న్యూఢిల్లీ: ఇండియాలో మరిన్ని పెట్టుబడులకు అమెరికా కంపెనీ యాపిల్ రెడీ అవుతోంది. చైనా–అమెరికా మధ్య సంబంధాలు రోజు రోజుకూ అధ్వానంగా మారుతుండటం, ఆసియాలోని మిగతా దేశాలకూ బిజినెస్‌ను విస్తరించాలనే ప్లాన్ఇందుకు కారణాలు. భారతదేశంలో యాపిల్ బిజినెస్‌ను పెంచుతుండటం వల్ల ఈ కంపెనీ నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో 1.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని స్టాఫింగ్ఫర్మ్ టీమ్‌లీజ్ సర్వీసెస్ తెలిపింది. వీరిలో 40 వేల మందికి డైరెక్ట్‌గా, 80 వేల మందికి ఇన్‌డైరెక్ట్‌గా ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో తన మార్కెట్‌ను విస్తరించుకోవడానికి యాపిల్ ఇక్కడ తయారీని పెంచబోతోంది. దీనివల్ల 2026 ఆర్థిక సంవత్సరం నాటికి, కనీసం మూడు లక్షల మందికి జాబ్స్ వస్తాయని అంచనా. వీరిలో లక్ష మందికి డైరెక్ట్‌గా, మిగతా వారికి ఇన్‌డైరెక్ట్‌గా ఉపాధి దొరుకుతుందని అంటున్నారు. టీమ్‌లీజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కార్తీక్ నారాయణ్ మాట్లాడుతూ అదనపు ప్లాంట్లను, ఫ్యాక్టరీలను ఓపెన్ చేయడం వల్ల రాబోయే 36 నెలల్లో చాలా మందికి అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. కర్ణాటకలోని 300 ఎకరాల కొత్త ఫ్యాక్టరీలో యాపిల్ ఫోన్స్ తయారవుతాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. ఇండియా, మిడిల్ ఈస్ట్, మెడిటేరియన్, తూర్పు యూరప్ ఆఫ్రికాలకు బాధ్యత వహిస్తున్న వైస్ ప్రెసిడెంట్- హ్యూగ్స్ అస్సేమాన్- ఇటీవల వైదొలగిన తర్వాత కంపెనీ విధానాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో ఆశిష్ చౌదరిని ప్రమోట్ చేస్తున్నారు. ఇండియా హెడ్‌గానూ పనిచేసే చౌదరి, ఇక నుంచి యాపిల్ ప్రొడక్ట్ సేల్స్ హెడ్ మైఖేల్ ఫెంగర్‌కు నేరుగా రిపోర్ట్ చేస్తారు.
అమ్మకాలు డౌన్...
కంపెనీ పోయిన క్వార్టర్లో భారత దేశంలో రికార్డు ఆదాయాన్ని నమోదు చేసినా, మొత్తం అమ్మకాలు మాత్రం 5 శాతం పడిపోయాయి. యాపిల్ ఫోన్ల ధరలు ఎక్కువగా ఉండటమే కారణమని రిటైలర్లు చెబుతున్నారు. ఇండియాలో మరింత బలపడేందుకు యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది చివరిలో దేశంలో తన మొదటి రిటైల్ అవుట్‌లెట్‌ను తెరవాలని భావిస్తోంది. యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తమ కంపెనీ ఇండియా మార్కెట్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. చైనా లాగానే ఇండియాలోనూ వేగంగా ఎదుగుతున్నామని స్పష్టం చేశారు. యాపిల్‌కు చైనా నుంచి ఏటా దాదాపు 75 బిలియన్ డాలర్లు వస్తున్నాయి. అమెరికా, యూరప్ తర్వాత అత్యధిక అమ్మకాలు చైనా నుంచే ఉన్నాయి. తమకు సేల్స్‌పరంగా, ప్రొడక్ట్ డెవెలప్మెంట్ పరంగానూ ఇండియా చాలా ముఖ్యమని యాపిల్ వర్గాలు తెలిపాయి. అందుకే యాపిల్ ప్రొడక్టులను తయారు చేసే కంపెనీలు ఇండియాలోనూ ప్లాంట్లను పెడుతున్నాయి. ఇదే విషయమై తన కాంట్రాక్ట్ పార్ట్నర్ ఫాక్స్‌కాన్‌తో చర్చిస్తోంది. దక్షిణాదిన ప్లాంటు పెట్టేందుకు యాపిల్, దీని కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ ఫాక్స్‌కాన్‌లు కొన్ని ప్రభుత్వాలతో లాబీయింగ్ చేశాయి.