మరో ఇటలీగా మారుతున్న అమెరికా

మరో ఇటలీగా మారుతున్న అమెరికా

అమెరికాలో కల్లోలం

కేసుల్లో టాప్​ 3 అగ్రరాజ్యానిదే..రెండు రోజుల్లోనే ఆ ప్లేస్​కు

36 వేల మందికి వైరస్ ..ఎక్కువ న్యూయార్క్​లోనే

30 లక్షల మంది ఉద్యోగాలు గల్లంతు.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి

తన బిజినెస్‌లకూ నష్టం జరిగిందన్న ట్రంప్

అమెరికా.. మరో ఇటలీ కాబోతోందా? ఇటలీ చేసిన నిర్లక్ష్యమే అమెరికా చేస్తోందా? అంటే అవుననే హెచ్చరిస్తున్నారు సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ (సీడీసీ) మాజీ చీఫ్​ డాక్టర్​ టామ్​ ఫ్రీడన్​. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వైద్య వసతులకు మించి కరోనా కేసులు నమోదయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. కేసుల పట్ల అమెరికా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. మరో వారం లేదా కొన్ని రోజుల్లోనే అమెరికాకూ ఇటలీ పరిస్థితే వస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి ఆయన చెప్పిన దానికి చాలా దగ్గరగానే ఉంది. దేశంలో కేసుల సంఖ్య 36,756కి పెరిగింది. ఒక్కరోజే 12,549 కొత్త కేసులు రికార్డయ్యాయి. 420 మంది వైరస్​కు బలయ్యారు. ఒక్కరోజులో రికార్డ్​ స్థాయిలో 94 మంది చనిపోయారు. కేసుల లిస్టులో ఇటలీ తర్వాతి ప్లేస్​ అమెరికాదే. అంటే ప్రపంచంలో టాప్​ 3 అమెరికానే. ఒక్క న్యూయార్క్​లోనే 21,381 కేసులు నమోదు కాగా, ఒక్కరోజులోనే 11,009 కొత్త కేసులు రిపోర్ట్​ అయ్యాయి.

కరోనా కేసులతో అమెరికా అల్లడంతల్లడమవుతోంది. రోజురోజుకు కేసులు వేలల్లో పెరుగుతున్నాయి. మార్చి 16 దాకా కేసుల వ్యాప్తి నిదానంగా ఉన్నా, ఈ నాలుగైదు రోజుల్లోనే కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే కేసుల్లో జస్ట్​ ఒక్క రోజులోనే నాలుగో ప్లేస్​కు వచ్చేసింది అగ్రరాజ్యం. ఇప్పటిదాకా 32,801 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్క న్యూయార్క్​లోనే 21,381 మంది ఎఫెక్ట్​ అయ్యారు. దానికి తగ్గట్టు మరణాలూ పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా 420 మంది చనిపోగా, ఒక్కరోజే 94 మంది బలయ్యారు. ఆ ఎఫెక్ట్​ జాబ్​లపైనా పడింది. ఎంతలా అంటే దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా యువత ఉద్యోగాలు కోల్పోతున్నారు.

లాక్​డౌన్​ దిశగా

కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశం లాక్​డౌన్​ దిశగా సాగుతోంది. పెరిగిపోతున్న కేసులతో న్యూయార్క్​ స్టేట్​ మొత్తాన్ని మూసేశారు. బయటకు రావొద్దని జనాలకు సూచిస్తున్నా ఎవరూ మాట వినకపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసరాలు తప్ప మిగతా అన్నింటినీ క్లోజ్​ చేశారు. జనాలు ఎవరూ బయటకు రావొద్దని, అనవసరం తిరగొద్దని సూచించారు. టైమ్స్​స్క్వేర్​తో పాటు అన్ని ప్రముఖ ప్రాంతాలను మూసేశారు. అత్యవసర సేవలు తప్ప ఎవరూ డ్యూటీలకు వెళ్లొద్దని కాలిఫోర్నియా, కనెక్టికట్​, ఇల్లినాయీ, న్యూజెర్సీ వంటి రాష్ట్రాలూ లాక్​డౌన్​ను ప్రకటించాయి. దేశంలో ఇప్పటికే చాలా షాపులు, రెస్టారెంట్లు, బార్లు బందవడంతో అమెరికన్ల ఉపాధిపై పెద్ద దెబ్బే పడింది.

లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో దాదాపు ఈ ఐదు రాష్ట్రాల్లోనే 75 లక్షల మందికిపైగా ఇండ్లకే పరిమితమయ్యారు. వచ్చే వారం నాటికి దాదాపు 3‌‌‌‌0 లక్షల మంది దాకా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అమెరికా చరిత్రలోనే ఇంత మంది నిరుద్యోగులుగా మిగిలిపోవడం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు 1982 ఆర్థిక మాంద్యం టైంలో 7 లక్షల మంది ఉపాధికి గండి పడింది. ఇప్పుడు దానికి నాలుగింతలు ఎక్కువ మంది ఉపాధి కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. గత వారంలో ప్రభుత్వ లబ్ధి, సాయం కోసం 2.81 లక్షల క్లెయిములు వచ్చినట్టు లేబర్​ డిపార్ట్​మెంట్​ ప్రకటించింది.

దునియాకు తాళం

కరోనా ఎఫెక్ట్​తో ప్రపంచానికి తాళం పడింది. చాలా దేశాలు ఇప్పటికే లాక్​డౌన్​ను ప్రకటించాయి. ఆ జాబితాలో మరిన్ని దేశాలు చేరుతున్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కొన్ని ఆఫ్రికా దేశాలు లాక్​డౌన్​ను ప్రకటించాయి. నైజీరియా, రువాండాలు ఎయిర్​పోర్టులు మూసేశాయి. దేశంలో అన్నింటినీ బంద్​పెడుతూ నిర్ణయం తీసుకున్నాయి. రెండు వారాల పాటు బయట తిరగడాన్ని నిషేధించాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేయాలని సూచించాయి. ట్యునీషియా కూడా లాక్​డౌన్​ ప్రకటించింది. ప్రస్తుతం ఆఫ్రికాలోని 54 దేశాల్లో 41 దేశాలకు కరోనా సోకింది. ఉగాండా బోర్డర్లను మూసేసింది. విదేశాల నుంచి వచ్చేటోళ్లు ఇళ్లలోనే హోం క్వారంటైన్​ కావాల్సిందిగా ఇథియోపియా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సౌతాఫ్రికాలోని జొహెన్నస్​బర్గ్​ ఎయిర్​పోర్టుకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండడం, పెద్ద పెద్ద ఎయిర్​లైన్స్​ సంస్థలు విమానాలను రద్దు చేస్తుండడంతో నైజీరియా ఇంటర్నేషనల్​ ఫ్లైట్లను రద్దు చేసింది. అంగోలా ఎయిర్​, ల్యాండ్​, సీ బార్డర్లను మూసేసింది. ఇప్పటికే జింబాబ్వే ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆఫ్రికాలో ఎక్కువ మరణాలు బుర్కినాఫాసోలో నమోదయ్యాయి. మంత్రులకూ పాజిటివ్​ వచ్చింది. దీంతో ఆ దేశమూ లాక్​డౌన్​ ప్రకటించింది. రెండు ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టులను మూసేసింది. ఇరాన్​ డెత్​ టోల్​ పెరిగిపోతుండడంతో జోర్డాన్​ లాక్​డౌన్​ విధించింది. దేశంలోని అన్ని షాపులూ బంద్​ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. మంగళవారం వరకు జనమెవరూ బయటకు రావొద్దని సూచించింది. మ్యూజియంలు, ఆర్కియాలాజికల్​ సైట్లను మూసేస్తూ ఈజిప్ట్​ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రార్థనలూ రద్దు చేసింది. మారిషస్​ ఇప్పటికే లాక్​డౌన్​ను ప్రకటించింది. లిబియా ప్రభుత్వం దేశం మొత్తం కర్ఫ్యూ విధించింది. పబ్లిక్​ ప్లేసెస్​ను మూసేసింది. ఇప్పటికే అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి ప్రపంచ దేశాలు సాయం చేయాల్సిందిగా యూఎన్​ కోరింది.

