావాలని అమెరికా చట్ట సభల (కాంగ్రెస్) ను ట్రంప్ అడిగారు. దీనికి దిగువ సభ ఒప్పుకోకపోవడంతో అసలు ద్రవ్య బిల్లుపైనే సంతకం పెట్టనని ట్రంప్ మొరాయించారు. చివరకు అది నేషనల్ ఎమర్జెన్సీ పెట్టే వరకు వెళ్ళింది.
‘నేషనల్ ఎమర్జెన్సీ యాక్ట్’ ప్రయోగించడం వల్ల ట్రంప్ కు ప్రత్యేక అధికారాలు వచ్చాయి. సరిదిద్దలేని పరిస్థితులు నెలకొన్నప్పుడు ‘నేషనల్ ఎమర్జెన్సీ యాక్ట్’ పేరుతో ఉన్న చట్టాన్ని ప్రెసిడెంట్ ప్రయోగించవచ్చు. మెక్సికో సరిహద్దుల నుంచి అక్రమ వలసలు పెరిగిపోవడంతో దేశంలో సంక్షోభం తలెత్తిందన్నది ట్రంప్ వాదన. అందుకే చట్టాన్ని ప్రయోగించానన్నారు.
అమెరికా, మెక్సికో సరిహద్దుల్లో డొనాల్డ్ ట్రంప్ నిర్మించ తలపెట్టిన గోడ 3,145 కిలోమీటర్ల మేర వుంటుంది. కింది నుంచి ప్యానెల్స్ మాదిరిగా కనిపిస్తాయివి. దీనిలో 722 మైళ్లు (దాదాపు 1100 కి.మీ.) గోడ, ఫెన్సింగ్ కలగలిసి ఉంటాయి. ఈ వెయ్యి కిలోమీటర్ల మేర ఇప్పటికే ఉన్న కంచెను పక్కాగా చేస్తారు. డ్రోన్లు, ఇతర పద్ధతుల్లో సెక్యూరిటీ చెక్ ఉంటుంది. కాలిఫోర్నియా, ఆరిజోనా, న్యూ మెక్సికో, టెక్సాస్, సరిహద్దుల్లో ఈ గోడ కట్టాలని మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. గోడ నిర్మాణం నేషనల్ సెక్యూరిటీకి కీలక నిర్ణయంగా చెబుతున్నప్పటికీ… వలసల విషయంలో ప్రతిపక్షాల్ని విలన్‌గా నిలబెట్టాలన్న ఆలోచన కూడా ట్రంప్ కు ఉందంటున్నారు. గోడ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును మెక్సికో నుంచే కక్కిస్తానని తొలి రోజుల్లో ట్రంప్ అన్నారు. దీనికి ఫండింగ్ చేయడానికి మెక్సికన్ పాత ప్రెసిడెంట్ ఎన్రిక్ పెనా నియెటో కానీ, కొత్త ప్రెసిడెంట్ఆండ్రూస్ ఒబ్రాడో కానీ ఒప్పుకోలేదు.
అక్రమ వలసలు ఈనాటివి కావు
సరిహద్దుల్లో ఉన్న మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసలు ఇవాళ్టివి కావు. ఎన్నో ఏళ్లుగా ఇవి కొనసాగుతున్నాయి. అమెరికాలో కోటి పదిలక్షల పైచిలుకు జనాలు సరైన డాక్యుమెంట్లు లేకుండా నివసిస్తున్నట్లు అంచనా. అమెరికాలో కూలీలుగా, ఇళ్లల్లో పనివారుగా మెక్సికన్లు బతుకుతుంటారు. మెక్సికన్లే ఎక్కువగా నేరాల్లో పాల్గొంటారని లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ తరలింపు, చోరీలు, ముఠాల కుమ్ములాటల్లో అక్రమంగా వలస వచ్చిన మెక్సికన్లే ఉంటారు. డ్రగ్స్ ట్రాఫికింగ్‌లో శిక్ష పడ్డవాళ్లలో 80 శాతం మంది మెక్సికన్లే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సరైన లెక్కా పత్రం లేకుండా కంచె దాటి అమెరికాలోకి ప్రవేశిస్తున్నవారికి చెక్ పెట్టాలంటే… సరిహద్దుల వెంబడి గోడ కట్టి తీరాలన్నది ప్రెసిడెంట్ ట్రంప్ ప్లాన్. నిజానికి, అక్రమ వలసల కంట్రోల్‌కి మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టాలన్న విషయం పాతదే. గతంలో ప్రెసిడెంట్లుగా పనిచేసిన చాలామంది మెక్సికన్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ట్రంప్ ఒక్కరే సీరియస్‌గా తీసుకున్నారు. ఆరు నూరైనా గోడ కట్టి తీరతామన్నారు. గోడ కట్టాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఇల్లీగల్ మైగ్రైంట్స్మీద స్టడీ చేసిన నిపుణులు చాలామంది వ్యతిరేకించారు. అక్రమ వలసలను అడ్డుకోవడానికి ఇతర మార్గాలున్నాయంటున్నారు.
