ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకపూట భోజనం అయినా మానేస్తాం గానీ ఫోన్ లేకుండా ఉండలేం అనేంతగా అడిక్ట్ అయిపోతున్నాం. అయితే ఓ ఊళ్లో నివసించే ప్రజలు మాత్రం మొబైల్, టీవీ , రేడియో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులేవీ ఉపయోగించరు. వినడానికి వింతగా ఉన్నా ఇప్పటికీ అక్కడి ప్రజలు ఇదే నియమాన్ని పాటిస్తున్నారు. టెక్నాలజీకి దూరంగా ఉన్న ఆ ఊరు ఎక్కడుంది? సెల్‌ఫోన్స్ లేకుండా అక్కడివాళ్లు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి ఆయుష్షు తగ్గడానికి టెక్నాలజీ ఓ కారణమవుతోందన్న అధ్యయనాల గురించి విన్నప్పుడల్లా ఆందోళన పెరిగిపోవడం సహజం. అయితే సాంకేతికత తప్పనిసరి అయిన ఈ కాలంలో.. దానిని పూర్తిగా దూరం పెట్టడం కొంచెం కష్టమైన పనే. అయితే టెక్నాలజీకి దూరంగా ఏకంగా ఒక ఊరినే ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది?. మనం ఏ వస్తువైతే గంట సేపు కూడా దూరం పెట్టలేమో.. ఆ వస్తువును అస్సలు వాడకుంటే ఎలా ఉంటుంది?. వామ్మో.. సెల్ఫోన్ లేకుండా గడపడం మహా కష్టం అంటారా!, అయితే ఈ ఊరి గురించి తెలుసుకోవాల్సిందే..
అమెరికా వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్యాంక్ ప్రాంతం. భూమ్మీద ఉన్న విచిత్రమైన ఊళ్లలో ఒకటి. ఈ ప్రాంతం 'సిటీ రేడియో క్వైట్ జోన్'లో ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ పై ఇక్కడ నిషేధం ఉండటం వల్ల సెల్ఫోన్లు, వైఫై ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగించాలని ప్రయత్నించినా అవి అస్సలు పనిచెయ్యవు. సాంకేతికతకు దూరంగా ఉండటం వల్లే ఆరోగ్యంగా ఉన్నామని అక్కడి ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రాంతాన్ని అధికారులు టెక్నాలజీకి దూరంగా ఉంచడం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. గ్రీన్బ్యాంక్లో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ఉంది. దీనికి డ్యామేజ్ కాకూడదన్న ఉద్దేశంతో ఫ్రీక్వెన్సీతో పని చేసే ఎలక్ట్రానిక్ డివైజ్ లను అనుమతించరు. అయితే ఆధునిక జీవన శైలితో విసిగి వేసారిపోయినవాళ్లు ఇక్కడ పర్యటించొచ్చు. ప్రత్యేక అనుమతితో ఇల్లు కూడా కట్టుకుని కొన్నిరోజులు గడపొచ్చు.సెల్ ఫోన్లు.. వాటి సిగ్నల్ టవర్లు లేని ఊళ్లు (నిషేధిత దీవులు తప్ప) గూగుల్లో వెతికినా కనిపించవు. కానీ, ఈ ప్రాంతంలో జీవించాలంటే వైర్ లెస్ పరికరాలేవీ వాడకూడదు. గత యాభై ఏళ్లుగా ఈ నిబంధన అమలులో ఉంది. రూల్ పాటించేవాళ్లే ఈ ఊరిలో నివసిస్తారు. రెంటల్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలి. కుదరదనుకుంటే అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు.
ఈ ప్రాంతంలో నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీని నెలకొల్పారు. ఇక్కడే గ్రీన్బ్యాంక్ టెలిస్కోప్ ను ఏర్పాటు చేశారు. పక్కనే మరో రెండు టెలిస్కోప్లు ఉంటాయి. ఖగోళంలోని రహస్యాలను చేధించేందుకు సుమారు 100 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఇక్కడ పరిశోధనలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిశోధనల కోసం ఏడాది మొత్తంలో ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు గంటలు మాత్రమే జరుగుతాయి. ఇక్కడ మాత్రం గంటల తరబడి సాగుతుంటాయి.
బ్రేక్తో పేరిట గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఏలియన్ల నుంచి వచ్చే శబ్దతరంగాలను.. ఇతర డివైజ్ ఫ్రీక్వెన్సీ అడ్డుకునే అవకాశం ఉంది. అందుకే సిగ్నల్ ఆధారిత ఎలక్ట్రానిక్ డివైజ్ పై నిషేధం అమలులో ఉంది. బ్రేక్ కోసం అప్పట్లో ప్రముఖ శాస్త్రవేత్తల సంతకాల సేకరణ కూడా చేపట్టారు. వాళ్లలో దిగ్గజ శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్తో పాటు యూరీ మిల్నర్ కూడా ఉన్నాడు. 'ఏలియన్ల ఉనికి గురించి మనిషి చేస్తున్న ప్రయత్నాలపై హ్యాకింగ్ వారించిన మాట నిజమే. అయినా కూడా ఈ గ్రీన్ బ్యాంక్ పరిశోధనలకు ఆయన మద్దతు ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది' అని మిల్నర్ చెబుతున్నాడు.
సెల్ ఫోన్ లేకపోయినా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నామంటున్నారు అక్కడి ప్రజలు. సోలార్ పవర్, పాడిపరిశ్రమ వీరి జీవనాధారం. వారాంతంలో ఇక్కడికి పర్యాటకుల తాకిడి ఉంటుంది. అయితే బయటి నుంచి వచ్చేవాళ్ల సెల్ఫోన్లు కూడా పని చేయకుండా ప్రత్యేకంగా జామర్లను ఏర్పాటు చేశారు. అంతెందుకు పరిశోధన కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తలు, పరిశోధకుల ఫోన్లు కూడా పనిచెయ్యవు. మరి కమ్యూనికేషన్ ఎలాగంటారా?.. గ్రీన్బ్యాంక్ శివారులో ప్రత్యేకంగా కొన్ని రేడియో సెంటర్లు, ఫోన్ బూత్లు ఏర్పాటు చేశారు