భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలు

న్యూఢిల్లీ: భారత్ లో మత స్వేచ్ఛపై అమెరికా మళ్లీ విమర్శలు చేసింది. ఇండియాలో మత మార్పిడి నిరోధక చట్టాలు పెరిగిపోతున్నాయని తెలిపింది. రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్టు–2023ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇండియాలో మత మార్పిడి నిరోధక చట్టాలు, విద్వేష ప్రసంగాలు, మైనార్టీల ఇండ్లను, ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయడం వంటివి పెరిగిపోతున్నాయి” అని ఆయన కామెంట్ చేశారు. 

ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా దేశాల్లో మత స్వేచ్ఛను గౌరవించడం లేదన్నారు. అదే సమయంలో మత స్వేచ్ఛను కాపాడేందుకు కొందరు తీవ్రంగా పోరాటం చేస్తున్నారని కూడా ఆయన చెప్పారు. కాగా, 200కు పైగా దేశాల్లో మత స్వేచ్ఛ ఎలా ఉందనే దానిపై అమెరికా ఈ రిపోర్టు విడుదల చేసింది. భారత దేశంలోని 28 రాష్ట్రాలకు గాను 10 రాష్ట్రాల్లో దాదాపు అన్ని మతాలకు సంబంధించి మత మార్పిడి నిరోధక చట్టాలు ఉన్నాయని తెలిపింది.