- చావుబతుకుల్లో ఉన్న తల్లిని చూడగలిగిన కూతురు
- అమెరికాలోని డెల్టా ఎయిర్ లైన్స్ సిబ్బంది పెద్ద మనసు
.వాషింగ్టన్: అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ పెద్ద మనసు చాటుకుంది. చావుబతుకుల్లో ఉన్న అమ్మను చూడాలన్న కూతురి కోరికను నెరవేర్చింది. అరగంట పాటు విమానాన్ని ఆపి, ఆమెను అమ్మ దగ్గరికి చేర్చింది.
చివరి క్షణాల్లో కూతురును చూసిన అమ్మ.. ఆ మరుసటి రోజు కన్నుమూసింది. హన్నా వైట్ అనే మహిళ అమెరికాలోని డాలస్‌లో ఉంటున్నది. ఆమె తల్లి కాథ్లిన్ నెల్సన్ నార్త్ డకోటాలో ఉంటున్నది. అయితే న్యూమోనియాతో బాధపడుతున్న నెల్సన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.
ఇంకా కొన్ని గంటలే బతుకుతుందని హన్నా వైట్‌కు డాక్టర్ల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో చివరి క్షణాల్లో తల్లిని చూడాలని హన్నా వైట్ నిర్ణయించుకుంది. డాలస్ నుంచి నార్త్ డకోటాకు డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుంది. ఆమె డాలస్ నుంచి మినియాపొలిస్ వెళ్లి, అక్కడ నార్త్ డకోటా ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది.
ఫ్లైట్ ఆలస్యమవడంతో..
హన్నా వైట్ డాలస్ నుంచి వెళ్లాల్సిన ఫ్లైట్ గంట ఆలస్యమైంది. దీంతో మినియాపొలిస్‌లో కనెక్టింగ్ ఫ్లైట్ అందకపోవచ్చునని, నార్త్ డకోటా వెళ్లాల్సిన ప్యాసింజర్లు మరుసటి రోజుకు రీబుకింగ్ చేసుకోవాలని ఫ్లైట్‌లోకి ఎక్కిన తర్వాత సిబ్బంది సూచించారు.
ఆ మాట విని హన్నా వైట్ కన్నీటి పర్యంతమైంది. తన తల్లిని బతికి ఉండగా చూడలేనని తల్లడిల్లిపోయింది. తన పరిస్థితిని ఫ్లైట్ సిబ్బందికి వివరించింది. అది విని పైలెట్ చలించిపోయారు. వెంటనే మినియాపొలిస్‌లోని కనెక్టింగ్ ఫ్లైట్ పైలట్‌కు ఫోన్ చేశారు.
హన్నా వైట్ పరిస్థితిని వివరించి, ఆమె వచ్చే వరకు ఫ్లైట్‌ను ఆపాలని కోరారు. దీంతో 30 నిమిషాల పాటు ఆ ఫ్లైట్ ను ఆపడంతో హన్నా వైట్ దాన్ని అందుకోగలిగింది. ‘‘డెల్టా ఎయిర్ లైన్స్ సిబ్బంది సహకారంతో నేను నా తల్లిని చివరి క్షణాల్లో చూడగలిగాను.
ఆమెతో 24 గంటలు గడపగలిగాను. ఆ మరుసటి రోజు అమ్మ ఆనందంగా కన్నుమూసింది. ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు” అని హన్నా వైట్ పేర్కొంది.