అమెరికా ప్రెసిడెంట్ ఎప్పుడొచ్చినా హంగామే!

ఇండియా, అమెరికా మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలున్నా యి.  చికాగోలో జరిగిన ప్రపంచ ధార్మిక సమ్మేళనానికి మనదేశం నుంచి హాజరైన స్వామి వివేకానం దకు అమెరికా ఘన స్వాగతం పలికింది. వివేకానందుడి ప్రసంగానికి అమెరికన్లు ముగ్ధులయ్యారు. బ్రిటిష్ పాలనకు వ్యతి రేకంగా జరిగిన పోరాటంలో భారతీయు లకు అమెరికా అండగా నిలిచింది. జాన్ ఎఫ్ కెన్నెడీ ప్రెసిడెంట్ గా ఉన్న సమ యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడ్డాయి. 1962 లో చైనా తో యుద్ధం వచ్చినప్పుడు మనదేశానికి అమెరికా అండగా నిలబడింది.

అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనాగానీ, మన దేశానికి వచ్చారంటే చాలు.. హంగామా మామూలుగా ఉండదు. ప్రపంచంలోకెల్లా పవర్​ఫుల్​ ప్రెసిడెంటేమో ఆయన ఏ దేశానికి వెళ్లినా ఒక రేంజ్​లో స్వాగతం పలకాల్సిందే. ఇప్పటివరకు ఆరుగురు అమెరికా ప్రెసిడెంట్లు మన దేశంలో పర్యటించారు.  ప్రతిసారీ అద్భుతమైన ఆతిథ్యమే ఇచ్చారు. ఈ నెల 24న ఢిల్లీకి వస్తున్న  డొనాల్డ్ ట్రంప్ ఏడో అమెరికా ప్రెసిడెంట్ అవుతారు. బరాక్​ ఒబామా అయితే రెండు సార్లు టూర్ చేశారు. అంతేకాదు, రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరైన తొలి అమెరికా ప్రెసిడెంట్ గా కూడా ఆయనే. 2000 సంవత్సరం  నుంచి అమెరికా ప్రెసిడెంట్​గా ఎవరు ఎన్నికైనా ఇండియా పర్యటనకు రావడం ఒక ఆనవాయితీగా మారింది.  కొంతకాలంగా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో  మనదేశానికి ప్రాధాన్యం పెరగడం దీనికి ప్రధాన కారణంగా ఎనలిస్టులు చెబుతారు. ముఖ్యంగా ఆసియాలో చైనాతో ఢీకొనే సత్తా ఉన్న దేశంగా ఇండియా అన్నిదేశాల దృష్టిని ఆకర్షించింది. ఈ పరిస్థితుల్లో ఇండియాతో స్నేహానికి అమెరికా ఆసక్తి చూపుతోంది.

ఫస్ట్​ వచ్చింది ఐసన్ హోవర్

మన దేశంలో తొలిసారి పర్యటించిన అమెరికా ప్రెసిడెంట్ ఐసన్ హోవర్. స్వతంత్రం వచ్చిన 12 ఏళ్ల తరువాత 1959లో ఐసన్ హోవర్ పర్యటించారు. టూర్ సందర్భంగా ఐసన్ హోవర్ నాలుగు రోజుల పాటు మన దేశంలో ఉన్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని రాంలీలా గ్రౌండ్​లో ఓ పెద్ద బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ సభకు దాదాపు పది లక్షల మంది హాజరైనట్లు చెబుతారు. ఆ తరువాత పార్లమెంటులో మాట్లాడారు. ఆగ్రా వెళ్లి తాజ్ మహల్​ను కూడా సందర్శించారు. అప్పటివరకు రష్యాకు ఇండియా అనుకూలమన్న అపోహ అమెరికాకు ఉండేది. ఐసన్ హోవర్ పర్యటనతో అమెరికాకున్న ఈ అపోహ తొలగింది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అలీన సిద్ధాంతాలకు మన దేశం కట్టుబడి ఉందని అమెరికా విశ్వసించడం మొదలైంది. ఐసన్ హోవర్ టూర్​ ఇండో–అమెరికన్​ సంబంధాల్లో మంచి మార్పు తెచ్చినట్లు ఎనలిస్టులు చెబుతారు.

ఇందిర హయాంలో నిక్సన్ టూర్

సరిగ్గా ఐసన్ హోవర్ వచ్చి వెళ్లిన పదేళ్లకు, 1969లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ మన దేశంలో టూర్ చేశారు. ప్రెసిడెంట్ అయిన ఆర్నెల్లకే నిక్సన్ ఇండియా టూర్ ప్రోగ్రాం పెట్టుకోవడం విశేషం. అయితే ఆయన టూర్ పూర్తిగా ఒక్కరోజు కూడా లేదు. కేవలం 22 గంటలకే పరిమితమైంది. ఇప్పటివరకు అమెరికా ప్రెసిడెంట్లలో అతి తక్కువ టైం టూర్ ఇదే. మన దేశంలో రాజకీయంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్న పరిస్థితుల్లో రిచర్డ్ నిక్సన్ టూర్ జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సిండికేట్​గా పిలిచే పాత తరం నాయకులకు, ఇందిరా గాంధీకి మధ్య మీరా, నేనా! అనే తగాదా నడుస్తున్న టైంలో నిక్సన్ మన దేశంలో పర్యటించారు.