4 దేశాల నుంచి వలసలు
సెంట్రల్ అమెరికా దేశాల నుంచి ఎక్కువగా అమెరికాకి వలస వస్తుంటారు. కుటుంబాలకు కుటుంబాలు మెక్సికో మీదుగా అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటాయి. వీళ్లలో ఎవరి దగ్గరా సరైన డాక్యుమెంట్లు ఉండవు. రకరకాల పద్ధతుల్లో బోర్డర్ దాటడానికి చూస్తారు. సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాల, హోండూరస్, ఎల్ సాల్వడార్ దేశాలను నార్తర్న్ ట్రయాంగిల్‌గా చెబుతారు. ఈ మూడు దేశాలవాళ్లు బస్సు, బోటు తదితరాలు ఉపయోగించి మెక్సికో భూభాగంలోకి ప్రవేశించి, అక్కడి నుంచి అమెరికా చేరాలనుకుంటారు. తమ తమ దేశాల్లో జీవనోపాధికి తగిన ఆధారం లేకపోవడమే ప్రధాన కారణంగా చెబుతారు. అమెరికా ఈ రకంగా రిస్క్ తీసుకునేవాళ్లను మూడు కేటగిరీలుగా విభజించింది.
- తమ తమ దేశాల్లో హింస, ఘర్షణలను తప్పించుకోవడానికి అమెరికాలో ఆశ్రయం పొందేవారు
గోడంటే గోడా కాదు
మెక్సికో సరిహద్దుల్లో గోడ అంటే అందరూ అనుకుకేది కాదు. కొన్ని చోట్ల కాంక్రీట్, మెటల్ తో గోడ కడతారు. మరికొన్ని చోట్లు ఆల్రెడీ ఏర్పాటు చేసిన ప్యానెల్స్ ను ఒకదానితో మరొకటి ఫిట్ చేసి గోడలాగా కడతారు. ఇలాంటి గోడలు ప్రాంతాన్ని బట్టి 18 అడుగుల నుంచి 30 వరకు ఎత్తుంటాయి. ఎక్కడా ఎవరూ దాటకుండా పక్కాగా ఉంటుంది గోడ నిర్మాణం. కొన్ని చోట్ల గోడ…. గోడలా కాకుండా గ్రిల్ లాగా కనిపిస్తుంది. ప్రస్తుతం సరిహద్దుల్లో సహజంగా ఫెన్సింగ్ ఉంటుంది. అయినా ఇది ఏమాత్రం సరిపోవడం లేదు. ఫెన్సింగ్ దూకి అమెరికా లోకి ప్రవేశిస్తున్నారు. 2000 నుంచి 2018 వరకు ఇప్పటివరకు సరిహద్దులు దాటి రావడానికి ప్రయత్నిస్తున్న దాదాపు 50 లక్షల మందిని అరెస్టు చేసి వెనక్కి పంపినట్లు అమెరికన్ పోలీసు వర్గాలు చెప్పాయి.
