అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కరోనా భారినపడ్డారు. ట్రంప్ సలహాదారురాలైన హోప్ హిక్స్‌కు కరోనా సోకడంతో ట్రంప్ మరియు మెలానియా గురువారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. శుక్రవారం ఆ పరీక్షల ఫలితాలలో ట్రంప్ దంపతులిద్దరికీ కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దాంతో వారు క్వారంటైన్‌లోకి వెళ్తున్నామని మరియు రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని తెలియజేశారు.
అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ ప్రచారంలో మునిగిపోయారు. ఆయన అడ్వైజర్ హోప్ హిక్స్ కూడా ట్రంప్‌తో ప్రయాణిస్తూ ఉంటుంది. రెండు రోజుల క్రితం క్లీవ్ ల్యాండ్‌లో జరిగిన అధ్యక్ష అభ్యర్థుల మొదటి విడత చర్చలకు ఆమె కూడా ట్రంప్‌తో కలిసి వెళ్లారు. మంగళవారం జరిగిన ఈ చర్చల కోసం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్‌తో కలిసి హిక్స్ ప్రయాణించింది. ఆ తర్వాత బుధవారం మిన్నెసోటాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న తర్వాత హోప్.. ట్రంప్‌తో కలిసి మెరైన్ వన్ హెలికాప్టర్లో వైట్ హౌస్‌కు వచ్చింది.
‘హోప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె కాస్త విరామం కూడా తీసుకోకుండా చాలా కష్టపడి పనిచేస్తుంది. ఆమె ఎల్లప్పుడూ మాస్కు ధరిస్తుంది. అయినా కూడా ఆమెకు కరోనా సోకడం దారుణం. హిక్స్‌కు కరోనా రావడంతో నేను, మెలానియా కూడా టెస్టులు చేయించుకున్నాం. వాటిలో మాకు కరోనా పాజిటివ్‌గా వచ్చింది’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.
కాగా.. ఎన్నికల దృష్ట్యా ట్రంప్ శుక్రవారం ఫ్లోరిడాలో ఒక ర్యాలీలో పాల్గొనవలసి ఉంది. అయితే కరోనా కారణంగా క్వారంటైన్ విధించుకున్న ట్రంప్.. మరి ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
Tonight, @FLOTUS and I tested positive for COVID-19. We will begin our quarantine and recovery process immediately. We will get through this TOGETHER!
— Donald J. Trump (@realDonaldTrump) October 2, 2020
For More News..