అమెరికాను కుదిపేస్తున్నరాజీనామాలు

రెండేండ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సంగతి మనందరికీ ఎరుకే. దీని వల్ల ప్రపంచ దేశాల్లో ఎంతో మంది జీవితాలు తారుమారయ్యాయి. ఎందరో తమ ఉద్యోగాలకు నీళ్లు ఒదులుకున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలు ఇప్పటికీ సరైన ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఆర్థికాభివృద్ధిలో ముందున్న అమెరికాలో మాత్రం లక్షల సంఖ్యలో జనం చేస్తున్న ఉద్యోగాలు వదిలేస్తున్నారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రస్తుతం అగ్రరాజ్యాన్ని ఈ ‘గ్రేట్‌‌ రెజిగ్నేషన్‌‌’ కలవరపెడుతోంది.

అమెరికాలో గత ఏప్రిల్ లో తమ ఉద్యోగాలను విడిచిపెట్టిన వారి సంఖ్య భారీగా నమోదైంది. ఈ ఒక్క నెలలోనే రికార్డు స్థాయిలో 40 లక్షల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఎకనమిస్ట్​లు దీనిని ‘గ్రేట్ రిజిగ్నేషన్’గా పిలుస్తున్నారు. నెలలు గడిచే కొద్దీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ ధోరణి ప్రతి పరిశ్రమలోనూ కనిపిస్తోంది. ‘వసతి, ఆహార సేవల’ విభాగంలో 7 శాతం మంది ఆగస్ట్​లో తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు. అంటే హోటల్ క్లర్క్‌‌లు, రెస్టారెంట్ సర్వర్లు, బార్‌‌బ్యాక్‌‌లు ఇలా ప్రతి 14 మందిలో ఒకరు ఒకే నెలలో తమ ఉద్యోగాలు వదిలేశారు.

డిమాండ్‌‌.. సరఫరా సమస్యగా..
అమెరికాలో ఆగస్ట్​లో 4.3 మిలియన్ల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఒకవైపు కరోనా జాబ్ మార్కెట్లను కుదిపేస్తున్నా రాజీనామాలు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే యూరోప్​ దేశాల్లో కూడా జాబులు వదులుకునేందుకు జనం సిద్ధపడుతుండటం కనిపిస్తోంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతోపాటు 2020కి ముందున్న పరిస్థితులు తిరిగి వస్తున్నందున తమకు మంచి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో ఇలా ఉద్యోగాలను విడిచిపెడుతున్నారని ఫోర్బ్స్​ తన తాజా రిపోర్ట్​లో వెల్లడించింది. మెరుగైన సామాజిక భద్రత, నిరుద్యోగ ప్రయోజనాల కారణంగా ఉద్యోగాలు వదిలేస్తున్నారని, అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఈ ధోరణి కనిపిస్తోందని తెలిపింది. ఇలా చెయ్యడం అనేది డిమాండ్, సరఫరా సమస్యగా కూడా చెప్పవచ్చంటోంది. ఎందుకంటే అమెరికాలో ఆగస్ట్ 2021లో 10.4 మిలియన్ ఉద్యోగాలు అందుబాటులో ఉండగా, ఆ నెలలో నిరుద్యోగుల సంఖ్య 7.4 మిలియన్లుగా ఉందని పేర్కొంది.

