ప్రస్తుతం క్రికెట్ లో అమెరికా పేరు బాగా వినిపిస్తుంది. నిన్నటివరకు టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించి వార్తల్లో నిలిచిన ఆ జట్టు.. ఇప్పుడు టాప్ జట్లకు షాక్ ఇస్తూ సంచలనంగా మారింది. క్రికెట్ లో అమెరికాకు పెద్ద చరిత్ర లేదు. పసికూన జట్టుగా కూడా పనిరాదనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ జట్టు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరల్డ్ కప్ లో సత్తా చాటుతుంది. వరుసగా రెండు విజయాలు సాధించి సూపర్ 8 బెర్త్ పై కన్నేసింది.
వరల్డ్ కప్ ముందు అండర్ డాగ్ గా బరిలోకి అమెరికా.. ప్రపంచ క్రికెట్ లో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో కెనాడాపై అలవోక విజయం సాధించిన ఆ జట్టు.. నిన్న (జూన్ 6) పాకిస్థాన్ పై సూపర్ ఓవర్ లో 5 పరుగులతో నెగ్గి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అమెరికా సాధించిన ఈ ఒక్క విజయం గాలివాటం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ జట్టు టీ20 వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ పై మూడు టీ20ల సిరీస్ ను 2-1 తో గెలుచుకుంది.
బంగ్లాదేశ్ పూర్తి స్థాయి జట్టుతో దిగినా అమెరికాను ఓడించలేకపోయింది. షకీబ్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, శాంటో, ముస్తాఫిజుర్, మెహదీ హసన్, మహ్మద్దుల్లా లాంటి ప్రపంచ గుర్తింపు పొందిన స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ పసికూన అమెరికా ఆట తీరుకు తలవంచక తప్పలేదు. చివరి 5 మ్యాచ్ ల్లో ఏకంగా నాలుగు విజయాలు సాధించింది. దీంతో ఇదే గ్రూప్ లో ఉన్న భారత్ కు అమెరికా నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు. తేలిగ్గా తీసుకుంటే భారత్ కు షాక్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. జూన్ 12న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.
🇺🇸 USA on top! USA stuns everyone by climbing to the top of Group A in the T20 World Cup.👏 pic.twitter.com/zCuppEPk9J
— CricketGully (@thecricketgully) June 7, 2024