టన్నెల్స్ ద్వారా డ్రగ్స్ రవాణా
మెక్సికో నుంచి బోర్డర్ ద్వారానే కాదు టన్నెల్స్ ద్వారా డ్రగ్స్‌ని అమెరికాకు సరఫరా చేస్తుంది అక్కడి మాఫియా. దీనికోసం భూమి లోపల సొరంగాలు తవ్వుతారు. ఇలా తవ్విన టన్నెల్స్ ద్వారా పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ని అవసరమైన చోటుకు చేరవేస్తారు. ఇలాంటి టన్నెల్స్ కొన్ని కిలోమీటర్ల పొడవున ఉంటాయి. టన్నెల్ కూడా మామూలుగా ఉండదు. లోపల ఏసీ ఉంటుంది. రైల్వే ట్రాక్ వంటిది ఉంటుంది. ఈ ట్రాక్ మీదుగా ట్రాలీల ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతాయి. టెన్నెల్ లోపల రెయిలింగ్, వెంటిలేషన్ సహా వెలుతురు రావడానికి లైట్లు ఉంటాయి.
మెక్సికో సరిహద్దు ప్రాంతాల నుంచి అమెరికాలోని అనేక చోట్లకు ఇలాంటి టన్నెల్స్ పెద్ద సంఖ్యలో ఉంటాయి. 40 కు పైగా టన్నెల్స్ ను ఇప్పటివరకు కనుక్కున్నారు. ఇలాంటి టన్నెల్స్ చాలానే ఉంటాయట. ఇలా టన్నెల్స్ ద్వారా మెక్సికో నుంచి అమెరికా కు డ్రగ్స్ ను రవాణా చేయడం చాలా ఏళ్ల నుంచి ఉన్నదే.
సంపాదన తక్కువై
మెక్సికో మరీ అంత పేద దేశం కాదు. అమెరికాతో పోల్చితే మెక్సికో ఎకానమీ తక్కువ స్థాయిలోనే ఉంటుంది. మనిషి బతకడానికి బాగానే అవకాశాలుంటాయి. ఎక్కువ సంపాదన పోగేసుకోవడానికి అవకాశాలు ఉండవు. దీంతో చాలా మంది మెక్సికన్లు సరిహద్దులను దాటుకుని అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుంటారు.
డ్రీమర్స్
విదేశాల నుంచి చిన్నప్పుడే పేరెంట్స్‌తో పాటు అమెరికాకు వచ్చి ఉంటున్న వారు. అమెరికాలో ఇలాంటివాళ్లు దాదాపు ఏడు లక్షల వరకు ఉంటారన్నది ఒక అంచనా. వీళ్లే కాదు మరో మూడు లక్షల మంది ఇతర వలసదారులు కూడా ఉన్నారు. గోడ కట్టడానికి కాంగ్రెస్ పర్మిషన్ ఇస్తే వీరందరికీ భద్రత కల్పిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
మెక్సికో లో డ్రగ్ లార్డ్స్దే రాజ్యం
ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ వాడకం 30ఏళ్లుగా ఎక్కువైంది. డ్రగ్స్ దందా వ్యాపారులకు డాలర్లు కుమ్మరిస్తోంది. మెక్సికోలో డ్రగ్ మాఫియాదే రాజ్యం. పేరుకు ప్రభుత్వమున్నా దేశాధినేతగా ఎవరుండాలో డిసైడ్ చేసే స్థాయిలో ఇక్కడ డ్రగ్ మాఫియా ఉంటుంది. ఈ మాఫియాకు ప్రపంచవ్యాప్తంగా నెట్ వర్క్ ఉంటుంది. డ్రగ్ కార్టెల్, హిట్ మన్ సిస్టం, లూటినెంట్స్ …వీటితో డ్రగ్ మాఫియా తన పని చేసుకుపోతుంటుంది. డ్రగ్ దందాలో ఏ ముఠా ఆధిపత్యం ఆ ముఠాదే. డ్రగ్ మాఫియా ఇన్ఫ్ల్యూయెన్స్ ఎక్కువ కావడంతో మెక్సికోలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఎక్కువగానే ఉంటుంది. మెక్సికో నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ రావడాన్ని ట్రంప్ సీరియస్ గా తీసుకున్నారు. డ్రగ్స్ ప్రభావం యూత్ మీద పడుతుందని, ఫలితంగా యువతరం ఎందుకూ పనికి రాకుండా పోతుందని ట్రంప్ అంటారు. ఈ కారణంతోనే మెక్సికో గోడ ఇష్యూను ఆయన అంత సీరియస్ గా తీసుకున్నారు.