ఐదు రోజులున్న బిల్ క్లింటన్

2000లో అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ టూర్ చేశారు. ఐదు రోజుల పాటు ఆయన మన దేశంలో ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ ఇండియాలో చేసిన లాంగెస్ట్​ టూర్​ ఇదే. క్లింటన్ వచ్చినప్పుడు ప్రధానిగా అటల్ బిహారీ వాజ్​పేయి ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్​, ఆగ్రా, జైపూర్, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఆయన పర్యటించారు. పార్లమెంటులో మాట్లాడారు. సరదాగా టైగర్ సఫారీలో టూర్ చేశారు. గ్రామీణులతో ఆడి పాడారు. క్లింటన్ పర్యటన తరువాత అమెరికా, ఇండియా మధ్య సంబంధాలు మరింతగా బలపడ్డాయి.  బిల్ క్లింటన్ రెండో టర్మ్ ముగింపులో ఉండగా ఈ టూర్​ జరిగింది. క్లింటన్ కూతురు షెల్సా తండ్రి వెంట పాల్గొన్నారు.

జనతా టైంలో వచ్చిండు జిమ్మీ కార్టర్

జనతా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో (జనవరి 1978) అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ మన దేశానికి వచ్చారు. ఈ టూర్ జరిగేనాటికి ప్రధానిగా మొరార్జీ దేశాయ్ ఉన్నారు. టూర్​లో భాగంగా మూడు రోజుల పాటు కార్టర్ ఇక్కడ ఉన్నారు. 1971లో బంగ్లాదేశ్​ విముక్తి సమయంలో జరిగిన ఇండో–పాక్​ యుద్ధం తరువాత అమెరికా, ఇండియా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో జిమ్మీ కార్టర్ టూర్​ రెండు దేశాల మధ్య మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొనేలా చేయడానికి ఉపయోగపడిందని చెప్పవచ్చు. టూర్ సందర్భంగా పార్లమెంటులో కార్టర్ ప్రసంగించారు. అలాగే ఢిల్లీకి దగ్గరలో ఉన్న ‘దౌలత్​పూర్ నసీరాబాద్’ అనే పల్లెటూరుకి జిమ్మీ కార్డర్ వెళ్లారు. ఈ ఊరితో జిమ్మీ కార్టర్​కు అనుబంధం ఉంది. 60ల్లో కార్టర్ తల్లి లిలియన్ ‘ఆర్మీ కోర్​’ మెంబర్​గా ఈ ఊరికి వచ్చారట. దీంతో ఈ గ్రామానికి ఒక టెలివిజన్ సెట్​ను కార్టర్ దంపతులు కానుకగా ఇచ్చారు. ఊరి అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ తరువాత జిమ్మీ కార్డర్ సందర్శనకు గుర్తుగా ఊరి పేరు మార్చేశారు. ‘దౌలత్​పూర్ నసీరాబాద్​’ కాస్తా ‘కార్టర్ పురి’ అయిపోయింది.

బుష్ విజిట్​ రెండున్నర రోజులే

బిల్ క్లింటన్ టూర్ తరువాత ఆరేళ్లకు 2006లో జార్జ్ డబ్ల్యు బుష్ (జూనియర్​) మన దేశంలో పర్యటించారు. అయితే, బుష్ పర్యటన కేవలం రెండున్నర రోజులే. అందరు అమెరికా ప్రెసిడెంట్లలాగా బుష్ కూడా పార్లమెంటులో ప్రసంగించాల్సి ఉంది. అయితే, అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ–1 ప్రభుత్వానికి బయటినుంచి మద్దతు ఇస్తున్న కమ్యూనిస్టు పార్టీలు దీన్ని వ్యతిరేకించాయి. టూర్​లో భాగంగా ఆయన హైదరాబాద్​ వచ్చి రైతులతో మాట్లాడారు. బుష్​ టూర్​లోనే  అమెరికాతో న్యూక్లియర్ డీల్ కుదిరింది. వరుసగా ఇద్దరు అమెరికా ప్రెసిడెంట్లు హైదరాబాద్​కి రావడంకూడా గుర్తుంచుకోదగ్గదే.

ఒబామా రెండుసార్లు

అమెరికా ప్రెసిడెంట్​గా పనిచేసిన బరాక్ ఒబామా రెండుసార్లు ఇండియాలో టూర్ చేశారు. 2010లో ఫస్ట్ టైం ఇండియాకు రాగా, 2015లో సెకండ్ టైం  వచ్చారు.

 

 

2010 టూర్ లో…

ఢిల్లీ, ముంబై నగరాల్లో ఒబామా దంపతులు కొన్ని ప్లేస్​లు చూశారు. ఫస్ట్ టైమ్ టూర్​లో ఢిల్లీకి రాకుండా నేరుగా ముంబై నగరంలో దిగారు. 2008 నాటి ముంబై దాడుల్లో  ప్రాణాలతో బయటపడ్డవారిని కలుసుకుని ఓదార్చారు.  ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీ స్టూడెంట్స్​తో సమావేశమయ్యారు. అలాగే ఒక అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి చిన్నారులతో మాట్లాడారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు

2015లో మరోసారి…

తొలి పర్యటన జరిగిన ఐదేళ్ల తరువాత 2015లో మళ్లీ బరాక్ ఒబామా మన దేశంలో పర్యటించారు. ఈ టూర్ జరిగినప్పుడు ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారు. అదే ఏడాది జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ఒబామా చీఫ్​ గెస్ట్​. మన దేశ రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్​గా హాజరైన తొలి అమెరికా ప్రెసిడెంట్​ బరాక్ ఒబామా.