ట్రంప్ ను పంపిస్తే అమెరికానే కొనేస్తాం.. డెన్మార్క్ ఆఫర్

ట్రంప్ ను పంపిస్తే అమెరికానే కొనేస్తాం.. డెన్మార్క్ ఆఫర్

అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​కి అద్దిరిపోయే పంచ్​ పడింది. డెన్మార్క్​ పరిధిలోని గ్రీన్​లాండ్​ దీవిని కొనాలనుకుంటున్నట్లు ఆయన రీసెంట్​గా స్టేట్​మెంట్​ ఇచ్చిన విషయం తెలిసిందే కదా. దానికి డెన్మార్క్​ మొదట్లో కూల్​గానే రియాక్ట్​ అయింది. ‘గ్రీన్​లాండ్​ను సొంతం చేసుకోవాలని యూఎస్​ అనుకుంటోందేమో. మేం మాత్రం ఆ దీవిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకానికి పెట్టబోం’ అని అప్పుడు తేల్చిచెప్పింది. ఆ తర్వాత తాజాగా శుక్రవారం అగ్రరాజ్యానికి దిమ్మతిరిగే కౌంటర్​ ఒకటి ఓ డెన్మార్క్​ పత్రికలో వచ్చింది.

‘గ్రీన్​లాండ్​ను అమెరికా కొనటం కాదు. మేమే అమెరికాను హోల్​సేల్​గా కొనేద్దామనుకుంటున్నాం. ఇప్పటి వరకు మాకు అసలు ఆ ఉద్దేశం లేదు. కానీ ఇప్పుడిప్పుడే ఆసక్తి కలుగుతోంది’ అని డెన్మార్క్​ సర్కార్​ పేరుతో వచ్చిన​ ఒక వార్త సంచలనం సృష్టించింది. అందులో డ్యానిష్​ గవర్నమెంట్​ స్పోక్స్​పర్సన్​ ఒకరు డొనాల్డ్​ ట్రంప్​కి భారీ ఆఫర్​ ఇచ్చారు. ‘ట్రంప్​ హయాంలో యూఎస్​లో అన్నీ (ప్రభుత్వం సహా) అమ్మకానికి ఉన్నట్లే కనిపిస్తోంది. ప్రతిదానికీ ఎంతో కొంత రేటు కట్టి ఓన్​ చేసుకోవాలని కోరికగా ఉంది’ అని అనేశారు.

ట్రంప్​ అడ్మినిస్ట్రేషన్​ మినహా యావత్​ అమెరికాను డెన్మార్క్​ తన పరం చేసుకోవాలని ఆశపడుతున్నట్లు ఆ స్పోక్స్​ పర్సన్​ అన్నారు సరదాగా. కాకపోతే అమెరికా తమ సొంతం అయ్యాక ట్రంప్​ను, ఆయన అధికార యంత్రాంగాన్ని వేరే ఏదైనా దేశానికి తరలించాలనేదే ఈ సేల్​కు సంబంధించిన ముఖ్యమైన కండిషన్​ అని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్​ను ఎక్కడికి పంపాలో​ వెతకాల్సి ఉందని, అది రష్యా కావొచ్చని, నార్త్​ కొరియా కూడా కావొచ్చని, ఆ రెండే ఆయనకు సరైన​ దేశాలని చమత్కరించారు.

‘అమెరికాను సొంతం చేసుకోవటానికి డెన్మార్క్​ వేసే బిడ్​కు అప్రూవల్​ వస్తే ఇక అమెరికాను కొత్తగా ఎలా డెవలప్​ చేయాలనే విషయంలో తమకు చాలా ప్లాన్లు ఉన్నాయని చెప్పారు. సరికొత్త ఎడ్యుకేషనల్​ సిస్టమ్​ను, నేషనల్​ హెల్త్​ కేర్​​ను యూఎస్​కు అందించి ఆ అతి పెద్ద భూభాగాన్ని అత్యంత గొప్ప దేశంగా మలచగలం’ అని డెన్మార్క్​ అధికార ప్రతినిధి వివరిస్తున్నట్లు​​ ‘ది న్యూ యార్కర్​’ పేపర్​లో ప్రింట్​ అయిన న్యూస్​ శుక్రవారం హల్​చల్​ చేసింది.

జోక్​ న్యూస్​

అయితే  ఇదంతా నిజమైన వార్త కాదని, జోక్​ న్యూస్​ అని తెలిసి అంతా నవ్వుకున్నారు.  ఈ సెటైరికల్​​ న్యూస్​ కాలమ్​ను ఆండీ బోరోవిట్జ్ అనే కమెడియన్​ 21 ఏళ్లుగా రెగ్యులర్​గా రాస్తున్నారు. అది ‘ది బోరోవిట్జ్​ రిపోర్ట్​’గా పాపులరైంది. దానికి ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో రీడర్లు ఉన్నారు.