- దంచికొట్టిన ఆరోన్ జోన్స్
డల్లాస్: టాప్ క్లాస్ క్రికెట్‌లో తన రాకను అమెరికా ఘనంగా చాటుకుంది. టీ20 వరల్డ్ కప్‌లో ఆతిథ్య జట్టుగా బరిలోకి దిగి అద్భుత విజయంతో అరంగేట్రం చేసింది. ఆరోన్ జోన్స్(40 బాల్స్‌లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 94 నాటౌట్) ఖతర్నాక్ బ్యాటింగ్‌తో చెలరేగిన వేళ భారీ టార్గెట్‌ను ఛేజ్ చేస్తూ బోణీ కొట్టింది. ఇండియా టైమ్ ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన గ్రూప్–ఎ పోరులో 7 వికెట్ల తేడాతో మరో అరంగేట్రం జట్టు కెనడాపై ఘన విజయం సాధించింది.
తొలుత కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 194/5 స్కోరు చేసింది. నవ్‌నీత్ ధలివాల్ (44 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 61), నికోలాస్ కిర్టన్ (31 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) ఫిఫ్టీలతో సత్తా చాటారు. ఆతిథ్య జట్టులో అలీ ఖాన్, హర్మీత్ సింగ్, కోరే అండర్సన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఆరోన్ జోన్స్‌కు తోడు అండ్రీస్ గౌస్ (46 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 65) సత్తా చాటడంతో అమెరికా 17.4 ఓవర్లలోనే 197/3 స్కోరు చేసి గెలిచింది. జోన్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ధలివాల్, కిర్టన్ ఫిఫ్టీలు
రెండు చిన్న జట్లు తలపడినా భారీ స్కోర్లతో ఈ పోరు అభిమానులను అలరించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన కెనడా ధలివాల్, కిర్టన్ ఫిఫ్టీలతో భారీ స్కోరు చేసింది. పంజాబ్‌కు చెందిన ధలివాల్, మరో ఓపెనర్ ఆరోన్ జాన్సన్ (23) ఐదు ఓవర్లలోనే తొలి వికెట్‌కు 43 రన్స్ జోడించి మంచి ఆరంభం ఇచ్చారు. ముంబైలో పుట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్మీత్ సింగ్ ఆరో ఓవర్లో జాన్సన్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. దాంతో ఈ టోర్నీలో తొలి వికెట్ తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇండియా సంతతికి చెందిన మరో కెనడా ప్లేయర్ పర్గత్ సింగ్ (5) రనౌట్‌గా వెనుదిరగ్గా.. అప్పటికే క్రీజులో కుదురుకున్న ధలివాల్‌కు కిర్టన్ తోడయ్యాడు. స్టీవెన్ టేలర్ వేసిన పదో ఓవర్లో చెరో సిక్స్‌తో ఇద్దరూ జోరందుకున్నారు. 12వ ఓవర్లో మరో సిక్స్ కొట్టిన ధలివాల్ 36 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో పాటు స్కోరు వంద దాటించాడు.
అటువైపు కిర్టన్ కూడా వరుస షాట్లతో అలరించాడు. మిగతా బౌలర్లు నిరాశ పరచడంతో యూఎస్ కెప్టెన్ మోనక్ పటేల్.. మాజీ న్యూజిలాండ్ స్టార్ కోరె అండర్సన్‌ను బరిలోకి దింపాడు.15వ ఓవర్లో తన తొలి బాల్‌కే ధలివాల్‌ను ఔట్ చేసిన కోరె మూడో వికెట్‌కు 66 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. ధలివాల్ వెనుదిరిగినా కెనడా జోరు తగ్గలేదు. స్లాగ్ ఓవర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ శ్రేయస్ మొవ్వా (16 బాల్స్‌లో 32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత కిర్టన్ 18వ ఓవర్లో పెవిలియన్ చేరగా.. అండర్సన్ వేసిన 19వ ఓవర్లో 4, 6 కొట్టిన దిల్‌ప్రీత్ బజ్వా (11) ఆఖరి బాల్‌కు రనౌటయ్యాడు. అలీ ఖాన్ వేసిన చివరి ఓవర్లో ఫోర్, రెండు సిక్సర్లతో మొవ్వా ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
జోన్స్ ధనాధన్
భారీ టార్గెట్ ఛేజింగ్‌ను తడబడుతూ ఆరంభించినా.. జోన్స్, గౌస్ మూడో వికెట్‌కు 131 రన్స్ జోడించి అమెరికాను గెలిపించారు. ముఖ్యంగా తన పవర్ హిటింగ్‌తో జోన్స్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. తొలుత ఇన్నింగ్స్ రెండో బాల్‌కే ఓపెనర్ స్టీవెన్ టేలర్ (0)ను డకౌట్ చేసిన కలీమ్ హోమ్‌టీమ్‌కు షాకిచ్చాడు. కెప్టెన్ మోనక్ (16), గౌస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేయడంతో పవర్ ప్లేను యూఎస్‌ఏ 41/1తో ముగించింది. అయితే హేలిగర్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడిన మోనక్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వికెట్ పారేసుకున్నాడు. తర్వాతి ఓవర్లో సాద్ బిన్ మూడే రన్స్ ఇవ్వడంతో 8 ఓవర్లకు అమెరికా 48/2తో ఇబ్బందుల్లో పడినట్టు కనిపించింది.
ఈ టైమ్‌లో గౌస్, జోన్స్.. నిఖిల్ దత్తా వేసిన తర్వాతి ఓవర్లో చెరో సిక్స్‌తో ఒక్కసారిగా స్పీడు పెంచారు. సాద్ బౌలింగ్‌లో జోన్స్ 4, 6 రాబట్టడంతో సగం ఓవర్లకు హోమ్ టీమ్ 81/2తో నిలిచింది. ఆ తర్వాత కూడా జోన్స్ అదే జోరు కొనసాగించాడు. ఏ ఒక్క బౌలర్‌నూ వదలకుండా భారీ షాట్లతో రెచ్చిపోయాడు. అలవోకగా సిక్సర్లు కొడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. సాద్ వేసిన 13వ ఓవర్లో మూడు సిక్సర్లు బాదిన అతను 22 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. జెరెమీ గార్డన్ వేసిన తర్వాతి ఓవర్లో గౌస్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు, జోన్స్ ఓ సిక్స్‌తో ఏకంగా 33 రన్స్ రాబట్టి మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశారు. తర్వాతి ఓవర్లో జోన్స్ ఇచ్చిన క్యాచ్‌ను దత్తా డ్రాప్ చేశాడు. ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్న జోన్స్ 18వ ఓవర్లో4, 6, 6తో మ్యాచ్ ముగించాడు.