ఆగస్ట్​లోనే ఎక్కువగా..
ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, ఇంగ్లండ్, అమెరికాల్లో 40 శాతం మంది ఉద్యోగులు రాబోయే మూడు నుంచి ఆరు నెలల్లో ప్రస్తుత ఉద్యోగాలను విడిచిపెట్టే అవకాశం ఉందని మెకిన్సే అండ్‌‌ కంపెనీ నివేదిక పేర్కొంది. వాస్తవానికి, 64 శాతం మంది తమ చేతిలో మరో జాబ్​ ఆఫర్​ లేకుండానే ఉన్న ఉద్యోగాన్ని వదిలేయాలని ఆలోచిస్తున్నారు. అమెరికా కార్మిక శాఖ జరిపిన జాబ్ ఓపెనింగ్స్, లేబర్ టర్నోవర్ సర్వే ప్రకారం, ఉద్యోగాలను విడిచిపెడుతున్న వారి సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా ఆగస్టులో 2.9% గరిష్ట స్థాయికి పెరిగింది. బ్యాంక్‌‌ రేట్ నిర్వహించిన ఆగస్ట్ జాబ్ సీకర్ సర్వే ప్రకారం, 
అమెరికా  కార్మికులలో సగం కంటే ఎక్కువ మంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడైంది. కరోనా నుంచి ఉపశమనం కోసం అద్దె మారటోరియం, స్టూడెంట్​ లోన్​ రాయితీలు వంటి చర్యలు తీసుకోవడంతో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యువకులు, తక్కువ ఆదాయం ఉన్నవారు తమకిష్టంలేని ఉద్యోగాలను వదులేసుకోవడానికి ఇంట్రెస్ట్‌‌ చూపిస్తున్నారని వివరించింది.

ఉచిత ప్రయోజనాలే కారణమా?
జాబ్ మార్కెట్‌‌లో అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు జాబ్​ రిజైనింగ్స్​లో పెరుగుదల కనిపించడం సాధారణమే. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఇంతకు ముందు చూసిన వాటికి భిన్నం. ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో చేస్తున్న ఉద్యోగం వదిలివేయడం తక్కువ జీతాలతో పనిచేసేవారికి అంత ఈజీ కాదు. అందుకనే ఈ విషయంలో ఎకనమిస్ట్​లు కూడా ఏం జరుగుతుందో తెలీక తలలు పట్టుకుంటున్నారు. కరోనా కాలంలో ప్రభుత్వం అందించిన ఉచిత ప్రయోజనాలే ప్రజలను ఉద్యోగాలు విడిచిపెట్టమని ప్రోత్సహిస్తున్నాయా? దశాబ్దాలుగా స్తంభించిన వేతనాల పెంపుదల కోసం ఇప్పుడు ప్రజలు ఆరాటపడుతున్నారా? మూసివేసిన స్కూళ్లు, కుటుంబ ఒత్తిళ్లు, వ్యాపారాలను మూసివేయడం, తిరిగి తెరవడం, వేర్వేరు ప్రదేశాలకు పరిశ్రమలకు మార్చడం, వైరస్ భయం వంటివి అన్నీ ఇందుకు కారణాలు కావచ్చని భావిస్తున్నారు.

ఏండ్ల సంది ఉన్న ద్రవ్యోల్బణం..
ఎన్నో ఏండ్లుగా ఉన్న ద్రవ్యోల్బణం, పెరగని జీతాలతో ప్రజలు స్తబ్దుగా జీవిస్తున్నారు. ఈ సమయంలో కరోనా వల్ల శ్రమ విలువ అందరికీ తెలిసొచ్చింది. అలాగే వర్క్​ ఫ్రం హోం అంటూ జర్నీ ప్రాబ్లమ్స్‌‌ తగ్గాయి. పెరుగుతున్న పని ఒత్తికి కారణంగా వ్యక్తిగత సౌకర్యాన్ని కనుగొనడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2020లో, 80 శాతం మంది అమెరికన్లు తమకు చాలా పనులు ఉన్నాయని, వాటిని చేయడానికి టైమ్‌‌ సరిపోవడంలేదని భావించినట్లు ఒక నివేదిక తెలిపింది. 2014 గ్యాలప్ పోల్ ప్రకారం కార్మికులు వారానికి సగటున 47 గంటలు పనిచేస్తున్నారు. 18 శాతం కంటే ఎక్కువ మంది వారానికి 60 గంటలకు పైగా పని చేస్తున్నారు. పూర్తి సమయం కనీస వేతనాలతో పనిచేస్తున్న కార్మికులు మరో ఉద్యోగం చేయకుండా అమెరికాలో ఏ రాష్ట్రంలోనూ ఎవరూ ఇల్లు కొనలేరని గణాంకాలు వెల్లడించాయి.

