- అది తమ భూభాగమన్న చైనా వాదనలను తప్పుపట్టిన అమెరికా
- డ్రాగన్ ఏకపక్ష చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన
వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్ పూర్తిగా ఇండియాదే అని అమెరికా స్పష్టం చేసింది. అరుణాచల్ విషయంలో చైనా చేస్తున్న వాదనలను తప్పుపట్టింది. వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్–ఎల్ఏసీ) వెంట చైనా అనుసరిస్తున్న ఏకపక్ష చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ ప్రకటన చేశారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటీవల ప్రధాని మోదీ పర్యటను వ్యతిరేకిస్తూ చైనా టాప్ మీలిటరీ అధికారి ఒకరు మాట్లాడిన నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేసింది. బుధవారం వాషింగ్టన్లో వేదాంత్ పటేల్ మాట్లాడుతూ.. “అరుణాచల్ ప్రదేశ్‌ను అమెరికా భారత భూభాగంగా గుర్తిస్తున్నది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట చొరబాట్లు లేదా ఆక్రమణల ద్వారా, సైనిక లేదా పౌరుల ద్వారా ప్రాదేశిక సరిహద్దులను మార్చే ఎంటువంటి ఏకపక్ష ప్రయత్నాలనైనా మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నం” అని అన్నారు.
మార్చి 9న ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో 13 వేల అడుగుల ఎత్తులో నిర్మించిన సేలా టన్నెల్‌ను ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. ఇది సరిహద్దుల్లోని వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్ కు కనెక్టివిటీని పెంచుతుంది. అలాగే సరిహద్దుల్లోకి సైనికుల రాకపోకలను సులభతరం చేస్తుంది. దీనిపై ఇటీవల చైనా రక్షణ శాఖ ప్రతినిధి జాంగ్ జియోగాంగ్ మాట్లాడుతూ జిజాంగ్ దక్షిణ భాగం (టిబెట్‌కు చైనా పేరు) చైనా భూభాగంలోని ప్రాంతమని అన్నారు. అలాగే ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ గా పేర్కొంటున్న ప్రాంతాన్ని చైనా గుర్తించబోదని, తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ పై చైనా ప్రకటనను ఇండియా కూడా తీవ్రంగా తప్పుపట్టింది. అరుణాచల్ తమ దేశంలో రాష్ట్రంగా ఉందని.. ఎప్పటికీ అలాగే ఉంటుందని ప్రకటించింది.
అమెరికా ప్రకటనను వ్యతిరేకిస్తున్నం: చైనా
అరుణాచల్ ప్రదేశ్‌ను భారత భూభాగంలో భాగంగా అమెరికా గుర్తించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, భారత్–-చైనా బోర్డర్ వివాదంతో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని చైనా గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. తన భౌగోళిక, రాజకీయ ప్రయోజనాల కోసం ఆ దేశం ఇతర దేశాల వివాదాలను వాడుకుంటున్నదని ఆరోపించింది.