- అమెరికాకు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: సిరియాలో తమ కాన్సులేట్ పై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతిదాడి కోసం ప్లాన్ చేస్తున్నామని ఇరాన్ తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికా తమ దారికి అడ్డు రావొద్దని కోరింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రాప్ లో చిక్కుకోవద్దని అమెరికాను హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడి రాజకీయ వ్యవహారాల డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మొహమ్మద్ జమ్ షిది ట్వీట్ చేశారు.
అలాగే వైట్ హౌస్ కు కూడా జమ్ షిది లిఖితపూర్వక సందేశం పంపారు. ఇజ్రాయెల్ పై తాము చేసే ప్రతిదాడికి దూరంగా ఉండాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ సందేశంలో ఆయన వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఇరాన్ హెచ్చరికపై అమెరికా ఇంకా స్పందించలేదు. మరోవైపు ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైందని సీఎన్ఎన్ పేర్కొంది.
ఇరాన్ హెచ్చరికలను అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సీరియస్ గా తీసుకున్నారని తెలిపింది. ఇజ్రాయెల్ లో తమ పౌరులను మినహాయించి మిలిటరీ లేదా ఇంటెలిజెన్స్ నే ఇరాన్ టార్గెట్ గా చేసుకోవచ్చని ఆయన అనుమానిస్తున్నారని వెల్లడించింది. అలాగే ఇజ్రాయెల్ కు గట్టిగా బుద్ధి చెప్తామని ఇస్లామిక్ రిపబ్లిక్ కూడా హెచ్చరించింది. కాగా, సిరియా రాజధాని డమాస్కస్ లో ఈ నెల 1న ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు ఇరాన్ జనరల్స్ సహా ఏడుగురు చనిపోయారు.
బైడెన్ హామీ ఇచ్చినందుకే ఇరాన్ వార్నింగ్
ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య గత కొద్ది నెలలుగా ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఫోన్ చేశారు. ఆందోళన చెందవద్దని, ఇరాన్ నుంచి ఎదురయ్యే సవాళ్ల విషయంలో మీకు పూర్తిగా అండగా ఉంటామని నెతన్యాహుకు బైడెన్ హామీ ఇచ్చారు. బైడెన్ హామీ ఇచ్చిన కొద్ది గంటలకే అమెరికాను ఇరాన్ హెచ్చరించడం గమనార్హం.