ఆశావాదంతోనే ఉద్యోగాలు వదిలేస్తున్నరు
ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాలను వదులుకోవడం చూస్తుంటే ‘మేమింకా బాగా పనిచేయగలం’ అనే ఆశావాదంతో అమెరికన్లు ఉన్నట్లు కనిపిస్తోంది. అమెరికా కార్మికులకు స్వర్ణయుగంగా భావించే 20వ శతాబ్ధంలో అనేక మంది కార్మికులు ఒకే ఉద్యోగంలో 40 ఏండ్ల వరకు పనిచేసి, చివరకు రిటైర్మెంట్​ సమయంలో ‘బంగారు వాచీ’ని బహుమతిగా పొందేవారు. 1960, 70వ దశకాల్లో గత 20 ఏండ్లలో కంటే చాలా తరచుగా తమ ఉద్యోగాలను విడిచి పెట్టేవారు. ఇందుకు ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా, స్థిరంగా ఉండడం ఒక కారణం కావచ్చు. అయితే 1980ల నుంచి అమెరికన్లు చాలా తక్కువగా రిజైన్‌‌ చేశారు. అందుకు కారణం కొత్త ఉద్యోగాల్లో భద్రత తగినంతగా ఉండకపోవచ్చనే భయమే. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కరోనా తెచ్చిన గొప్ప మాంద్యం కారణంగా వారికి డిమాండ్ పెరుగుతున్నది. చాలీచాలని జీతాలతో ఒకచోటే అతుక్కుపోవలసిన అవసరం లేదనిపిస్తోంది. అందుకే ‘గ్రేట్​ రెజిగ్నేషన్’ వారిలో కొత్త ఆశలు నింపుతోంది.

అయోమయంలో యజమానులు
కార్మికులతో పోల్చుకొంటే యజమానులు, ఉన్నతాధికారులు కరోనా కంటే ముందు చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలోని గందరగోళం వారి పరిస్థితిని పెనం పైనుంచి మంటల్లో పడినట్లుగా మార్చింది. ఉపాధి అవకాశాల ప్రాథమిక సూత్రాలు ఇప్పుడు అమెరికాలో తారుమారవుతున్నాయి. కరోనా అనేక కుటుంబాలను 19వ శతాబ్ధపు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను గుర్తుకు తెచ్చే స్వదేశీ జీవన శైలిలోకి నెట్టింది. దాంతో చాలా మంది యజమానులు అయోమయంతో దిక్కుతోచని పరిస్థితిల్లో ఉన్నారు. ప్రస్తుతం చాలా కుటుంబాలు ఇంటి పనుల్లో అంటే వంట, పిల్లలను చూసుకోవడం లాంటి పనులపై కూడా శ్రద్ధ పెడుతున్నాయి. ఇది పని-జీవిత సమతుల్యతపై కొత్త దృష్టిని సూచిస్తోంది. కార్యాలయాలను పూర్తిగా మూసివేయడం ద్వారా, కరోనా వారి పనిని తగ్గించి ఉండవచ్చు. వాస్తవానికి, 2014లో న్యూయార్క్​లోని ఫెడరల్ రిజర్వ్.. అమెరికన్స్‌‌ను అడిగిన ప్రశ్నకు సమాధానంగా 62 ఏండ్లకు మించి పని చేయాలని భావిస్తున్నట్లు చెప్పిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు ఆ వయసు దాటాక పని పట్ల మొగ్గు చూపడం లేదని తేలింది.

ఇండియాలో కనిపించని ప్రభావం
ఇండియాలో నిరుద్యోగం లేదా సామాజిక భద్రతా ప్రయోజనాలు చెప్పుకోదగిన విధంగా లేకపోవడంతో గ్రేట్​ రెజిగ్నేషన్​ పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదు. ఇండియాలో ఉపాధి మార్కెట్ విదేశాల కంటే పూర్తిగా భిన్నం. అందువల్ల ఇక్కడి ప్రజలు తమ ఉద్యోగాలను వదులుకోవడానికి తొందరపడడం లేదు. కరోనా కారణంగా పెద్ద సంఖ్యలో కోల్పోయిన ఉద్యోగాలు తిరిగి వస్తున్నాయా లేదా అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. అందువల్ల దీని ప్రభావం మన దేశంపై అంతగా ఉండకపోవచ్చు.

- చలసాని నరేంద్ర, పొలిటికల్​ ఎనలిస్ట్