నా బిజినెస్‌లకూ నష్టం: ట్రంప్
కరోనాతో జనాలకే కాకుండా తన బిజినెస్‌లకూ ఎఫెక్ట్ పడిందని ప్రెసిడెంట్ ట్రంప్ వాపోయారు. తన హోటల్ వ్యాపారమూ నష్టాల్లోనే సాగుతోందని ఆయన అన్నారు. తన వ్యాపారాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందుతున్న విషయం తనకు తెలియదన్నారు. మారా లాగోలోని ట్రంప్ హోటళ్లు మూతపడడం, వాషింగ్టన్‌లోని తన లగ్జరీ హోటల్‌లో బార్లు క్లోజ్ కావడంపై ఆయన స్పందించారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తన వ్యాపారంపై భారీగా పడిందని, అది తనను బాగా వేధిస్తోందని అన్నారు. తనతో
పాటు దేశంలోని అన్ని గొప్ప హోటల్ చెయిన్లూ ఈ బాధపడుతున్నాయన్నారు. కొన్ని బిజినెస్‌లు మాత్రమే బాగా నడుస్తున్నాయన్నారు. కానీ, కరోనా వైరస్ ఎఫెక్ట్ నేపథ్యంలో దేశానికి ఇలాంటి లాక్ డౌన్ మంచిదేనన్నారు.

ఆస్ట్రేలియా బంద్​

నానాటికీ కేసులు పెరిగిపోతుండడంతో ఆస్ట్రేలియా లాక్​డౌన్​ను ప్రకటించింది. ప్రార్థనా మందిరాలు సహా అన్నింటినీ బంద్​ పెట్టాలని ఆదేశాలిచ్చింది. పబ్బులు, క్లబ్బులు, జిమ్ములు, సినిమా హాళ్లు, మాల్స్​ అన్నింటినీ మూసేయాలని సూచించింది. ఆదివారం కేబినెట్​ మీటింగ్​ తర్వాత ఆ దేశ ప్రధాని స్కాట్​ మోరిసన్​ ఈ నిర్ణయం ప్రకటించారు. సూపర్​మార్కెట్లు, పెట్రోల్​ బంక్​లు, మెడికల్​ షాపులు, హోం డెలివరీ సర్వీసులకు లాక్​డౌన్​ నుంచి మినహాయింపునిచ్చారు. స్కూళ్లనూ బంద్​ పెట్టలేదు. స్కూళ్లను మూసేస్తే పిల్లల ఏడాది చదువుకు నష్టం జరుగుతుందని, అది తనకు ఇష్టం లేదని మోరిసన్​ అన్నారు. పిల్లలను తల్లిదండ్రులే జాగ్రత్తగా చూసుకోవాలని, స్కూళ్లలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు స్కూళ్లను బంద్​ చేయాలని కోరినా ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదు. తాజాగా ప్రధాని వ్యాఖ్యలతో ఏం చేయాలో అర్థం కాక రాష్ట్రాలు తలపట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 1,315 కేసులు నమోదవగా ఏడుగురు చనిపోయారు.

For More News..

లాక్‌డౌన్‌కు సంబంధించి పూర్తి వివరాలు

జనతా కర్ఫ్యూ దేశమంతా సక్సెస్

263 మందితో ఢిల్లీ చేరిన ఇటలీ విమానం

తక్కువలో తక్కువ 20 కోట్ల మందికి సోకే అవకాశం