హిమవలయంలో అమెరికా : సోషల్​ ఎనలిస్ట్ డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

ఒక వైపు చైనాలో బియఫ్‌‌-7 వేరియంట్‌‌ కల్లోలం, మరో వైపు తీవ్రమైన శీతాకాలపు తుఫాను గుప్పిట్లో ఉత్తర అమెరికా, కెనడాలు అతలాకుతలం అవుతున్న వార్తలు ప్రపంచ మానవాళిని భయంలోకి నెట్టివేస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో క్రిస్‌‌మస్‌‌ వేడుకల స్థానంలో దాదాపు 6 కోట్ల అమెరికన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

బాంబ్‌‌ సైక్లోన్ - స్నో టెర్రర్‌‌‌‌

ఇలాంటి మహా హిమ ఉత్పాతం శతాబ్దంలో ఒక్కసారి మాత్రమే వస్తుందని, నేడు వాతావరణ పీడనం కనిష్ట స్థాయికి పడిపోవడంతో ‘బాంబ్‌‌ సైక్లోన్‌‌’గా మారి గజగజ వణికిస్తున్నది. డెన్వర్‌‌, లాస్‌‌వేగాస్‌‌, షికాగో, అట్లాంటా, బాల్టిమోర్‌‌ రాష్ట్రాల్లో హిమపాతం ప్రమాదకరంగా మారిందని యూఎస్‌‌ ప్రభుత్వం ప్రకటించే స్థాయి రావడం విచారకరం. భీకర మంచు తుఫానుతో సాధారణ ఉష్ణోగ్రతలు మైనస్‌‌ 57 డిగ్రీల సెల్సియస్‌‌ వరకు పడిపోవడంతో ప్రజల కష్టాలు రెట్టింపు అయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం మంచు గుట్టల్ని తొలగించే విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. అత్యధికంగా న్యూయార్క్‌‌ నగరంలో 55.8 ఇంచులు,  బఫెలో నగరంలో 49.2 ఇంచుల మేరకు మంచు పేరుకు పోవడం అక్కడ నెలకొన్న దుర్భర పరిస్థితులకు అద్దం పడుతున్నది. చలి తీవ్రతకు మరిగే నీరు కూడా క్షణాల్లో గడ్డకట్టి పోతున్నది. ‘స్నో టెర్రర్‌‌’ గుప్పిట్లో కోట్లాది ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతున్నది. 1983, 2014 ఏండ్లలో ఇలాంటి వాతావరణ ప్రతికూలాలు కనిపించినా నేటి మంచు తుపాను విపత్తు తీవ్రత గతంలో ఎన్నడు జరగలేదని అంటున్నారు.

‘ఆర్కిటిక్‌‌  బ్లాస్ట్‌‌’ పర్యావరణ ప్రకోపమా ?

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ ప్రతికూల మార్పులే ఇలాంటి విపత్తులకు కారణమని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఆర్కిటిక్ శీతల‌‌ గాలులు వెచ్చటి గాలులతో కలవడంతో వాతావరణ పీడనం తగ్గడంతో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయని దీని వల్ల బాంబ్‌‌ సైక్లోన్‌‌ ఏర్పడడం, వాతావరణంలో అత్యధిక నీటి తేమ చేరడంతో మంచు తుఫాన్లు వస్తున్నాయంటున్నారు. ఎటు చూసినా శ్వేత హిమ పర్వతాలను తలపించే దుస్థితి ఏర్పడింది. నేడు చూస్తున్న వాతావరణ విపత్తుకు కారణాలుగా శిలాజ ఇంధనాల వినియోగం, కర్బన ఉద్గారాలు, భూతాపం, పర్యావరణ కాలుష్యాలు వంటి అంశాలను పేర్కొంటున్నారు. భయంకర తుఫాను కురవడం, 100 కిమీ వేగంతో హరికేన్లను తలపించే శీతల పెను పవనాలు వీచడం, సబ్‌‌-జీరో టెంపరేచర్స్‌‌ నమోదు కావడంతో పరిస్థితులు అదుపు తప్పుతున్నట్లు తెలుస్తున్నది. మంచు, శక్తివంతమైన ఆర్కిటిక్‌‌ గాలులతో యూఎస్‌‌ను ముంచెత్తిన ప్రమాదకర మంచు తుఫాను ఫలితంగా 2 మిలియన్ల ప్రజలు, 20 లక్షల గృహాలు/కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. వాతావరణ నిపుణులు అంచా వేసినట్లే ‘ఆర్కిటిక్ కోల్డ్‌‌‌‌ బ్లాస్ట్’‌‌ కాస్తా ‘బాంబ్‌‌ సైక్లోన్‌‌’గా మారడంతో పెనంలోంచి పొయ్యిలో పడినట్లు అయ్యింది. అమెరికా, కెనడా దేశాల చరిత్రలో కనీవినీ ఎరగని వాతావరణ విపత్తుగా అభివర్ణిస్తున్నారు. అతిశీతల వాతావరణంలో మంచు బారిన పడితే శరీర అవయవాలను శిథిలం చేసే ప్రాణాంతక ‘ఫ్రాస్ట్‌‌ బైట్‌‌’ వలలో పడే ప్రమాదాలు నెలకొని ఉన్నాయి. వారం రోజుల్లో తుఫాను ప్రభావం తగ్గవచ్చనే వార్తలు కొంత ఊరటను ఇస్తున్నప్పటికీ నేడు అష్టకష్టాల్లో ఉన్న అమెరికన్లకు సత్వరమే ఆపన్నహస్తాలు అందుతూ, ప్రాణాపాయాలు తగ్గాలని కోరుకుందాం. ప్రపంచ దేశాలు వాతావరణ సానుకూల మార్పుల దిశగా వడివడిగా అడుగులు వేయాలని, ఈ బృహత్తర కార్యక్రమానికి అగ్రదేశాలు తొలి అడుగులు వేయాలి. 

మరణాల నమోదు

ఇప్పటికే ఉత్తర అమెరికా, కెనడాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు దుప్పట్లతో కనీసం 66 మంది పౌరులు మరణించడం జరిగింది. అడుగుల కొద్దీ పేరుకు పోయిన మంచు గుట్టలతో ప్రజలు బయటకు రాలేని దుస్థితి ఏర్పడింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరగడంతో పాటు 6,000లకు పైగా జాతీయ/అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావడం లేదా దారి మళ్లించడం లేదా ఆలస్యంగా నడవడం, హోటల్స్‌‌ మూసివేయడం, దుకాణాల్లో సరుకులు దొరక్క పోవడం, హైవేలు మూసి వేయడం, అడుగు లోతుల్లో కార్లు కూరుకుపోవడం, కార్లలోనే వ్యక్తులు శవాలుగా మారడం, విద్యుత్తు సరఫరా ఆగిపోవడంతో అంధకారాలు కమ్ముకోవడం, దుకాణాలు లూటీ కావడం లాంటి వార్తలతో ఆయా ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయనే వార్తలు హృదయవిదారకంగా తోస్తున్నాయి. న్యూయార్క్​ రాష్ట్రంలోని బఫెలో పట్టణ పౌరులు తీవ్రంగా ప్రభావితం కావడం, 34 మంది మరణించడం, పునరావాస శిబిరాలు కిక్కిరిసి పోవడం, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడటం  జరుగుతున్నది. 

- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి, సోషల్​ ఎనలిస్ట్​