- ప్రభుత్వంతో అమెరికా కంపెనీ ‘థర్మోఫిషర్ సైంటిఫిక్’ ఒప్పందం
- మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్, వెలుగు: అమెరికాకు చెందిన ఫార్చూన్ 500 కంపెనీ ‘థర్మో ఫిషర్ సైంటిఫిక్’ జీనోమ్ వ్యాలీలో బయో ప్రాసెస్ డిజైన్ సెంటర్ (బీడీసీ) ఏర్పాటు చేయనుంది. దీన్ని 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పనుంది. బుధవారం సెక్రటేరియెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. బీడీసీ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 2025 తొలి త్రైమాసికంలో బీడీసీని కంపెనీ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కరోనా సమయంలో థర్మోఫిషర్ సంస్థ ఎమర్జెన్సీ బేసిస్‌లో టెస్టింగ్ కిట్లను ఉత్పత్తి చేసి ఎఫ్‌డీఏ ప్రశంసలు పొందిందని గుర్తు చేశారు. కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసిన ఫైజర్, మోడర్నా వంటి సంస్థలకు రీఏజెంట్లు, ల్యాబ్కెమికల్స్సరఫరా చేసిందని చెప్పారు.
ఫార్మా పరిశ్రమకు డయాగ్నస్టిక్ పరికరాలు, రసాయనాలను సరఫరా చేస్తున్నదని తెలిపారు. ఈ సంస్థ ఏర్పాటుతో స్థానిక ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ లో అధునాతన ల్యాబ్‌లు, రీసెర్చ్ కేంద్రాలు ఉంటాయని పేర్కొన్నారు.
వచ్చే నెల 18న ఏఐ సమిట్..
1,800 బయో ఫార్మా కంపెనీల ఏర్పాటుతో దేశంలో ఔషధ ఉత్పత్తి, పరిశోధనలకు తెలంగాణ కేంద్ర బిందువుగా మారిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దేశం నుంచి ఉత్పత్తి, ఎగుమతి అయ్యే ఫార్మా, లైఫ్ సైన్సెస్ లలో రాష్ట్రం వాటా 33 శాతంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీతో పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువత అందుబాటులోకి వస్తారన్నారు.
ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 80 మందికి శిక్షణనిస్తోందని వెల్లడించారు. జీనోమ్‌వ్యాలీ మూడో దశ విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని.. దీనివల్ల మరిన్ని ఫార్మా, లైఫ్ సైన్సెస్ సంస్థల ఏర్పాటుకు వీలు కలుగుతుందని వివరించారు. నవంబర్ 18న ఫార్మా ఇండస్ట్రీకి అవసరమయ్యే ఏఐపై సమిట్నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో థర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులు ఫ్రెడ్ లోవెరీ, డేనియెల్లా క్రాంప్, టోనీ అస్సియారిటో, శ్రీనాథ్ వెంకటేశ్, సరితా రావత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
జీవో 46 ఇబ్బందులను సీఎస్‌కు చెప్పండి
- నిరుద్యోగులకు మంత్రి శ్రీధర్ బాబు సూచన
బీఆర్ఎస్ హయాంలో వచ్చిన జీవో 46తో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న తామకు తీరని అన్యాయం జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబుకు పలువురు బాధితులు మొరపెట్టుకున్నారు. బుధవారం గాంధీ భవన్ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కలిసి తమ సమస్యను వివరించారు. దీనికి స్పందించిన మంత్రి.. ఈ నెల 26 న చీఫ్ సెక్రటరీతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు.
సమస్యలను ఆమెకు వివరంగా చెప్పుకోవచ్చన్నారు.జీవో వల్ల ఏ రకంగా నష్టపోతున్నారనేది సమావేశంలో సీఎస్ కు చెప్పాలని కోరారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మంత్రి.. పలువురి సమస్యలను ఓపికగా విన్నారు. జీవో నెం 81, 85 బాధితులు కూడా శ్రీధర్ బాబును కలిశారు. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని వీఆర్ఏలు మంత్రిని కోరారు. పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఉద్యోగాలు వంటి సమస్యలపై మంత్రి శ్రీధర్ బాబును పలువురు కలిశారు. మొత్తం 328 అర్జీలను ఆయన స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అన్యాయం జరగనివ్వదని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సేవలను ఎలా వినియోగించుకోవాలో తమ పార్టీకి బాగా తెలుసన్నారు. ఆయన పార్టీలో అత్యంత సీనియర్, పార్టీలో ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలిగించబోమని స్పష్టం చేశారు.