- రెండు వాయిదాల తర్వాత నాసా రాకెట్ ప్రయోగం సక్సెస్
- బోయింగ్ స్టార్ లైనర్లోఆర్బిట్లోకి ఇద్దరు ఆస్ట్రోనాట్లు
- వారం తర్వాత తిరిగి వచ్చే చాన్స్
కేప్ కానవెరాల్: భారత సంతతి అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఐదోసారి అంతరిక్షంలోకి చేరుకున్నారు. బుధవారం ఉదయం 10.52 గంటలకు ఫ్లోరిడాలోని కేప్ కానవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నాసా ప్రయోగించిన అట్లాస్ వీ రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్లో ఆమెతోపాటు మరో ఆస్ట్రోనాట్ కక్ష్యలోకి చేరుకున్నారు. కక్ష్యలో 26 గంటలు జర్నీ చేసిన తర్వాత వారిద్దరూ తమ స్పేస్ షిప్ను ఐఎస్ఎస్కు అనుసంధానం చేసి, అందులోకి ప్రవేశించనున్నారని నాసా వెల్లడించింది.
ఐఎస్ఎ వారం రోజుల పాటు ఉన్న తర్వాత ఇదే క్యాప్సూల్ లో సునీత, విల్ మోర్ తిరిగి భూమికి రానున్నారు. అయితే, బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్ లో తొలిసారిగా ఆస్ట్రోనాట్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వద్దకు పంపేందుకు నాసా ఈ మిషన్ ను చేపట్టింది. మిషన్ లో భాగంగా స్టార్ లైనర్ స్పేష్ షిప్ పైలెట్ గా సునీత, కమాండర్ గా విల్ మోర్ వ్యవహరిస్తున్నారు. టెక్నికల్ లోపాల వల్ల ఇదివరకు రెండు సార్లు ఈ రాకెట్ ప్రయోగం వాయిదా పడగా.. మూడోసారి బుధవారం సక్సెస్ అయింది.
తొలుత మే 6వ తేదీన ప్రయోగం చేపట్టాల్సి ఉండగా.. రాకెట్ లో వాల్వ్ సమస్యతో ప్రయోగం ఆఖరి గంటలో వాయిదా పడింది. తర్వాత గత శనివారం మరోసారి ప్రయోగానికి సిద్ధం కాగా.. సునీత, విల్ మోర్ స్పేస్ షిప్ లోకి సైతం ఎక్కి బెల్టులు బిగించుకున్నారు. అంతలోనే గ్రౌండ్ లాంచ్ కంప్యూటర్ ఆటోమేటిక్ హోల్డ్ కు మారిపోవడంతో ప్రయోగానికి నాలుగు నిమిషాల ముందు మిషన్ ఆగిపోయింది. పవర్ సప్లైలో సమస్య వల్లే ఇబ్బంది ఏర్పడినట్టు సైంటిస్టులు గుర్తించారు. తాజాగా మూడో ప్రయత్నంలో ఎలాంటి అవాంతరం లేకుండా రాకెట్ ప్రయోగం జరిగింది.
బోయింగ్ స్టార్ లైనర్ కు అసలు పరీక్ష
ఆస్ట్రోనాట్లను అంతరిక్షానికి పంపేందుకు స్పేస్ షటిల్స్ వాడకాన్ని ఆపేసిన తర్వాత నాసా.. రష్యన్ రాకెట్లను వినియోగిస్తోంది. అందుకే రష్యా సాయం తీసుకోకుండా అంతరిక్షానికి ఆస్ట్రోనాట్ లను పంపేందుకు కొత్త స్పేస్ షిప్ లను తయారు చేసేందుకని 2014లో బోయింగ్, స్పేస్ ఎక్స్ కంపెనీలకు కాంట్రాక్ట్ అప్పగించింది.
స్పేస్ ఎక్స్ చాలా ముందుగానే డ్రాగన్ క్యాప్సూల్ ను తయారు చేయడమే కాకుండా.. దానితో ఆస్ట్రోనాట్లను ఐఎస్ఎస్కు పంపడం, తిరిగి తీసుకురావడం ప్రారంభించింది. ఈ పోటీలో వెనకబడిన బోయింగ్ ఎట్టకేలకు స్టార్ లైనర్ క్యాప్సూల్ ను తయారు చేసినా.. దానిని సక్సెస్ చేయడంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. తాజాగా అన్ని అడ్డంకులను దాటుకుని మానవ సహిత అంతరిక్ష యాత్రకు సిద్ధం కాగా.. రెండు వాయిదాల తర్వాత మూడోసారి సక్సెస్ అయింది.